గుజరాత్ విజయదశమి వైవిధ్యం

 

గుజరాత్ విజయదశమి వైవిధ్యం

 

విజయదశమి వేడుకలు గుజరాత్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా మాత్రమే కాదు.. చాలా వైవిధ్యంగా కూడా జరుపుకుంటారు. గుజరాత్ ధనికుల రాష్ట్రం కావడంతో ఇక్కడి వేడుకలు భారీ ఖర్చుతో నిర్వహిస్తారు. గుజరాతీ వ్యాపారులు ఖర్చుకు వెనుకాడకుండా విజయదశమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

విజయదశమి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీమాతను ఆరాధిస్తారు. గుజరాత్‌లోని ప్రతి హిందూ ఇంటిలోనూ దసరా సందర్భంగా శక్తి పూజ జరుగుతుంది. ప్రతి ఇంటి గోడ మీద శ్రీ చక్రం, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని  పసుపుతో చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలకు పూజలు చేస్తారు. పొలాల నుంచి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారు చేస్తారు. ఆ వేదిక మీద బార్లీ, గోధుమ విత్తనాలను చల్లుతారు. వాటి మీద మట్టి కుండ పెడతారు. ఆ కుండను నీటితో నింపి దానిలో వక్క, వెండి లేదా రాగి నాణెం వేస్తారు. ఆ కుండమీద మూత పెట్టి దాని మీద జ్యోతి వెలిగిస్తారు. దసరా నవరాత్రులు జరిగినంత కాలం ఆ కుండను శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఆ కుండను ‘గర్భ’ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్నీ ‘కుంభీ ప్రతిష్ఠ’ అనే పేరుతో పిలుస్తారు. అష్టమి రోజున యజ్ఞాన్ని నిర్వహిస్తారు. దశమి రోజున ఆ కుండలను మహిళలు తలమీద పెట్టుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత కుండను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేస్తారు. పార్వతీమాత చిత్రపటం దగ్గర పెట్టిన ప్రమిదను గుడిలో అందిస్తారు. అనంతరం పౌర్ణమి వరకు జరిగే గర్భా ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు.

గుజరాత్ రాష్ట్రం సుందర నృత్యాలకు ఆలవాలం. విజయదశమి సందర్భంగా గుజరాత్‌లో  అమ్మవారి ముందు మహిళలు ఒక వృత్తంగా ఏర్పడి ‘గార్బా’ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మేళతాళాల కోలాహలం మధ్య జరిగే ఈ నృత్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వాయిద్యాల హోరు పెరిగే కొద్దీ నాట్యం జోరు పెరుగుతుంది. వీరు మాతను ఆశాపురా, దశాయా, ఖోఢియార్‌యాగా ఆరాధించి తరిస్తారు. ఇక గుజరాత్ ట్రేడ్ మార్క్ అయిన దాండియా సంగతి సరేసరి. ఈ తొమ్మిది రోజులూ గుజరాతీ యువతీ యువకులు అలసిపోయేలా దాండియా ఆడతారు. ఇక చివరి రోజున రావణ, కుంభకర్ణ, మహిషాసుర బొమ్మలను దగ్ధం చేస్తారు.