పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటి!
పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటి?
పుట్టిన రోజుని ఒక వేడుకగా జరుపుకోవటం అన్ని దేశాల సంస్కృతులలోను అంతర్భాగం. అవతార పురుషులు, అధ్యాత్మిక గురువులు, జాతిని నడిపించిన నాయకులు, ఏవైనా ఘనకార్యాలు చేసినవారు కల కాలం గుర్తుంచుకోవలసిన వారు కనుక వారి జన్మ దినాన్ని జయంతి పేరుతో వైభవంగా జరుపుకుంటాం.ప్రతి వ్యక్తి తనని తాను విశిష్టుడుగానే పరిగణించుకుంటాడు. తన పుట్టుక ఒక ఘన కార్యంగా భావించుకుంటాడు. కనుక ఆ రోజుని పండుగ గా జరుపుకోవాలనుకుంటాడు. ఐతే, ఆ వేడుకని ఎలా జరుపుకోవాలో మాత్రం సరిగా తెలియదు. తలంటి పోసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, అర్ధరాత్రి కొవ్వొత్తులు ఆర్పి కేకులు కోయటం, అందరి మొహానా దానిని రుద్దటం , స్నేహితులతో కలిసి సరదాగా సినిమాలు, షికార్లు తిరగటం ..... ఇంతే ! అనే అభిప్రాయం అందరి మనస్సుల్లో బాగా నాటుకు పోయింది. అంతేనా? ఇవి ఎప్పుడైనా ,ఏ పండగకైనా చేసేవే కదా? పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటి?
రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడ లేక సుఖ శాంతులతో, శుభావహంగా ఉండాలని కోరుతూ చేసే క్రియా కలాపమే పుట్టిన రోజు వేడుక. దీనికి మన పెద్దలు ఒక పద్ధతిని సూచించారు. ఉదయం (ఒకప్పుడు అందరు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచే వారు. కనుకనే వారికి కంటి చూపు బాగుండేది.) నిద్రలేవగానే ఇంట్లో పెద్దలు తలకి నూనె పెట్టి , మంగళ హారతి ఇచ్చిన తరువాత అభ్యంగన స్నానం చేయాలి. క్రొత్త బట్టలుధరించి, ఇంట్లో దేవుడికి నమస్కారం చేయాలి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకోవాలి. వీలైతే దేవాలయానికి వెళ్ళటం ఉత్తమం. భోజనంలో పరమాన్నం తప్పక చేస్తారు సంప్రదాయం తెలిసిన పెద్దలు. పాలు (వీలైతే ఆవు పాలు), బెల్లంతో వండిన అన్నం శుభప్రదం. దేవతా ప్రీతికరం. ఆయుర్వృద్ధి కరం. అందుకనే అన్ని శుభ కార్యాలలో పరమాన్నం చేస్తారు.
పూర్వపు రోజుల్లో పిల్లల పుట్టిన రోజంటే పేరంటం చేసే వారు. ముత్తైదువ లందరు కలిసి పాటలు పాడుతూ మంగళ హారతులిచ్చే వారు. అక్షతలు వేసి ఆశీర్వదించే వారు. వారందరికీ పసుపు కుంకుమలు, తాంబూలాలతో పాటు తమ శక్తి కొద్ది కానుకలు కూడా ఇచ్చే వారు. ఇపుడు పేరంటాల స్థానంలో పార్టీలు వచ్చాయి. మంగళ హారతి స్థానాన్ని అమంగళ కరమైన దీపాలార్పటం ( కొవ్వొత్తుల నార్పటం) ఆక్రమించింది. దీపం వెలిగించటం శుభం. దీపం ఆర్పటం అశుభం. శుభ కార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించటం భారతీయ సంప్రదాయం. పుట్టిన రోజు పండుగ ,అంటే శుభ కార్యమే కదా. దేవతా ప్రీతికరంగా, దైవానుగ్రహం కోరి చేసే పనిలో కోడి గ్రుడ్డుతో చేసిన కేకు ప్రాధాన్యం వహిస్తోంది . ఈ రెండు పద్ధతుల్లో ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా!
