మన ఆలోచనా విధానమే మన భవిష్యత్తు

 


దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలయినంత తొందరగా బయటపడాలని తపిస్తాం. ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే వుండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా, సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే . అవి రెండూ మనమనుకున్నట్లు శాశ్వతం కావు. పాదరసంలా అవి మన పట్టునుండి జారిపోతాయి. మనల్ని మనం తెలుసుకోవాలంటే మన హద్దుల్ని దాటి మనల్ని మనం చూడగలగాలి..అలా చూసినప్పుడే మన మనస్సు స్వచ్ఛమయిన సరోవరంలా తళతళలాడుతుంది.

మనం అంటే మన ఆలోచనలే. అవే మనల్ని రూపొందించాయి. మాటల కన్నా అవే ముందుంటాయి, జీవిస్తాయి, నడిపిస్తాయి. మనం పెంపొందించుకునే ఆలోచనా విధానమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మన హృదయ క్షేత్రంలో ఏ విత్తనాలు నాటుతామో వాటి పంటనే రేపు మనం అనుభవిస్తాం. జీవితం ఓ నిండుకుండలా ఉండాలనుకోవటం సరికాదు. అనేక అడ్డంకులు, సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం. భవిష్యత్తును అద్భుత చిత్రంగా మలచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది.

 

---అనిల్