జాగశ్వర్ మహాదేవ మందిరం
జాగశ్వర్ మహాదేవ మందిరం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ నాధ్, గంగోత్రి, యమునోత్రి, మొదలయిన పుణ్య క్షేత్రాలు ఘరేవాల్ ప్రాంతంలో వుండగా నైనిటాల్, రాణిఖేత్ ,జాగేశ్వర్, భాగేశ్వర్, పాతాళభువనేశ్వర్ కుమావు ప్రాంతంలో వున్నాయి. కుమావు ప్రాంతం లో వున్న జాగేశ్వర్ మహాదేవ్ గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ లోని అల్మోడా జిల్లాలో అరతోలా అనే చిన్న గ్రామం లో ఈ జాగేశ్వర్ మందిర సముదాయం వుంది. ఈ సముదాయంలో చిన్న పెద్ద రాతి దేవాలయాలు సుమారు 120 కి మించి వున్నాయని అంటారు. ముఖ్యంగా ఇక్కడ వున్న మందిరాలలో ఆది శంకరులచే గుర్తింప బడ్డ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఓకటైన " దారుకావనే నాగేశం " ఇక్కడ వుంది అనేది స్థానికులు చెప్పేమాట. " ఈ దారుకావనే నాగేశం " మహారాష్ట్ర , గుజరాత్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల వారు వారి రాష్ట్రం లో ఉన్నదే అసలు నాగేశం అంటారు. నా లాంటివారికి " ఎందుకొచ్చిన మీమాంశ అన్నీ చూ సేస్తే పోలా అనిపిస్తుంది ". అలా అన్ని నాగేశాలని దర్శించుకున్నాం. మహారాష్ట్ర లో పర్భాణి జిల్లాలో వున్న ఓండా నాగనాధ్, గుజరాత్ లో ద్వారకకి సుమారు పది, పదిహేను, కిమీ దూరంలో వున్ననాగేశం. हिमाद्रेरूत्तरे पार्श्वे देवदारूवनं परम् पावनं शंकरस्थानं तत्र् सर्वे शिवार्चिताः ఆది శంకర విరచిత పై శ్లోకం ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రం లో నాగేశమే అసలు జ్యోతిర్లింగమని అంటారు.
ప్రయాణమార్గం:-
ఇప్పుడు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి జాగేశ్వర కి 400కిమి..,ఢిల్లి నుంచి టూరిస్టు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు. రైలులో వెళ్లాలను కొనేవారు ఢిల్లి నుంచి కాఠ్ గోదాం వరకు రైలులో వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. కాఠ్ గోదాం నుంచి జాగేశ్వర్ సుమారు 125 కిమీ ... యీ దూరం మాత్రం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోగలం. కాఠ్ గోదాం నుంచి అంతా ఘాట్ రోడ్డే కాబట్టి ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. ఢిల్లి నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే మన ప్రయాణం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ , మొరాదాబాద్ , రామనగర్ ( సమాజ్ వాది పార్టీ లో వుండగా జయప్రద ఎం.పి గా వున్న నగరం ), మీదుగా సాగి ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ , హాల్ద్ వాని, కాఠ్ గోదాం మీదుగా సాగి ఆల్మొడా చేరుతాం. కాఠ్ గోదాం దాటిన తరువాత భోజన వసతులకు అల్మొడాలో మాత్రమే అనుకూలంగా వుంటుంది. బడ్డీ కొట్ల లో టీ తప్ప మరేం దొరకే వసతి లేదు. కాఠ్ గోదాం నుంచి అంతా ఘాట్ రోడ్డు అవటం వల్ల, రోడ్డు వెడల్పు తక్కువ, కొండ చరియలు విరిగి పడ్డం వగైరా అంతరాయాలు వుండటం వల్ల ప్రయాణం నెమ్మదిగా సాగుతూ 125 కిమీ.. సుమారు ఆరు యేడు గంటల సమయం పడుతుంది. ఆల్మోడా దగ్గర పిత్తొరాఘఢ్ వెళ్ళే హైవే మీద సుమారు 35 కిమీ .. ప్రయాణం చేస్తే జగేశ్వర్ చేరుతాం. పభుత్వం వారిచే నడపబడే కైలాష్ మానస సరోవర్ యాత్ర యీ అల్మోడా మీదుగా పిత్తొరాఘఢ్ లో వున్న మెదటి శిబిరం చేరుతుంది. ఈ రోడ్డులో సుమారు 14కిమీ.. వెళ్ళిన తరువాత చితై అనే వూరు వొచ్చింది. ఈ కొండ ప్రాంతాలలో ఊరులన్నీ రోడ్డుకి ఆనుకొని వుంటాయి. ఊరు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టగలినన్ని ఇళ్ళు నిత్యావుసర వస్తువుల దుకాణాలు వొకటో , రెండో అదీ ఊరు. బట్టల షాపు, టీ బడ్డి వుంటే అది టౌను.
