గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే జరిగేదేంటో తెలుసా!

 


గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే జరిగేదేంటో తెలుసా!


ఒకసారి ఒక మహానుభావుడు క్షేత్ర యాత్ర చేస్తూ అమ్మవారిని దర్శించు కున్నాడట. ఆ అమ్మవారి కళ్ళల్లో ఉగ్రకళ ఉన్నదట.. కానీ ఆయనకి ఉగ్రం కనపడలేదట, ఎందుకంటే అమ్మ ఏ రూపంలో ఉన్నా వాత్సల్యాన్నే వర్షిస్తుంది. ఆ భక్తుడు అమ్మవారికి నమస్కరించి వస్తుంటే ఊళ్ళోవాళ్ళు అతనికి నమస్కరించి మమ్మల్ని అమ్మవారు రక్షిస్తోంది కానీ, అమ్మవారిని చూస్తుంటే భయం వేస్తోంది. ఆ కళ్ళల్లో ఉగ్రత్వం కనిపిస్తోంది అన్నారట. అప్పుడాయన ఆలోచించి అమ్మకు ఎదురుగా గణపతిని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారు. గణపతి ప్రతిష్ఠ చెయ్యగానే అమ్మ కళ్ళల్లో ఉగ్రకళ పోయి వాత్సల్యకళ వచ్చిందట.


ఆ ఇద్దరు పిల్లల్నీ తలచుకుంటే అమ్మకు ఆనందం. అందుకే లలితా సహస్రంలో “కుమార గణనాథాంబా తుష్టిః పుష్టి ర్మతిర్దృతి" అని చదువుకుంటున్నాం. అదేవిధంగా “మత్తేభ వక్త్రత షడ్వక్ష వత్సలాయై నమో నమః" అని లలితా అష్టోత్తరంలో చెప్పుకుంటున్నాం.

అసలు వీళ్ళిద్దర్నీ తలచుకుంటే చాలు వాళ్ళ అమ్మా నాన్నలకు వేరే పెద్దపని ఉండదు. అన్ని పనులూ వీళ్ళే చక్కబెట్టేస్తారు. గణపతి ఇవ్వలేనిది లేదు. తుష్టి, పుష్టి, సిద్ధి, బుద్ధి, క్షేమం, లాభం - ఈ ఆరు శక్తులూ ఆయన దగ్గర ఎప్పుడూ ఉన్నాయి. ఆయన సర్వవిఘ్న సంహారకుడు. ఇక రెండో ఆయనా గణపతే! ఒకే కుమార తత్త్వం రెండు విధాలైంది. ఒకడు ఎక్కడకూ కదలకుండా, కూర్చునే అన్ని పనులూ చెయ్యగలడు. రెండోవాడు కదిలి అన్ని పనులూ చేస్తాడు. ఒకటి స్థిరశక్తి (స్టేటిక్ ఎనర్జీ), రెండవది చలనశక్తి (డైనమిక్ ఎనర్జీ). పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి ముజ్జగాలూ తిరిగానని అనిపించుకున్నాడు ఒకడు. ముజ్జగాలూ తిరిగాడు మరొకడు. ఇద్దరూ రెండు సత్యాలు చూపించారు. విశ్వమంతా వ్యాపించిన శివశక్తులను చూసిన వాడు సుబ్రహ్మణ్యుడైతే, అక్కడే ఉన్న స్థాన చైతన్యాన్ని చూసినవాడు గణపతి.


ఆసురీ శక్తులు విజృంభించినప్పుడు వాటి ప్రతాపం చేత దేవతాశక్తులు క్షీణించి చెల్లాచెదరైపోతాయట. అవీ శక్తిమంతములే కానీ చెల్లాచెదరైపోయాయి. వాటన్నిటినీ ఒకచోట సమకూర్చి నడిపించాలి అంటే ఈ దేవసేనాపతి అవసరం ఉంది. అలా సర్వులనూ ఒక చోట సమకూర్చి లోక కల్యాణం సాధించాలి అనేటటువంటిది సుబ్రహ్మణ్య తత్త్వంలో ఉన్న విశేషం. "సేనానాయకుల్లో స్కందుణ్ణి (స్కందు డంటే దేవసేనాపతి) నేను" అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో చెబుతాడు. అందుకు దైవీ శక్తుల రక్షణ కోసం సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థించాలి అన్నారు. ఆయన శివశక్తుల ఏకస్వరూపుడట! ఆయనకు అయ్యవారి ఐదు ముఖాలూ ఉన్నాయట, అమ్మవారి ఏక ముఖమూ ఉంది. ఆయన ఉపాసనలో యజ్ఞరహస్యాలు చాలా ఉన్నాయి. ఆయన యజ్ఞాగ్ని స్వరూపుడైనటువంటి వాడని చెబుతోంది స్వామి తత్త్వం.


 యజ్ఞాలలో సర్వదేవతలనూ తృప్తి పరచి, సమీకరించి ఆ దేవత యొక్క అనుగ్రహం పొందడం అనే తత్త్వమే సుబ్రహ్మణ్యుని చరిత్రలో మనకు గోచరిస్తోంది. గణపతి, సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరికీ నమస్కరించగానే అన్ని పనులూ జరిగిపోతాయి. అటు తరువాత ఇక అమ్మ- అయ్యల దగ్గర మనం కోరుకోవడానికి ఏమీ మిగలవు, మనమూ వాళ్ళే మిగులుతాం. ఆ స్థితికి చేర్చగలిగే వాళ్ళు వీళ్ళిద్దరూ! వీళ్ళిద్దరినీ తలచుకోగానే ఆ మాతాపితరుల యొక్క సాన్నిధ్యానుభవం మరింత దృఢంగా లభిస్తుంది.


                             *నిశ్శబ్ద.