ఆనందలహరి

 


                                      ఆనందలహరీ
 
 భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశాన  స్త్రిపురమథన పంచభిరపి
నషడ్బి స్సేనానీ ర్దశశతముఖై రప్యహి పతిః
తదా న్యేషాం కేషాం కథయ కథ మస్మిన్నవసరః

ఓ జగదేకమాత భవానీ సృష్టికర్త బ్రహ్మ తన నాలుగు ముఖాలతోను,
త్రిపురహరుడు శంకరుడు తన అయిదు ముఖాలతోను, దేవసేనాని
కుమారస్వామి తన ఆరు ముఖాలతోను, నాగరాజైన ఆదిశేషుడు తన
వేయిముఖాల తోను నీ మహిమా పాఠావాలను వర్ణింపలేకున్నారు. ఇక
మానవమాత్రుడను నేనెంతటివాడను.

ఘతక్షీర - ద్రాక్షా మధుమధురిమా కై రపి పదై
ర్విశిష్యా నాఖ్యేయో భవతి రసనా మాత్రవిషయః
తథాతే సౌందర్యం పరమశివ దృజ్మత్ర విషయః
కథంకారం బ్రూమ సకల నిగమా గోచరపదే.

నెయ్యి,పాలు,ద్రాక్షా - తేనెలలోని మాధుర్యాన్ని వర్ణించేందుకు మాటలు
చాలవు.వాటి రుచి నాలుకకు మాత్రమే తెలుసు. అమ్మానీ సౌందర్యం
వర్ణించాలంటే సకల వేదాలకే శక్తి చాలదే.ఆ సౌందర్యాతిశయం
మహేశ్వరునికి ఎరుకగానీ - మా బోటి సామాన్యుల తరమా తల్లీ!

ముఖతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తిక లతా
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్.

నోట్లో తాంబూలం, కళ్లకు కాటుక,నొసట సిందూర తిలకం, మెడలో
మంచి ముత్యాలహారం, బంగారు జలతారుతో నేయబడిన చీరె,
నడుమున రత్నాలు తాపిన వడ్యాణాన్ని ధరించి; ధగధగ మెరిసే వేష
భూషలతో విరాజిల్లే గిరిరాజ నందినీ! గౌరవర్ణినీ! సదా మనసా నిన్నే
ఆరాధిస్తాను తల్లీ!

విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటి
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే.

మందారకుసుమమాల ధరించి హృదయసీమను మధుర వీణానాదాన్ని
ఆలకిస్తూ - చెవుల తళతళ మెరిసే కుండల కాంతుల శోభతో ....
వయ్యారంగా వంగిన తనువుతో, ఆడయేనుగు అందమైన నడకతో ....
మనోహరమైన మందగమనంతో, కలువ కన్నుల మంగళస్వరూపినీ! హే
భగవతీ శంకరసతీ .... సర్వత్రా నీ రూపమే నాకు కనులముందు
కదులాడుతోంది తల్లీ! 

నవీనార్క భ్రాజన్మణి  కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిర నయనాం గీకృత శివా,
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమా పర్ణాపూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ!

హే జగన్మాతా! అప్పుడే! ఉదయించిన భాలభానునిలా దేదీప్యమానంగా
ప్రకాశించే సువర్ణ మణిమయాది భూషణాలతో సర్వాంగ భూషితవు.
ఆడులేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు గలదానావు,
పరమశివుని పతిగా స్వీకరించిన దానవు, మెరుపు లాంటి పచ్చని
మేని కాంతికల దానవు, పసిడి పీతాంబరం, పాదమంజీరాలతో కలకల్లాడే
అయిదవరాలా ఆనంద స్వరూపిణీ! అపర్ణా .... నిరంతరం నాకు నిండుగా
ఆనందాన్ని యిమ్ము తల్లీ!

హిమాద్రే స్సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభి ర్ర్బమరకలితా చాలకభరైః,
కృతస్థాణు స్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హస్త్రీ విలసతి చిదానందలతికా.

