జనమేజయుడి జీవితంలో ఆసక్తి కథనం!!
జనమేజయుడి జీవితంలో ఆసక్తి కథనం!!
కురు వంశంలో జన్మించిన గొప్ప పరిపాలనా దక్షుడు జనమేజయ మహారాజు. పాండవులు చనిపోయిన తరువాత అభిమన్యుని కొడుకు అయిన పరీక్షిత్తు రాజు అయ్యాడు. ఈ పరీక్షిత్తు కొడుకే జనమేజయుడు. ప్రతి రాజ్యానికి రాజు కావడం వెనుక కొద్ది సంఘటనలు, పరిస్థితులు ఉంటాయి. అలాంటిదే జనమేజయ మహారాజు కావడం వెనుక పరీక్షిత్తు మరణం తాలూకూ విషయాలు ఉన్నాయి.
పరీక్షిత్తు మరణం : అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తు కురు దేశాన్ని 60 సంవత్సరాల పాటు పరిపాలించి గొప్ప ప్రజారంజకుడిగా పేరొందాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లి అలసిపోయి దగ్గరలో కనిపించిన ఒక కుటీరానికి వెళ్ళి తపస్సు చేస్తున్న బ్రాహ్మణుణ్ణి మంచినీళ్లు ఇవ్వమని ఆఫీగాడు. అతడు అలా అడిగిన తరువాత ఆ బ్రహ్మణుడి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. పరీక్షిత్తు ఓ చనిపోయిన పాముని అతని మెడలో వేసి ఆ తరువాత తిరిగి ఇంటికీ వెళ్ళిపోయాడు. ఇంతలో బయట నుండి వచ్చిన ఆ ముని కుమారుడు గవిజాతుడు ధ్యానం లో మునిగిపోయి ఉన్న తన తండ్రి మెడలోని చనిపోయిన పామును చూసి కోపోద్రిక్తుడయ్యాడు. అతడు వెంటనే "ఈ పని చేసిన వాడు ఎవడైనా సరే, ఏడు రోజులలో తక్షకుని కాటుకు బలి అవుతాడు అని శపిస్తాడు. ఆ శాపం పర్యవసానంగా తక్షకుని కాటుకు బలయ్యి పరీక్షిత్తు మరణిస్తాడు.
అయితే పరీక్షిత్తు చనిపోయేనాటికి జనమేజయుడు పసివాడు. మంత్రులే రాజ్య భారాన్ని నిర్వహించి కొంతకాలానికి ఓ శుభ ముహూర్తాన జనమేజయుణ్ణి రాజ్యాధిపతిని చేశారు. అతడికి ధనుర్విద్యను కృపుడు నేర్పాడు. గొప్ప పరిపాలకుడిగా గుర్తింపబడ్డాడు. జనమేజయ మహారాజు చేసిన వాటిలో సర్పయాగం ఎంతో చెప్పుకోదగినది. అయితే ఆ యాగం వెనుక కూడా కారణం ఉంది.
సర్పయాగం : ఉత్తంక మునివల్ల తన తండ్రి ఎందుకు ఎలా?? చనిపోయాడు అనే మరణ కారణం తెలుసుకొని మొత్తం సర్పజాతిని నాశనం చెయ్యాలని నిర్ణయించుకుని దానికి ప్రయత్నాలు ప్రారంభించాడు అదే సర్పయజ్ఞం. ఓ బ్రాహ్మణుడు ఈ యజ్ఞాన్ని ఆపే అవకాశం వుందని మునులు చెప్పగా, తెలియని ఎవర్నీ యజ్ఞశాల వద్దకు రానివ్వద్దని చెప్తాడు. ఉత్తంక, చంద్రభార్గవ, వ్యాస, ఉద్దాలకుల వంటి మునులు రుత్విక్కులు కాగా సర్పాలు ఒక్కొక్కటి హోమ గుండంలోపడి నశిస్తుండగా కొందరు ఇంద్రుని వల్ల దాక్కున్నారు. మంత్ర శబ్దాలు పెరుగుతుండగా మాడు వాసన వాసుకి నాసిక పసిగట్టి తన చెల్లెలు జరత్కారిని దీనినుండి తప్పించుకొనే అవకాశాలు కనుగొనమని చెప్పగా ఆమె తన కొడుకు ఆస్తికుణ్ణి యజ్ఞం ఆపడానికి పంపుతుంది.
రుత్విక్కులు ఎంతసేపు చూసినా తక్షకుడు రాలేదు. ఉత్తంకుడు తన దివ్యదృష్టితో తక్షకుడ్ని ఇంద్రుడు రక్షిస్తున్నాడని గమనించి మరింత కోపోద్రిక్తుడై తక్షకుడు, ఇంద్రుని సింహాసనం కూడా యజ్ఞ గుండంలో పడేందుకు జపించాడు. కొద్ది నిముషాల్లో తక్షకుడు ఇంద్రునితో సహా యజ్ఞ గుండంలో పడి భస్మమయ్యేవాడే. కాని అదే సమయంలో ఆస్తికుడు యజ్ఞశాల వద్దకు ప్రవేశించగా జనమేజయుడు స్వాగతించి నీకు నచ్చిన వరం కోరుకొమ్మనగా సర్పయజ్ఞాన్ని ఆపమని కోరుకుంటాడు. ఇష్టం లేకుండా తను ఇచ్చిన మాట తప్పవద్దని ఆస్తికుడు కోరగా జనమేజయుడు సర్ప యాగాన్ని ఆపాడు. ఆస్తికుడు మరణించిన సర్పాలకు ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు. - ఇదంతా దేవీభాగవతంలో ప్రస్తావించబడింది కూడా.
జనమేజయుడు తక్షశిల రాజుని ఓడించాడు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జనమేజయ మహారాజు అశ్వమేధయాగం చెయ్యగా వ్యాసమహర్షి చావు పుట్టుకలు ముక్తి మార్గాలను గురించి వివరిస్తాడు. అప్పుడు జనమేజయుడు తన తండ్రిని చూపమని వ్యాసమహర్షితో అడుగుతాడు. అప్పుడు పరీక్షిత్తుని స్వర్గంనుండి రప్పించి జనమేజయుడికి చూపుతాడు వ్యాసుడు. ఇక జనమేజయుణ్ణి భారత, భారత శార్దూల, భరతశ్రేష్ఠ, భరతాధ్వ భరత శతాత్మ, కౌరవ, కౌరవ శార్దూల, కౌరవేంద్ర, కురుకుల శ్రేష్ఠ, పాండవ, పాండవనందన, పాండ వేయ, పరీక్షిత్, పౌరవ్య అనే పేర్లతో పిలిచేవారు.
◆ వెంకటేష్ పువ్వాడ