నందా దీపం అంటే ఏమిటి? (What is Nanda Deepam)
నందా దీపం అంటే ఏమిటి?
(What is Nanda Deepam)
పూర్వకాలంలో దేవాలయం ముందు గూటిలో ఓ అఖండ దీపాన్ని ఉంచే ఆచారం ఉండేది. నిరంతరం వెలుగుతూ ఉండే ఈ దీపాన్ని ''నందా దీపం'' అంటారు. ఈ ఆచారం ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది.
మన ఆచారవ్యవహారాల వెనుక అందరి శ్రేయస్సే పరమ ప్రయోజనం. పూర్వం విద్యుత్ దీపాలు లేని రోజుల్లో రాత్రిపూట చిమ్మచీకటిలో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యేవారు. ఇళ్ళలో రాత్రంతా దీపాలు ఉంచుకునేవారు. ఇక వీధిని పోయేవారికి పాము పుట్ర లాంటి ఇబ్బంది ఎదురైతే దేవాలయం ముందు ఉన్న నందా దీపం ఆదుకునేది.
అగ్గిపెట్టెలు కూడా లేని కాలంలో చెకుముకి రాళ్ళతో నిప్పు రాచుకునేలా చేసి, ముందుగా నందా దీపం వెలిగించేవారు. అది అఖండంగా వెలిగేందుకు గానూ నేతిని పోస్తూనే ఉండేవారు. ఆ నందా దీపం అందరినీ ఆదుకునేది.
నేతిని యజ్ఞ క్రతువుల్లో ఉపయోగిస్తారు. నెయ్యి దహనమవగా వచ్చే ధూపం పీల్చడంవల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుంది. వాతావరణ కాలుష్యాలు ఏర్పడవు. దాంతో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తవు.
నందా దీపాన్ని గుడి ముందు మాత్రమే ఉంచుతారు. ఒకవేళ ఇంట్లో ఉంచితే, ఆ గదిలో ఏ వస్తువులూ లేకుండా జాగ్రత్త పడేవారు. గాలి సోకితే, అగ్ని ప్రమాదం జరుగుతుంది అనే భయమే ఇందుకు కారణం.
ఈ కాలంలో నందా దీపంతో అవసరం లేదు కనుక ఆ ఆచారం కొనసాగడంలేదు. అయితే, నందా దీపపు ఆదర్శంతో పూజా సమయంలో నేతిదీపాలను వెలిగించడం అలవాటు చేసుకుందాం. ఇవి ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకుందాం.