Read more!

భక్తుడే భగవంతుడు

 

భక్తుడే భగవంతుడు

దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశిస్తుంది. ఈ దేహానికి ఉన్న పేరు, ఈ దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలూ, దినచర్య.... అన్నీ ఒకే ఒక్క దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష పట్టగానే ఆ వ్యక్తికి పేరు అంతర్థానమై 'స్వామి' గానే పిలవబడుతుంటాడు. మమకారాన్ని విడిచిపెట్టి, స్వామి ఆకారాన్ని మనసులో ప్రతిష్టించుకోవడం ఏ క్షణాన మొదలవుతుందో అప్పుడే మానవుడు మాధవునిగా పరివర్తించడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికీ భగవంతునికీ తేడా ఉండదు. అబేధ్యమే...ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమతబేధాలులేని, తరమత బేధాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమలై.

నవవిధ సేవలు :-
నవవిధ సేవలతో అయ్యప్పస్వామిని పార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మనివేదనలతో అయ్యప్పని కొలుస్తుంటారు. స్వామి దీక్షలో ఇరుముడికి విశిష్టథ ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందు ఉన్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామివారికి సమర్పించే వస్తువులు ఉంచుతారు. వెనుక ఉన్న ముడిలో యాత్రకు అవసరమయ్యే పదార్థాలను ఉంచుకుంటారు. కొబ్బరికాయను  నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటారు.

కొబ్బరికాయకు బిగించే కార్క్ ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూత పెడతారు. ఆపైన కాయకు ఆత్మ అనే లక్కతో సీల్ వేస్తారు. ఈ జ్ఞానమనే నేయ్యితోనే సన్నిధానంలో స్వామి అయ్యప్పకు నిండుమనసుతో అర్పించుకున్నట్లు భావించాలి. దీన్నే ఆత్మ నివేదన మంటారు. స్వామి దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అన్న అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరుచేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్యజ్యోతి దర్శనమవుతుంది. అదే మకరజ్యోతి.

పదునెట్టాండి (18 మెట్లు):-
స్వామి సన్నిధానంలో ఉండే 18 మెట్లను పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులు  ఎనిమిది మంది (ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు), రెండు యోగములు (కర్మయోగం, జ్ఞానయోగం), విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కేముందు కొబ్బరికాయను కొట్టి ఆ నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత మాలిగై పుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలు దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ప్రతి ఏటా నవంబర్ మధ్య నుంచి జనవరి వరకు శబరిమలై భక్తకోటితో పులకించిపోతోంది.

రెండున్నరమాసాల పాటు దేశంయావత్తు, మరీ ముఖ్యంగా దక్షిణభారతం శరణుఘోషతో మారుమ్రోగిపోతుంటోంది. ప్రతిరోజు సుమారు ఐదారులక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానదితీరం నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే, పంపానది నుంచి సుమారు, 4,135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్భాల్యాలనీ , శారీరక సౌఖ్యాలనీ మండించి బూడిద చేయగల దైవమార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్షమార్గం కళ్లెదుట కనబడుతుంది.