పురాణాలలో అవతారాల గురించి విశ్లేషణ!

 

పురాణాలలో అవతారాల గురించి విశ్లేషణ!

మన భారతీయ పురాణాలలోకి చూస్తే ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నో వింత గాథలు, మరెన్నో విచిత్రాలు కనిపిస్తాయి. కాలగమనం ప్రకారం విభజించబడిన యుగాలు, ఆ యుగాలలో భగవంతుడి అవతారాలు, ఆయన లీలలు వంటివన్నీ వింటూ ఉంటే ఇవన్నీ ఏమిటి అని అనిపిస్తుంది చాలా మందికి. అయితే ఇలా వివిధ యుగాలలో వివిధ రూపాలలో భగవంతుడు అవతరించడం వెనుక ఒక అర్థవంతమైన వివరణ,  పండితుల విశ్లేషణ ఉంది. 

భగవంతుని కళ భూమిమీద ప్రసరించి ఒక వ్యక్తి చేత లేదా జీవి చేత లోక కళ్యాణం కోసం ఘనకార్యాలు జరిగేలా చేయడమే అవతరణం. అయితే ఆ కళ లేదా ఆ వ్యక్తి చేసిన ఘనకార్యాల మధ్య తారతమ్యాన్ని బట్టి అవతార భేదాలు కూడా ఏర్పడడం సహజం. ఇలా ఏర్పడిన అవతారాలు ఆరు విధాలు.

1) అంశావతారం, 2) అంశాంశావతారం, 3)ఆవేశావతారం, 4) కళావతారం, 5)పూర్ణావతారం, 6) పూర్ణతమావతారం.

ఈ ఆరు అవతారాలలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుంటే.. 

1) అంశావతారం

బ్రహ్మాదులు అంశావతారులు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త. ఈశ్వరుడు సంహారకర్త వీరు కార్యాధికారులు. సృష్టి స్థితి లయలు పూర్ణానికి అంశాలు. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూర్ణతముని అంశావతారాలు.

2) అంశాంశావతారం

అంశావతారాలకు తోడ్పడేవారు అంశాంశావతారులు. అంటే అంశాంశావతారం ఎత్తినవారిని వధించడం కోసమే అంశావతరం ఎత్తడం జరుగుతుంది. మరీచ్యాదులను అంశాంశావతారులుగా భావించవచ్చు. వీరు అంశావతారుల ఆజ్ఞాబద్ధులయి ఉంటారు. 

3)ఆవేశావతారం

జన్మతః లోకోత్తర శక్తి విశేషాలు లేకుండా ఒకానొక సమయంలో ఆవేశ విశేషం చేత లోకోత్తర కార్యాలను సాధించే శక్తి ఆవేశించినవారు ఆవేశావతారులు. జన్మతః ఋషికుమారుడైన పరశురాముడు తండ్రి మరణం కారణంగా సకల దుష్ట క్షత్రియ సంహారం గావించాడు. ఈ విధంగా శక్త్యావేశ పూరితులై ధర్మ సంస్థాపన కావించిన వారంతా ఆవేశావతారులుగా పరిగణించబడతారు. 

4) కళావతారం

వీరు యుగ ధర్మోద్ధారకులు. కపిల కూర్మాదులు ఇటువంటి వారు. కపిలునిలో పరమేశ్వరుని కళ ప్రసరించడం వలన అతనికి గోచరించి సాంఖ్యయోగ నిర్మాణం చేయగలిగాడు. ఈ కళ ప్రసరించడం వల్లనే కూర్మంలోనూ అధికబలం చేకూరి సముద్ర మథన సమయంలో మంధర పర్వతాన్ని మోయగలిగింది. 

5)పూర్ణావతారం

శాపవశులయిన రాక్షస జన్ములను సంహరించే నిమిత్తం ఆవిర్భవించిన వారు పూర్ణావతారులు. నృసింహుడు. శ్రీరాముడు మొదలయినవారు పూర్ణావతారులే.

6) పూర్ణతమావతారం

సకల భువనాలకీ నాయకుడైన వాడు, సకల జనులకు పరమాత్మ తత్వాన్ని ఎలుగెత్తి చాటినవాడు, గోకులంలో నివసించిన వాడు అయిన  శ్రీకృష్ణుడు పూర్ణతముడు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడయిన శ్రీకృష్ణ భగవానుడు అనంత శక్తులను అపరిమితంగా కలిగి వాటిని లోకకళ్యాణానికై ఉపయోగించాడు. అందుకే ఈయన  పూర్ణతముడయినాడు. 'లోక రక్షైకా రంభకుడు' భక్తపాల కళా సంరంభకుడు, దానవోద్రేకస్తంభకుడు, కేళీలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకుడు, మహానందాంగనా డింభకుడు' అయిన శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణతమావతారం అని కృష్ణతత్వం గురించి ఎంతో గొప్పగా వివరిస్తారు పండితులు. సకల జనుల దృష్టిలో కూడా శ్రీకృష్ణుడు అదే విధంగా  భావించబడుతున్నాడు.

                                   ◆నిశ్శబ్ద.