నీలమణి రత్నం ధరిస్తున్నారా... ఈ తప్పులు చేయకండి!

 

నీలమణి రత్నం ధరిస్తున్నారా... ఈ తప్పులు చేయకండి..!


జ్యోతిష్యంలో చెప్పే అదృష్ణ రాళ్లలో నీల మణి రత్నం కూడా ఒకటి.  నవరత్నాలలో ఈ రత్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  ఇది చాలా శక్తివంతమైన రత్నం గా పరిగణించబడుతుంది. నీలమణి రత్నం అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజం ద్వారా ఏర్పడుతుంది. ఇది నీలం రంగులో ఉన్నా ఇతర రంగులలో కూడా లభిస్తుంది.  అయితే దీన్ని ధరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహాను తప్పక పాటించాలని చెబుతారు.  నీల మణి రత్నం ధరించే వారు చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

నీల మణి రత్నం శనిదేవుడికి సంబంధించినది అని చెబుతారు.  ఈ రత్నం ధరించే వారి మీద శనిదేవుడి ఆశీర్వాదం ఉంటుందట.  ఈ రత్నం దరించిన వారికి శనిదేవుడు ఐశ్వర్యం, ఆనందం చేకూరుస్తాడని చెబుతారు.

చాలామంది నీల మణి రత్నం ధరించే నియమాలు తెలుసుకోకుండా ధరిస్తారు.  ఈ రత్నాన్ని వెండి లేదా సప్త ధాతువులలో ఏదో ఒక దాంట్లో పొందుపరిచి ధరిస్తారు.

నీల మణి రత్నం ధరించే వారు  పొరపాటున కూడా మద్యం తాగకూడదు.  మద్యం అలవాటు ఉన్నవారు ఈ రత్నాన్ని ధరించే ముందు మద్యాన్ని మానేసిన తర్వాతే ధరించాలి.

నీల మణి రత్నాన్ని ధరించిన తర్వాత దాన్ని పదే పదే తీయకూడదు.  ఇలా చేయడం వల్ల ఈ రత్నం ప్రభావం కోల్పోతుంది. పెద్దవారు కూడా ఈ కారణంగానే రత్నాలు ధరించిన తర్వాత తీయకూడదని చెబుతారు.

ఎవరైనా నీల మణి రత్నం కొనుగోలు చేసి దానిని పూజించి ధరిస్తే.. దాన్ని మరొకరు ధరించడానికి అనుమతి ఇవ్వకూడదు.  ఒకరు ధరించిన నీలమణి రత్నాన్ని ఇంకొకరు ధరించకూడదు.  ఇది రత్నంలో శక్తిని ప్రభావితం చేస్తుంది.

నీలమణి రత్నాన్ని ధరించిన వారు ఎప్పుడూ సోమరితం తో ఉండటం,  ఇతరులకు హాని చేయడం,  చెడు ఆలోచనలు చేయడం,  ఇతరుల పట్ల  అన్యాయంగా ప్రవర్తించడం వంటివి చేయకూడదు.  ఇలా చేస్తే శని దేవుడు  కోపిస్తాడు. శనిదేవుడికి ఇతరుల పట్ల దయ కలిగి ఉండటం వంటి వ్యక్తిత్వం అంటే ఇష్టం. ఇలాంటి వారికే తన  ఆశీర్వాదం ఇస్తాడు.  అందుకే శని దేవుడి ఆశీర్వాదం ఉండాలంటే నీలమణి ధరించినప్పుడు పై పేర్కొన్న తప్పులు చేయకూడదు.

                               *రూపశ్రీ.