Read more!

చంద్రశేఖరేంద్రస్తుతి తెలుగు అర్థంతో

 

చంద్రశేఖరేంద్రస్తుతి తెలుగు అర్థంతో

 

 

 

 

1.కరుణా పర పర్యాయ కటాక్ష ప్రసృతి ప్రభః
చిత్తస్య శాంతి దాతా మే హృది స్యాత్ చంద్రశేఖరః


అర్థం:     ఆయన కొనకంటి చూపు నుంచీ ప్రసరంచే కాంతి కరుణాపరత్వానికి మరో రూపం అనేలా ఉంటుంది. అలా మనస్సుకు శాంతి నిచ్చే వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.
 
2.కామేశ తత్త్వ సర్వస్వ కలనామల మానసః
అమృతాత్మా సమాత్మా మే హృది స్యాత్ చంద్రశేఖరః


అర్థం: తంత్ర శాస్త్రంలోని 'కామేశ్వర' అనే తత్త్వమంతా నిండిన స్వచ్ఛమయిన మనసు వారిది. ఉపనిషత్తులలోని 'అమృతాత్మ' తత్త్వం తో సమానమయిన తత్త్వం (స్వభావం) గలవారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.
 
3.దక్షిణా చిన్మయీ మూర్తిః యస్య విశ్వాతిశాయినీ
దక్షిణామూర్తి రూపో మే హృది స్యాత్ చంద్రశేఖరః


అర్థం: ఎవరి దక్షిణమయిన (దక్షిణాభిముఖమయిన/ప్రసన్నమయిన) చిన్మయం (జ్ఞానమయం) అయిన రూపం విశ్వాన్నే దాటి వెళ్లేంత విస్తృతమైనదో అటువంటివారూ అలా దక్షిణామూర్తి దేవుని రూపమే అయిన వారూ అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.
 
4.నిరంతర నిరాలంబ నిరంజన మహోమయః
మాయావృతి మతీతో మే హృది స్యాత్ చంద్రశేఖరః


అర్థం: ముక్కలుగా, దశలుగా తెగనిదీ ఆధారం అవసరం లేనిదీ అత్యంత స్వచ్ఛమయినదీ అతిపెద్ద(గొప్ప) తనముతో నిండినదీ అయిన పరమాత్మ తత్త్వమే వారు. మాయ చేత కప్పబడటమనే (సామాన్య జీవులన్నింటి/లోకమంతటి) స్వభావానికి అతీతమయిన వారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.
 
5.ఏకామ్రేశేన కామాక్ష్యా శ్రుతిమాత్రా సతా చితా
పరేణాభిన్న రూపో మే హృది స్యాత్ చంద్రశేఖరః


అర్థం: కాంచీ పురంలోఉన్న ఏకామ్రేశ్వరుడనే శివుడూ వారూ వేరు వేరు కారు. కాంచీ పురంలోఉన్న కామాక్షీ అమ్మవారూ వారూ వేరు వేరు కారు. వేదమాత అయిన గాయత్రీ అమ్మవారూ వారూ వేరు వేరు కారు.(ఉపనిషత్తులలో పరమాత్మతత్త్వం గా చెప్పబడిన) 'సత్' (ఉనికి) అనే తత్త్వమూ వారూ వేరు వేరు కారు.(ఉపనిషత్తులలో పరమాత్మతత్త్వం గా చెప్పబడిన) 'చిత్' (జ్ఞానం) అనే తత్త్వమూ వారూ వేరు వేరు కారు.( ఉపనిషత్తులలో పరమాత్మతత్త్వం గా చెప్పబడిన) 'పరా' (అన్నింటికీ అతీతమయినది) అనే తత్త్వమూ వారూ వేరు వేరు కారు. అట్టివారయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నా హృదయములో నిలచి యుందురు గాక.