ఆ మాత జ్ఞానలత, ఆనందలత, మంచుకొనలో పుట్టినది. అందమైన
అరచేతులనే పల్లవాలు కలది. ముత్యాల సరాలనే పూలు పూసింది. నల్లని
తుమ్మెద దలనే  ముంగురులతో ముచ్చటగొలిపేది. స్తన ఫలభారంతో
వంగినటువంటిది. సరసవాక్కుల తేనె లొలికించు నట్టి దా లత ...
సర్వరోగ నివారిణి, కలుషహారిణి ... అది జ్ఞానానంద లతిక -- శివ మనోవల్లరి.

సపర్ణా మాకీర్ణాంకతిపగుణై స్సాదర మిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి,
అపర్ణైకా సేవ్యా జగతి సకలై ర్యత్పరివృతః
పురాణోపి స్థాణుః  ఫలతికిల కైవల్యపదవీమ్.

ఇహం లొ తరించాలంటే అపర్ణనే కొలవాలి కాని సపర్ణను కాదు. ఆ
అపర్ణను పరిణయమాడిన పరమశివుడు మోక్షఫలప్రదాత అయ్యాడు కదా!        

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ!
త్వమర్థానాం మూలం ధనద, నమనీయాంఘ్రికమలే!
త్వమాదిః కామానాం జనని! కృత కందర్ప విజయే!
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మ మహిషీ!

ఓ జగదేకమాత! వేదాలన్నీ నేలోనే జనించాయి. సకల వేదవిధులను
విధించుదానవు. ధనాధిపతి కుబేరుడు కూడా నీ పాదాక్రాంతుడే. నీవు
కామేశ్వరివి. కోరికలు తీర్చే దానవు. కాముని జయించిన దానవు.
పరబ్రహ్మస్వరూపుని పట్టపురాణివి గదమ్మా! సజ్జనుల ముక్తికి
కారణభూతురాలవు...ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధపురుషార్థ
ఇచ్చేదానివి నీవే తల్లీ!
ప్రభుతా భక్తిస్తే యదపి న మయా లోలమనసః
త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యో హమధునా
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే,
భృశం శంకే కైర్వా విధిభి రనునీతా మమ మతిః

చపలచిత్తుడనైన నాకు నిజం చెప్పాలంటే నీయందంతగా భక్తి కుదరడం
లేదు. కానీ నీవు పెద్ద మనస్సున్న దానవు...శ్రీ మతివి. నీవే నన్నిపుడు
దయచూడాలి తల్లీ!. చాతక పక్షి ఇష్టాయిష్టాలకు అతీతంగా మేఘుడు
చాతకపక్షినోట తీయటి జలాలను కురిపించటం లేదా! అలాగే
దయావర్షం నాపై కురిపించు తల్లీ! ఎందువల్ల నా మనస్సు నీ యందు
నిలకడ కోల్పోతోందో అని సతతము మథనపడుతున్నాను తల్లీ!

కృపా పాంగాలోకం వితర తరసా సాధుచరితే
నతే యుక్తో పేక్షామయి శరణదీక్షా ముపగతే
నచే దిష్టం దద్యా దనుపద మహో! కల్పలతికా
విశేషస్సామాన్యైః కథ మితర వల్లీపరకరైః

అమ్మా నీవు కపట మెరుగని సచ్చరిత్రవు గదమ్మా! నీ కృపాదృష్టిని నాపై
త్వరగా ప్రసరింపజేయుము తల్లీ! నిన్ను శరణు కోరినవారిని కరుణించే
కల్పవల్లివి గదమ్మా...నన్ను ఉపేక్షించకమ్మా! అడిగిందే తడవుగా వరాలిచ్చే
కల్పవల్లీ! ఈ యకుంటే సామాన్యతలకు కల్పలతకు తేడా ఏముంటుంది తల్లీ!

మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయా న్యన్నైవా శ్రిత మహ మయా దైవతముమే!
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదర జనని కం యామి శరణమ్.

