Read more!

ప్రపంచంలోనే మొదటి డాక్టర్ ధన్వంతరి (Ayurvedic Doctor Dhanwantari)

 

ప్రపంచంలోనే మొదటి డాక్టర్ ధన్వంతరి

(Ayurvedic Doctor Dhanwantari)

 

ప్రపంచంలో మొదటి డాక్టర్ ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టిన పర్షియన్ అని, ఎలిజబెత్ బ్లాక్ వెల్ మొదటి మహిళా డాక్టరని (Elizabeth Blackwell) చెప్పుకుంటాం. నిజానికి ప్రపంచంలో మొదటి డాక్టర్.. అందునా తొలి శస్త్ర వైద్యుడు మనవాడే కావడం ఎంత గర్వకారణం?! ఇది అతిశయోక్తి కాదు, అక్షరసత్యం. ఆ మొదటి వైద్యుడు, తొలి శస్త్ర చికిత్స చేసిన మహోన్నతుడు ఎవరో కాదు.. ధన్వంతరి. ప్రపంచంలోనే మొదటి, అపురూపమైన ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని అందించిన ధన్వంతరి మనకు దైవంతో సమానం.

 

''ధన్వంతరి'' అనే పదాన్ని మనం చాలాసార్లే విని ఉంటాం. ధన్వంతరి ప్రస్తావన మన ప్రాచీన గ్రంధాల్లో, ధార్మిక ప్రచారాల్లో, వ్యావహారిక కథల్లో - అనేక సందర్భాల్లో వస్తుంది. అయితే, వివరాలు మాత్రం అంతగా తెలీదు. అందుకే ఒకసారి గుర్తుచేసుకుందాం.

 

ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత అని అర్ధం. సముద్ర మథనం తర్వాత ధన్వంతరి స్వామి ఒక చేతిలో అమృత భాండాన్ని, మరో చేతిలో శంఖాన్ని, ఇంకో చేతిలో చక్రాన్ని, మరో చేతిలో జలౌకా ధరించి దర్శనమిచ్చినట్లు పురాణాలు వర్ణించాయి.

 

అందుకే ఆయుర్వేద వైద్యం తెలిసిన మహా మేధావిని ధన్వంతరి పేరుతోనే పిలుచుకుంటున్నాం. ధన్వంతరి చెట్ల వేళ్ళు, కాండం, ఆకులు, పూవులతో అనేక ఔషధాలు తయారుచేశాడు. ఆ దివ్య ఔషధాలతో జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు మొదలు పక్షవాతం, కామెర్లు, రాచపుండు (ప్రస్తుతం కాన్సర్ అంటున్నది దీన్నే) లాంటి పెద్ద వ్యాధుల వరకూ అనేక వ్యాధులను నివారించే మందులు కనిపెట్టాడు. పసుపును క్రిమి సంహారిణిగా (యాంటీ బయాటిక్) ఉపయోగించాడు. ప్రపంచంలోనే తొలి శస్త్ర చికిత్స చేసిన మహానుభావుడు ధన్వంతరి. ఇంకా ఘనమైన సంగతి ఏమంటే ఆ ప్రాచీన కాలంలోనే ధన్వంతరి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు చెప్పే కథనాలు అనేకం ఉన్నాయి. అంత మహానుభావుడైన ధన్వంతరిని దైవంగానే ఆరాధించాలి.

 

ఉత్తర భారతంలో ధన్వంతరికి చెప్పుకోదగిన ఆలయం అంటూ లేదు కానీ దక్షిణ భారతంలో ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. బెంగళూరులో ఈ దేవతకు ఒక ఆలయం ఉంది. అలాగే తమిళనాడు శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ధన్వంతరి ఆలయం ఉంది.

 

పూర్వం ధన్వంతరి వైద్య విధానాన్ని, ఆయన సూత్రాలను ఆయన శిష్యులు ఎందరో పాటించేవారు. యుద్ధ సమయంలో తక్షణ చికిత్స అందించేవారు. అవసరమైనవారికి శస్త్ర చికిత్స చేసేవారు. ఇప్పటిలా సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందకముందే, అత్యాధునిక వైద్య పరికరాలు అమరకముందే అబ్బురపరిచే ధన్వంతరి శస్త్రచికిత్స ఉండటం ఎంత ప్రశంసనీయం?!

 

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యుని వద్ద (భాస్కరుడు) ధన్వంతరి ఆయుర్వేదం నేర్చుకున్నట్లుగా కధనం ఉంది. సూర్యుని 16 శిష్యుల్లో ధన్వంతరి ఒకరు. కాశీరాజు దేవదాసు ధన్వంతరి శుశ్రుతునికి ఆయుర్వేద వైద్య శాస్త్రం నేర్పించాడు. అందులో ఇప్పుడు సర్జరీ అని పిలుచుకుంటున్న శస్త్ర చికిత్స ఉంది. ఈయన "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని కూడా రచించినట్లు ఆధారాలున్నాయి. పూర్వం ప్రతిభావంతులైన ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" బిరుదుతో సత్కరించేవారు. "ధన్వంతరి" అనేది కాశీరాజు బిరుదు. ఆ బిరుదుతోనే ఆయన ప్రఖ్యాతుడయ్యాడు. ఈ కాశీరాజు పురాణ కథల్లోని ధన్వంతరి అవతారం.

 

Ayurvedic Doctor Dhanwantari, World's First Doctor Dhanwantari, The First Surgical Doctor Dhanwantari, Dhanwantri Indian Ayurveda