గోలు దేవి
చితై ఊర్లో రోడ్డుకి ఇరువైపులా చిన్నచిన్న షాప్స్ అందులో అమ్మే వస్తువులు మనని ఆకట్టుకుంటాయి. అవి గంటలు, కోవెలలో కట్టే లాంటివి అతిచిన్న సైజు నుంచి అతి పెద్ద సైజు వరకు పెట్టి అమ్ముతున్నారు. కుతూహలం ఆపుకోలేక కారు రోడ్డుపక్కన ఆపి విషయం అడిగితే వాళ్లు చెప్పినదేమిటంటే అక్కడే చిన్న గుట్ట మీద వున్న అమ్మవారిని ఛితై దేవి లేక గోలు దేవి అని అంటారని, ఈ అమ్మవారికి మొక్కుబడులు యీ గంటల రూపంలో తీర్చుకుంటారుట భక్తులు కాబట్టి యీ దేవిని ఘంటా దేవి అని అంటారని చెప్పేరు . అది వినగానే మేము కూడా అమ్మవారిని దర్శించు కోడానికి వెళ్లేం.
ప్రవేశద్వారం నుంచి మెట్లు వుంటాయి, మేట్లుకి రెండువైపులా కొన్నివేల, లక్షకి చేరేయేమో చిన్న, పెద్ద గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా కుడా ఎన్నో గుత్తులుగా గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా ఏవేవో రాసిన చిన్న పెద్ద కాయితాల గుత్తులు వేలాడదీసి వున్నాయి. అవి అన్నీ న్యాయంకోసం పెట్టుకున్న ఆర్జీలుట. కోర్టు లో సాక్షాధారాలు న్యాయం వైపు లేక అన్యాయం జరిగిన వారు, న్యాయం కోసం కోర్టు వరకు వెళ్ళలేని వారు యిక్కడ తమకు జరిగిన అన్యాయం గురించి ఓక కాయితం మీద రాసి కోవెలలో వ్రేలాడ దీస్తారు. అలాంటి వారికి న్యాయం చేస్తుందిట అమ్మవారు. ఈ కోవెలలో గోలు దేవత, కల్వ దేవత, గర్హ దేవత విగ్రహాలు వున్నాయి. స్థానికులు గోలు దేవత శివుని అవతారమని కల్వ దేవత భైరవుడని, గర్హ దేవి అంటే శక్తి స్వరుపిణి అని భావిస్తారు. కుమావు ప్రాంత ప్రజలు యీ దేవతలని కుల దేవతలుగా పుజిస్తారు. పన్నెండు సంవత్సరాలు క్రిందట మేం మొదటిమారు యీ గోలు దేవిని దర్శించు కున్నప్పుడు ఇది చాలా చిన్న మందిరం. ఏటికేడాది ఆ కోవెలలో మార్పులు చోటు చేసుకుంటూ యిప్పడు ఆ కోవేలకి అర కిమీ.. ముందు నుంచి పూజా ద్రవ్యాలు, గంటలు అమ్మే దుకాణాలు మొదలవుతున్నాయి . గంటల సంఖ్య కుడా బాగా పెరిగిపోయాయి. అలాగే అర్జీలు కుడా గణనీయంగా పెరిగేయి. దీన్ని బట్టి ఛితై దేవి మీద భక్తుల నమ్మకం రోజు రోజుకూ పెరుగుతోందని చెప్పొచ్చు. గోలు దేవిని దర్శించు కొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేము. అంతవరకు అడవులలో సాగిన మా ప్రయాణం కాకులు దూరని కారడివి అంటారే అలాంటి అడవి లోంచి సాగింది. పట్టపగలు చీకటిగా వుంటుంది.