అమ్మా...ఉమాదేవీ! నీ పాదపద్మాలనే నమ్ముకున్నా నమ్మా! ఇతర దేవతల
నాశ్రయించాలను కోలేదు. అయినా నాపై నీకు దయరాకపోతే, నే
నిరాశ్రయుడనై పోతానమ్మా! హే లంబోదర జననీ ఏ యాధారమూ లేని
నన్ను ఎవరిని శరణు వేడుకోమంటావు తల్లీ!

అయి స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాద శ్శుచి భవతి గంగౌఘమిలితం
తథా తత్త త్పాపై రతిమలిన మంతర్మమ యది
త్వయి ప్రేమ్ణాస్తం కథమివ న జాయేత విమలమ్. 

అమ్మా! స్పర్శవేది సోకగానే ఇనుము బంగార మవుతుంది. వీధి కాల్వల్లో
పారే మురికినీరు గంగతో కలసి పునీతం అవుతుంది. అదేవిధంగా
మాయను జిక్కి పాపాలతో మలినమైపోయిన  నా మనస్సు - భక్తిభావనలో
ముణిగినపుడు అదిమాత్రం నిర్మలం కాకపోతుందా ...తల్లీ!

త్వదన్యస్మా దిచ్చావిషయ ఫలలాభే న నియమః
త్వమర్థనా మిచ్చాధికమపి సమర్థా వితరణే
ఇతి ప్రాహుః  ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివ ముచిత మీశాని! కురతత్ 

ఓ ఈశ్వరీ నిన్ను కాదని అన్యదేవతలను వేడను. వేడినంత మాత్రాన
కోరిన కోర్కెలన్నీ తీరతాయని నమ్మకము లేదు. అదే నీవైతే - తెలియని 
మూర్ఖులు తమ శక్తి మించి కోరిన కోరికలు కూడ నిండు మనసుతో
తీరుస్తావు - ఇది బ్రహ్మాదులు చెప్పిన సత్యం. హే జగన్మాతా నా మనస్సు
రేయింబవళ్ళు నీ పైనే లగ్నమైంది తల్లీ... ఇప్పుడు నాకేది ఉచితమని
భావిస్తావో దాని ననుగ్రహించు తల్లీ!

స్ఫురన్నానారత్న సఫటికమయ భిత్తి ప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చ శధరకలా సౌధశిఖరం,
ముకుంద బ్రహ్మేంద్ర  ప్రభృతి పరివారం విజయతే,
తవా గారం రమ్యం తిభువన మహారాజగృహిణి!

త్రిభువన నాయకుడైన పరమేశ్వరుని పట్టాపురాణివైన జగజ్జననీ! నీ
భవనమేంతో రమ్యమైంది! రత్నప్రాకారాలతో - స్పటిక మణిమయ
గోడలతో, అన్నిటా నీ రూపమే ప్రతిబింబిస్తూ కనులకింపుగా వుంది. నీ
సౌధశిఖరం చంద్రుని కాంతులతో మిలమిల మెరిసిపోతున్నది! విష్ణువు
బ్రహ్మ, ఇంద్రాది దేవతా పరివారంతో నీ భవనం ఎంత మహోజ్జ్వలంగా
ఉన్నదితల్లీ!

నివాసః కైలాసే విధి శతమఖాద్యా స్స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుట స్సిద్ధినికరః,
మహేశ ప్రాణేశ స్తదవనిధరా ధీశ తనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తితులనా. 

మాతా! పర్వతరాజకుమారి..మాతా భవానీ! నీ నివాసం కైలాసం.
రజతగిరి అనబడే వెండి కొండ...బ్రహ్మేంద్రాదులు  నీ గుణగానం చేసే
వైతాళికులు. ముల్లోకాలు నీ కుటుంబమే. అణిమాది అష్టసిద్ధులు
అంజలి ఘటించి నీ యెదుట నిలబడి ఉన్నాయి. మహేశ్వరుడు - నీ
ప్రాణనాధుడు. నీ సౌభాగ్యానికి సాటి ఎక్కడుంది తల్లీ!