మరి , పుట్టిన రోజుని ఈ రోజులకు తగినట్టుగా చేసుకునే విధానం ఏదైనా ఉందా? అంటే, ఉన్నదనే చెప్పాలి. మనం చాంద్ర మానాన్ని అనుసరించే వారం కనుక తిథుల ననుసరించి పుట్టిన రోజు జరుపుకోవటం సరైన పద్ధతి. ఇంట్లో అమ్మ కానీ, ఇంకా పెద్దవారు కాని, ముఖాన బొట్టు పెట్టి, నువ్వుల నూనెతో తల అంటి, హరతిచ్చాక అభ్యంగన స్నానం చెయ్యాలి. కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అంత కన్నా ముందు ఇంట్లో దేవుడికి, పెద్దలకు నమస్కారం చేయాలి. పేరంటం అన్నది పాత పద్ధతి అయి పోయింది . కనుక పార్టీ అనుకునే విధంగా బంధు మిత్రులని ఆహ్వానించి ఇష్ట దైవం ముందు ఎన్నో పుట్టిన రోజో అన్నీ దీపాలు “ ఉద్దీప్యస్వ .................నిరృతిమ్ మమ” అనే మంత్ర చదువుతూ వెలిగించి, వేడుక ప్రారంభించాలి. పాలు తేనె కలిపిన మిశ్రమాన్ని పాత్రలో పోసి, ఉద్ధరిణ (చెమ్చా)తో గుండ్రంగ కలుపుతూ “ త్ర్యంబకం యజా మహే సుగంధిం పుష్టి వర్ధనం ...... “ అనే మృత్యుంజయ మంత్రాన్ని ముమ్మారు పలకాలి.
దానిని స్వీకరించాలి. మెత్తని మధుర పదార్థాన్ని ( హల్వా , కలాఖండ్ వంటివి) పళ్ళెంలో నింపి, దానిపై వజ్రపు గుర్తుని (ముందుగా మిఠాయిని సగం చేస్తూ మధ్యలో నిలువు గీత, దానిని ఖండిస్తూ అడ్డ గీత, ఈ గీతల నాలుగు కొనలని కలుపుతూ నాలుగు గీతలు, వీటి నన్నింటిని చుట్టి పరిధిలాగా ఒక వృత్తము ) నెమ్మదిగా , మృదువుగా లిఖించాలి. ఆ సమయంలో వచ్చిన వారందరు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు మంగళ హారతి నిచ్చి పెద్దలు అక్షతలను వేసి ఆశీర్వదించాలి. చిన్న వారు పాదాల వద్ద పూలు ఉంచి , నమస్కారం చేసి, వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అప్పుడు ఆ తీపి పదార్థాన్ని అందరూ భగవంతుని ప్రసాదంగా తీసుకోవాలి. ఆ పై విందులు వినోదాలు యథేచ్ఛ. ఈ విధానం లో పెద్దల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహం పొందటం, ఆనందం ఉన్నాయి .
పుట్టిన రోజు చేసిన పని ఏదైనా సంవత్సరమంతా నిరాఘాటంగా సాగుతుందని నమ్మకం . అందుకని ఆ రోజు మంచి పనులు చేయాలనుకుంటారు. అందుకనే బీదలకు అన్న దానం , అనాథాశ్రమాల్లో, ఆసుపత్రుల్లో పళ్ళు, ఫలహారాలు , వస్త్రాలు, దుప్పట్లు మొదలైనవి పంచటం వంటి సామాజిక కార్య క్రమాలు చేసి తమకు వారి ఆశీర్వాదం లభించిందని తృప్తి పొందుతూ ఉంటారు.
నిజానికి జీవితంలో ఒక సంవత్సరం గిర్రున తిరిగి వచ్చిందంటే , కొత్త సంవత్సరం మొదలయిందంటే అప్పటివరకూ, కనీసం జరిగి పోయిన సంవత్సరం, ఏం సాధించామని పర్యాలోచన చేసుకొని లక్ష్య సాధనకు కేటాయించ బడిన సమయంలో ఒక ఏడాది అయి పోయింది కనుక ఇక ముందు ఏమి సాధించ దలచుకున్నామో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. అందుకనే అప్పుడు పెద్దల ఆశీస్సులతో పాటు మార్గ దర్శనం అవసరమౌతుంది.
Dr Anantha Lakshmi