అలాంటి దారిలో మరో 20 కిమీ .. వెళ్లిన తరువాత రోడ్డుకి కుడివైపున జటగంగ వొడ్డున మందిర సముహం కనిపించింది. ఈ మందిరాలని బాల జాగేశ్వర్ మందిరాలని అంటారు. ఇక్కడ కుబేరుని మందిరం, శివుని కోవెల యింకా చిన్న చిన్న మందిరాలు వున్నాయి. ఈ దేవాలయ సముదాయం అర్కియాలజికల్ సర్వే ఆఫ్ యిండియా వారి సంరక్షణలో వున్నాయి. అర్కియాలజి వారి సర్వే ప్రకారం యీ దేవాలయాలు కనీసం 450 సంవత్సరాలకి పూర్వం నిర్మించ బడ్డట్టుగా గుర్తించేరు.
జాగేశ్వర్ మహాదేవ్ మందిరం
ఈ ప్రదేశం నుంచి మరో రెండు కిమీ.. వెళితే పరమ పవిత్ర మైన సురభి, నందిని సెలయేళ్ళు సంగమించి జటగంగగా ఆవిర్భవించిన , బహు అరుదుగా కనిపించే జంట దేవదారు ( కవలల మాదిరి వొకే మానుకి పైకి రెండుగా చీలి ) వృక్షాల నడుమ జాగేశ్వర్ మహాదేవ్ మందిర సముదాయం కనిపిస్తుంది . ఈ మందిర సముదాయం తొమ్మిద శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం మధ్యలో నిర్మింప బడ్డాయి. తిరిగి వీటిని 18వ శతాబ్దం లో కట్యూరి రాజ వంశీకుడైన శాలివాహన దేవ్ యీ మందిరాలను పునరుద్దరించి పూజారులకు గుడి మాన్యంగా కొన్ని గ్రామాలను యిచ్చినట్లు చరిత్రకారులు గుర్తించేరు. ఈ మందిర సముదాయాన్ని' తరుణ జాగేస్వర్ ' మందిరాలుగా స్థానికులు వ్యవహరిస్తారు. రోడ్డు పైకి చిన్న గేటు తీసుకోని లోనికి వెళితే కుడిచేతి వైపు ముందుగా ఆ సముదాయంలో పెద్దదిగా వున్న మృత్యుంజయ మందిరం వస్తుంది. ఇది స్వయంభూలింగం. దీని పైన కన్ను ఆకారంలో చీలిక వుంటుంది. ఈ లింగం తూర్పు ముఖం గా వుండడం విశేషం . ఈ కోవెల మండపం లో మృత్యుంజయ మహా మంత్రమైన
ॐ हौ जूँ सः
ॐ भूर्भुवः स्वः
ॐ त्रयंबकं यजामहे सुगन्धिम् पुष्टिवधर्नम्
उर्वारूकमिव बन्धनान्मृत्यॊर्मुक्षीय मामृतात्
ॐ स्वः भुवः भूः ॐ
सः जूँ हौ ॐ జపిస్తే అకాల మృత్యు దోషాలు పోతాయని భక్తుల నమ్మిక. ప్రతి సంవత్సరం ఆంధ్రా నుంచి చాలా మంది భక్తులు గ్రూపులుగా వచ్చి యిక్కడ మృత్యుంజయ హోమం నిర్వహిస్తూ వుంటారు. అదే ప్రాంగణం లో కేదారేశ్వర్, కుబేరుడు, పశుపతి నాథ్ , నవ దుర్గల చిన్న చిన్న మందిరాలు చూడొచ్చు. మృత్యుంజయ మందిరం లాగే యీ ప్రాంగణం లో వున్న మరో పెద్ద కోవెల "నాగేశమ్ లేక నాగనాథ్ . దీనిని ద్వాదశజ్యోతిర్లింగాలలో వొకటిగా యిక్కడి వాళ్ళు చెబుతారు .
