దసరాల్లో సరస్వతీదేవిని ఎలా పూజించాలి..
దసరాల్లో సరస్వతీదేవిని ఎలా పూజించాలి..
భారతీయులు అన్నింటికంటే విద్యకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. సరస్వతీదేవిని కొలిస్తే ఆ విద్యలో తిరుగుండదని నమ్ముతారు. పిల్లలు అక్షరాభ్యాసం చేయాలన్నా, కుర్రవాళ్లు పోటీపరీక్షలకు వెళ్లాలన్నా సరస్వతీ అనుగ్రహం కోసం ప్రార్థించాల్సిందే. రుగ్వేదం నాటి నుంచే మన దేశంలో సరస్వతీదేవిని ఆరాధించడం కనిపిస్తుంది. నవరాత్రుల సందర్భంగా ఆ తల్లిని కూడా మనం పూజించుకుంటాము.
సరస్వతీదేవికి నాలుగు చేతులుంటాయి. ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో జపమాల, మరో చేతిలో వీణ, ఇంకొక చేతిలో కమండలం కనిపిస్తాయి. పుస్తకం విద్యకి చిహ్నం, జపమాల ఏకాగ్రతకు గుర్తు, వీణ కళలకు ఉదాహరణ, కమండలం మంచిచెడుల విచక్షణకు సూచన. సరస్వతీదేవిని కనుక ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ దక్కుతాయన్నది పెద్దల మాట.
తెలుపురంగు స్వచ్ఛమైన వ్యక్తిత్వానికీ, జ్ఞానానికీ, ప్రశాంతతకూ చిహ్నం. అందుకనే సరస్వతీదేవికి తెలుపు రంగంటే చాలా ఇష్టం. అమ్మవారిని సరస్వతిగా కొలిచేందుకు, ఆమెను తెల్లటి వస్త్రంతో అలంకరించాలి. ఆ రోజు మనం కూడా తెలుపు రంగు బట్టలని వేసుకుంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారవుతాము. కేవలం సరస్వతీదేవిని పూజించేటప్పుడే కాదు- పరీక్షలు, రిజిస్ట్రేషన్, పోటీలు, ఇంటర్వ్యూలు... ఇలా ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు తెల్లటి బట్టలు వేసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది.
ఇక ఈ రోజు సరస్వతీ అష్టోత్తర శతనామావళిని చదువుతూ ఆ తల్లిని మారేడు దళాలతో పూజిస్తే మంచిది. అష్టోత్తరం చదవడం కుదరని పక్షంలో ‘ఓం ఐం సరస్వత్యే నమః’ అనే మూలమంత్రాన్ని జపించాలి. మారేడు దళాలు దొరకని పక్షంలో తెల్లటి పూలతో పూజించినా ఫలితం ఉంటుంది. ‘సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి.. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా॥‘ అంటూ ఈ రోజు పిల్లల చేత ప్రార్థన చేయించాలి.
సరస్వతీదేవని మనస్ఫూర్తిగా పూజించిన తర్వాత ఆ తల్లికి ఇష్టమైన కట్టుపొంగలిని నివేదించాలి. వీలైతే చదువుకునే పిల్లలకు పుస్తకాలని దానం చేయాలి. ఇక ఈ రోజు పుల్లటి పదార్థాలు తినకుండా ఉండాలని పెద్దలు నిషేదిస్తున్నారు. సరస్వతీదేవి జన్మనక్షత్రం మూల. అందుకని నవరాత్రులలో మూలా నక్షత్రం ఎప్పుడు వస్తుందో గమనించుకొని ఆ రోజు తప్పకుండా అమ్మవారిని, సరస్వతి రూపంలో పూజించాలి. దసరా సందర్భంగా ఇలా సరస్వతీదేవిని పూజిస్తే కనుక ఇంట్లో చదువు, విచక్షణ, ఆటపాటలు... వేటికీ కూడా లోటు ఉండదు.