వృషో వృద్ధో యానం విషమశన మాశా నివాసనం
 స్మశానం క్రీడాభూ ర్భుజగనివహో భూషణ విధిః
 సమగ్రాసామగ్రీ జగతి విదితైవ స్మరరిపో
ర్యదేత స్యైశ్యర్యం తవ జనని సౌభాగ్యమహిమా!

అమ్మా!మన్మధుని బూడిదచేసిన ఆ శంకరుని వాహనమా ముసలి ఎద్దు
 ...ఆహారమా విషము...కట్టుపుట్టములా దిక్కులు..విహార భూమి -
స్మశానవాటిక, సొమ్ములా పాముల తుట్టెలు...ఆయనకున్న
 భాగ్యమేపాటిదో ఎల్లలోకాలు ఎగిరినదే గదా! అయినప్పటికి ఆయన
మహా ఐశ్వర్యవంతుడు .. తాను బూడిద పూసుకున్నా ఇతరులకు భూతి
నివ్వగల సంపన్నుడు. దీనికి నీ సౌభాగ్యమహిమే కారణం తల్లీ!
     
అశేష బ్రహ్మాండ ప్రలయ విధి నైసర్గిక మతిః
 స్మశానేష్వాసీనః కృత భసితలేపః  పశుపతిః,
దధౌ కంఠే, హాలాహల మఖిలభూగోల కృపయా
భవత్యా స్సంగత్యాః  ఫల మితిచ కల్యాణీ! కలయే.

హే మంగళప్రదాయినీ - కల్యాణీ! దేహమంతా విబూది పూసుకుని
స్మశానంలో తిష్టవేసికూర్చునే శివుడు సర్వలోకాలను సంహారకర్త అని
ప్రళయం కలిగిస్తాడని పేరు..కానీ, ఆ శివుడే సకల జీవరాసులను
కాపాడాలని కాలకుటాన్ని మ్రింగి కంఠాన బెట్టుకుని, సమస్త
భూగోళాన్ని దయామయుడై కాపాడాడంటే - అదంతా నీ చలవే -
సర్వమంగళదాయినీ .. నీతోడి సాంగత్యమే అందుకు కారణమని
భావిస్తున్నాను తల్లీ! 

విశాల శ్రీఖండ ద్రవ మృగమదా కీర్ణఘుసృణ
ప్రసూన వ్యమిశ్రం భగవతి! తవాభ్యంగ సలిలం
సమాదాయ స్రష్టా చలితపదపాంసూ న్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహ దృశామ్.

హే భగవతీ! మంచిగంధపు రసం, కస్తూరి, కుంకుమ పూవుతో కూడిన
నీ తలంటి స్నానజలాన్ని, నీ పాదరజాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా తన
చేతులతో గ్రహించి ఆ స్నానజలంలోని నీ పాదధూళిని కలిపి పదునుచేసి
దేవలోకంలో కలువరేకులవంటి కన్నులు గల కాంతామణులను సృష్టిస్తున్నాడు - తల్లీ!

వసంతే సానందే కుసుమిత లతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాలి సుభగే,
సఖీభిః  ఖేలంతీం మలయపవనాందోలిత జలే 
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనిత పీడా పరపతి.

తల్లీ జ్వరబాధ శాంతించాలంటే, ఆనందదాయకమైన వసంత
ఋతువులో - విరబూసిన లతతో - వికసించిన పద్మాలతో కలహంసల
బూరులతో కలకల్లాడే సరోవరంలో - మలయపవన వీచికలతో
మెల్లిమెల్లిగా కదులుతున్న జలాల్లో చెలులతో జలక్రీడలు చేస్తున్న
జగన్మాతను ధ్యానించిన వారికి జ్వరపీడ తొలగిపోతుంది
ఇతి శ్రీ శంకరాచార్య కృత - ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్.