Read more!

దుర్గాష్టమి విశిష్టత (Dussehra, Durgashtami, Mahanavami, Vijayadasami Festival Celebrations)

 

దుర్గాష్టమి విశిష్టత

(Durgashtami Festival Celebrations)

 

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటాం. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. వినాయక చవితి మాదిరిగానే దుర్గాష్టమి నాడు విద్యార్థులు తమ పుస్తకాలను పూజలో ఉంచి ప్రార్ధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

 

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తాం.

 

కొన్ని ప్రాంతాలవారు కాళీమాత నుదుటి నుండి దుర్గాదేవి ఉద్భవించిందని నమ్ముతారు. కనకదుర్గమ్మను కాళీమాతగా, చండీదేవిగా, రక్తబీజగా పూజిస్తారు. మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

 

నవరాత్రులను పవిత్ర దినాలుగా భావించి ఈరోజుల్లో నియమనిష్ఠలతో ఉంటారు. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నవారు కూడా ఈ విశేష దినాల్లో వాటి జోలికి వెళ్లరు. వాటిని సేవించినట్లయితే దేవికి అపచారం చేసినట్లే అని భావిస్తారు, భయపడతారు.

 

తమ పిల్లలను పాఠశాలలో చేర్చే వయసు గనుక అయితే తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

 

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. సినిమా పరిశ్రమలోనూ ఈ నమ్మకం ఉంది. ఈ రోజుల్లో అనేక సినిమాలను విడుదల చేస్తారు.

 

స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ దుర్గాదేవిని అర్చిస్తారు. దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. నవరాత్రులను పురస్కరించుకుని భక్తులు శక్తిపీఠాలను దర్శించుకుంటారు. దుర్గాష్టమి, విజయదశమి విశేష పర్వదినాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటారు.

Durgashtami Festival,Navaratri Festival, Durgashtami Festival Celebrations,Durga Pooja Festival, Durgashtami

Vijaya Dasami Greetings

Mahanavami

Vijaya Dasami Special Article

Dussehra Celebrations – Batukamma

Batukamma Songs

Sakthi Peethas