దేవాలయంలో గంట ఎందుకు మ్రోగిస్తాం?
దేవాలయంలో గంట ఎందుకు మ్రోగిస్తాం?
చాలా దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేక ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి మరియు ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు. పిల్లలు ఎత్తుగా ఉన్న గంటను పైకి ఎగిరి లేక ఎత్తుకోబడి మ్రోగించడానికి ఇష్టపడతారు. మనము గంటను ఎందుకు మ్రోగిస్తాము? భగవంతుడిని నిద్ర లేపడానికా? కానీ దేవుడు ఎప్పుడూ నిద్రపోడు. భగవంతునికి మనము వచ్చినట్లు తెలియచేయడానికా? ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తెలుపవలసిన అవసరము లేదు. ఆయన ప్రాంగణము లోనికి రావడానికి అనుమతి కొరకా? అది స్వంత ఇంటికి వస్తున్నట్లే గనుక రావడానికి అనుమతి తీసుకోవలసిన అవసరము లేదు. భగవంతుడు మనలని ఎల్లవేళలా ఆహ్వానిస్తుంటాడు.
మరి మనం గంటను ఎందుకు మ్రోగిస్తున్నట్లు?
గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దము మంగళకరమైన ధ్వనిగా పరిగణించ బడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమయిన 'ఓంకార' నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని యొక్క దర్శనము పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట మ్రోగిస్తాం. వైదిక క్రియా పరంగా 'హారతి' ఇచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది. మ్రోగే గంట, శంఖము మరియు ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి. ఇది గంట మ్రోగించడంలోని అదనపు సంకేతము.
మనము చేసే నిత్య పూజ ఆరంభములో ఇలా చెపుతూ గంటను వాయిస్తాము.
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దాని వలన సద్గుణ దైవీపరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాలనుండి వైదొలగు గాక!