ధూమ్రలోచన సంహారం (Dhumralochana Samharam)
ధూమ్రలోచన సంహారం
(Dhumralochana Samharam)
దేవీమహాత్మ్యాన్ని కొనసాగిస్తూ మేథాఋషి ఇలా చెప్పసాగాడు. ''భక్తులారా ! పరదేవత పలుకులు ఆలకించి క్రోధంతో, చెప్పలేనంత ఆవేశంతో సుగ్రీవ దానవుడు శుంభుని దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిన విషయాలన్నీ వినిపించాడు. ఆ మాటలు వింటూనే శుంభాసురుడు తోక తొక్కిన తాచుపాములా బుసలుకొడుతూ అతి బాల సంపన్నుడైన తన సేనాపతి ధూమ్రలోచనుడిని “ధూమ్రలోచనా ! వెంటనే వెళ్ళి ఆ దురహంకారిని బలాత్కారంగా తీసుకురా. ఆమెను రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినప్పటికీ వాళ్ళనందరినీ సంహరించి శీఘ్రమే వెంట బెట్టుకురా” అని ఆజ్ఞాపించాడు.
సుగ్రీవుడు చెప్పిన ఆ మాటలను ఆలకించిన ధూమ్రలోచనుడు ఆవేశంతో ఊగిపోయాడు. అక్కణ్ణుంచి శరవేగంగా హిమగిరి ప్రాంతం చేరాడు. దేవిని ఉద్దేశించి బిగ్గరగా “దేవీ ! నువ్వు తక్షణమే మా శుంభ ప్రభువు సన్నిధికి చేరకుంటే బలాత్కారంగా నీ కేశపాశం పట్టి నేనే తీసుకుపోవలసి వస్తుంది జాగ్రత్త” అంటూ పెద్దపెట్టున ఘీంకరించాడు.
దూమ్రలోచనుడి హేయమైన, వికృతమైన వాక్కులు విన్న శ్రీ మహాదేవి శాంత గంభీరంగా ఇలా బదులిచ్చింది. “ధూమ్రలోచనా ! శుంభాసురుడు ప్రేరేపించగా వచ్చిన మీరంతా నిస్సందేహంగా మహాపరాక్రమ సంపన్నులే. మీరు నన్ను బలాత్కారంగా తీసుకువెళ్ళగల పక్షంలో నేను చేయగలిగే దేమీలేదు” అంది.
దేవి పలుకులు ధూమ్రలోచనుడికి బేలగా అనిపించాయి. దాంతో రెచ్చిపోయి, అంబ మీదికి లంఘించాడు.
ధూమ్రలోచనుడి విపరీత ప్రవర్తనను, రాక్షస చర్యని చూస్తూనే మహామాత క్రోధంతో, ఎర్రవారిన నేత్రాలతో హుంకారం చేసింది. మాత కళ్ళనుండి బయటకు వచ్చిన అగ్నిజ్వాలల్లో పడి ధూమ్రలోచనుడు భస్మీ పటలమైపోయాడు.
అదే సమయంలో జగదంబ వాహనమైన సింహం జూలు విదిలిస్తూ అసురసైన్యంలో ప్రవేశించింది. పంజాదెబ్బలతో కొట్టే, నోటితో కొరికీ స్వైర విహారం చేస్తూ అసురసైన్యం సర్వస్వాన్నీ చీల్చి చెండాడింది. వాడిగా ఉన్న గోళ్ళతో అసురుల ఉదరాలు చీల్చివేసింది. పంజా దెబ్బలతో వాళ్ళ మస్తకాలను తుత్తునియలు చేసింది. దుష్టరాక్షసుల కాళ్ళు, చేతులు, కంఠం అనే తేడా లేకుండా అసురుల అంగాలను కొరికి రుధిర పానం చేస్తూ, మెడపై ఒత్తుగా, విలాసంగా పెరిగిన కేశాలను మహా గర్వంగా, విజయ సంకేతంగా విదిలిస్తూ రాక్షసుల గర్వాన్ని క్షణాల్లో అణచివేసింది. కొద్దిసేపట్లోనే దూమ్రాలోచనుడితో సహా రాక్షస సైన్యసర్వస్వం ఆ మృగేంద్రానికి బలైపోయింది.
Devi Mahatyam, Devi Mahatyam and Metharushi, Dhumralochana , Durgadevi Mahatyam, Devi and Dhumralochana, Devi and Dhumralochana Samharam, Dhumralochana, Durgadevi and demons