దీపారాధన
దీపారాధన
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించటాన్ని దీపారాధనం అంటాం . దేవుడిని ఆరాధించటానికన్న ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్న మాట. ముందు దీపం వెలిగించటమే కాదు షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం దీపం నైవేద్యం అయినా తప్పవు. దీపం దేవతల ముఖమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు.
దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించట మంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం . దీపాలు వెలిగించటం అన్ని మత సంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు. నేతి దీపాలు కావచ్చు. నూనె దీపాలు కావచ్చును.
మన పెద్దలు దీపారాధనకు సంబంధించి ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా అనుభవంతో చెప్పారు.
“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుండి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని, ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టేప్పుడు అనుకుంటాం. ఎంత గొప్ప భావన! ఎంతటి ఉదాత్తమైన ఆలోచన!! పెట్టేది చిన్నదీపం. ఆశించేది మూడు లోకాల చీకట్లు పోవాలని . అంతే కాదు. నరకం నుండి రక్షింపబడాలట.
మూడు వత్తులు ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఇది సాధారణంగా పెట్టే దీపం. సాధారణంగా అందరు అడ్డవత్తులు బొడ్డు వత్తులు అని చేసి, ప్రమిదలో ఒక అడ్డ వత్తి, ఒక బొడ్డు వత్తి వేస్తారు ప్రత్యేకంగా ఐదు పోగులతోనూ, తొమ్మిది పోగులతోనూ, కమల వత్తులని ఎనిమిది పోగులతోనూ, ఇంక అనేక రకాల వత్తులు చేస్తారు. అంతే కాదు రకరకాల నూనెలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తారు. ఆవునెయ్యి [దేశ వాళీ] శ్రేష్ఠం. ఆవు నేతిలో పమిడి పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగిస్తే బంగారు రంగు కాంతి వస్తుంది. తెల్లని గోడలు బంగారు మలాము చేసినట్టుంటాయి. అటువంటి వెలుగు మధ్య కూర్చుని జపమైనా, పూజైనా చేస్తే ఏకాగ్రత కుదిరి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. దీపం వెలిగించినప్పుడు ఆ దీప శిఖలు దక్షిణా వర్తంగా, అంటే, కుడి వైపుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే శుభమని నమ్మకం.
ఇంటికి అతిథి ఎవరైనా కొత్తగా వస్తే ఇల్లు చూపించేప్పుడు-విద్యుద్దీపాలు లేనప్పుడు - చేతితో దీపం పట్టుకుని చూపించుతాము కదా! అదే విధంగా దేవుడు ఉరేగేప్పుడు కాగడా పట్టుకుంటాము.
లోకాలకి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణంలాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వ జీవులకి ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సంప్రదాయం.
లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. అందుకే తమిళులు లక్ష్మీ పూజ దీప స్థంభానికే చేస్తారు. వారు మీనాక్షీ దీపాలని అమ్మవారి ప్రతిరూపం ఉన్న దీపపు కుందులను ఉపయోగిస్తారు.
--- Dr. Anantha Lakshmi