Read more!

భగవద్గీత రెండవ అధ్యాయం పారాయణం చేస్తే కలిగే ఫలితం ఏంటో తెలుసా..

 

భగవద్గీత రెండవ అధ్యాయం పారాయణం చేస్తే కలిగే ఫలితం ఏంటో తెలుసా..


భగవద్గీత గొప్ప గ్రంథం. దీన్ని పారాయణం చేయడం వల్ల ఎన్నో విషయాలు అవగతం అవుతాయని, మనుషులకు ఆత్మజ్ఞానం కలుగుతుందని చెబుతారు. అయితే భగవద్గీతలో రెండవ అధ్యాయం పారాయణ చేస్తే కలిగే ఫలితం గురించి ఓ కథ ఉంది .


పూర్వం దాక్షిణాత్యంలో పురందరమనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక యాగాలు చేసినా, ఎన్ని సత్కర్మలు చేసినా, ఎంత అతిథి పూజలు చేసినా ఆత్మజ్ఞానం కలగలేదనే అసంతృప్తితో మనశ్శాంతి కరువై కుంగిపోతూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక సాధుపుంగవుడు విచ్చేశాడు. అతణ్ణి అన్ని విధాలా పూజించి, నాకు ఆత్మజ్ఞానోపాయాన్ని తెలియచెప్పాల్సిందిగా వేడుకున్నాడు. మనశ్శాంతికి మార్గం చూపించాల్సిందిగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు, “నాయనా! చింతించకు. సౌపురం అనే ఊరిలో మిత్రవంతుడు అనే ఒక పశువుల కాపరి ఉన్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళు" అని చెప్పి పంపాడు. అక్కడ మేకలు కాచుకుంటున్న మిత్రవంతుని వద్దకు వెళ్ళి, సాధువు పంపగా వచ్చానంటూ సంగతి చెప్పాడు.


అప్పుడు మిత్రవంతుడు ఈ విధంగా చెప్పాడు:


"నేను ఒకనాడు మేకలను మేపుతుండగా ఒక పెద్దపులి వచ్చింది. నేను, నా వందలాది ప్రాణులు భయంతో కకావికలై పరుగెత్తాం. అలా పరుగెడుతూ ఉండగా ఆ  స్థలమాహాత్మ్యం ఏమిటో గానీ నా మందలోని ఒక మేక, ఆ పులి స్నేహంగా ప్రేమగా ఒక చోట కూర్చుని ఉండడం చూశాను. విస్మయంతో చుట్టూ పరికించాను. అక్కడొక వానర శ్రేష్ఠుడు కనిపించాడు. అతని వద్దకు వెళ్ళి, “వానర శ్రేష్ఠా! లోకంలో ఇలాంటి వింత ఎన్నడూ చూడలేదు. పులి మేకల మధ్య ఇంతటి సఖ్యం వింతగా ఉంది. కారణమేమిటి?" అని అడిగాను.


అప్పుడా వానరం, “మిత్రమా! ఇక్కడికి సమీపంలో ఒక దేవాలయం ఉంది. అక్కడ సుకర్మ అనే వ్యక్తి జ్ఞాన ప్రాప్తి కోసం ఈశ్వరోపాసన చేయడం ప్రారంభించాడు. అతనికి మేలు చూకూర్చాలని ఒకనాడు ఓ అతిథి వచ్చాడు. ఒక శిలాఫలకం మీద భగవద్గీత రెండవ అధ్యాయాన్ని చెక్కి, 'సుకర్మా! ప్రతిదినం ఈ గీత రెండో అధ్యాయాన్ని అభ్యాసం చెయ్యి' అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పటి నుంచి సుకర్మ ఆ అతిథి చెప్పినట్లే గీత ద్వితీయ అధ్యాయాన్ని పారాయణం చేయసాగాడు. కొంతకాలానికి అతని చిత్తం నిర్మలమై, ఆత్మజ్ఞానం ప్రాప్తించింది. అప్పటి నుండి అతడు అడుగుపెట్టిన ప్రదేశమంతా పునీతమై, రాగద్వేష రహితమై, క్రూర జంతువులు కూడా కామక్రోధాలు జయించి అన్యోన్యంగా మెలగుతూ ఉంటున్నాయి" అని చెప్పాడు. 


 దాంతో, నేను కూడా ఆ శిలాఫలకం వద్దకు వెళ్ళాను. ఆ మహనీయుని అనుగ్రహంతో గీత రెండో అధ్యాయాన్ని అభ్యసించాను. తద్వారా ఆత్మజ్ఞానానుభవం పొందాను. కనుక నువ్వు కూడా వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందు!” అన్నాడు పశువుల కాపరి మిత్రవిందుడు.


మిత్రవిందుడు చెప్పినట్లుగా దేవశర్మ కూడా శిలాఫలకం మీది గీతను అభ్యసించి, మననం చేసి చేసి, క్రమక్రమంగా ఆత్మజ్ఞానాన్ని పొందాడు. బ్రహ్మపదప్రాప్తిని పొందాడు. కనుక గీత ద్వితీయాధ్యాయ ఫలం ఆత్మజ్ఞాన ప్రాప్తి అని తెలుస్తోంది.


                                        *నిశ్శబ్ద.