కోవెల ద్వారపాలకులుగా నంది మరియు స్కంది వుండగా శివుడు పడమర ముఖంగా వుంటాడు. ఇక్కడి శివలింగం రెండు భాగాలు కలిపినట్టుగా వుంటుంది. దీనిని అర్ధనారీశ్వర శివలింగమని, పెద్దగా వున్న భాగం శివుడని, కాస్త చిన్నగా వున్న భాగం పార్వతని అంటారు. ఈ శివలింగాన్ని చేత్తో కదిపితే కదులుతుంది. అన్ని శివాలయాలలోను శివుడు యోగనిద్రలో వుండి హారతి సమయాలలో మాత్రమే జాగరూకుడై భక్తులను అనుగ్రహిస్తాడుట కాని యిక్కడ సర్వకాల శర్వావస్థల యందు జాగ్రదావస్థలో వుండి భక్తులను అనుగ్రహిస్తాడుట అందుకని ఈ ఇశ్వరుని "జాగేశ్వరమహదేవ్ " అని అంటారు. శివలింగానికి వెనుక వైపున చందరాజులైన దీప్ చంద్ , త్రిపాల చంద్ ల అష్ఠలోహ విగ్రహాలు అఖండ జ్యోతి వుంటాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే గర్భ గుడిలో కుడివైపున పట్టు పరుపు పై రాత్రి స్వామికి పవ్వళింపు సేవ చేస్తారు. రాత్రి చక్కగా పరచిన పక్క మరునాడు నలిగి వుంటుందిట స్వామి స్వయంగా పవ్వళించినట్లుగా స్థానికులు భావిస్తారు. కోవెలలో యెలుకలు లాంటివి వున్నాయేమో అనే సందేహం వెలిబుచ్చితే ఆ వూరు మొత్తం మీద యెలుకలు లేవు అనే సమాధానం మిచ్చేరు. ఆ విషయం మాకు నమ్మశఖ్యం కాలేదు. ఆది శంకరా చార్యుల తో వచ్చిన కర్ణాటక బ్రాహ్మణులు యిక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ యిక్కడే వుండిపోయి కాలక్రమం యిక్కడి పిల్లలని పెళ్లి చేసుకొని యిక్కడే స్థిరబడ్డారు. వారి సంతతి వారే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రోడ్డుకి అవతల వైపున వున్న మ్యుజియం లో దుర్లభ మైన దేవతా మూర్తులు ఉన్నాయి. ఇక్కడికి సుమారు వొక కిలోమీటరు దూరం లో గుట్టపై పురాతనమైన వృద్దజాగేశ్వర్ మందిరం వుంది. ఇవికాక యిక్కడ చూడదగ్గ పెద్ద మందిరాలలో దండేశ్వర్ మహాదేవ మందిరం వొకటి. జాగేస్వర్ మందిరం నుంచి కొంచెం మీదకి నడుచు కొని వెళితే వస్తుంది. ఇక్కడ ప్రకృతిశిలనే శివలింగం గా పూజించడం చూడొచ్చు. ఈ మందిరం శిధిలమై పోయింది. జటగంగ సామ్ గంగ నదుల సంగమం దగ్గర జాగేశ్వర్ కోవేలకి రెండు కిలోమీటర్ల దూరం లో కోటిలింగ మహాదేవ కోవెల శిధిలావస్థలో వుంది. ఇది పరమ శివుడు తపస్సు చేసిన ప్రదేశం గా చెప్తారు. ఝంకార్ సామ్ మహాదేవ మందిరం , పుష్ఠిదేవి లేక పుష్ఠి భగవతి , సూర్యదేవుని మందిరం ,కాల భైరవ్ మందిరం చూడ తగ్గవి. అరతోల గ్రామం కి 200 మీటర్ల నుంచి తరుణ జాగేశ్వర్ , ఝంకార్ మహాదేవ , వృద్ధ జాగేశ్వర్ , కోటి లింగేశ్వర్ మందిర ప్రాంతాలను " వినాయక క్షేత్రం " అని అంటారు. ప్రతి యేడాది శ్రావణ మేళా , శివరాత్రి మేళాలు చాలా భక్తీ శ్రద్దలతో జరుపుకుంటారు.
కావడి యాత్ర ;-
శ్రావణ మేళా ( ఆషాఢ పున్నమి నుంచి శ్రావణ పున్నమి వరకు ) శ్రావణ మాసం పొడవునా జరుగుతుంది. కుమావు ప్రాంత ప్రజలంతా వారి వారి ఊర్లలో వుండే నదులనుంచి నీరు తెచ్చి జగేశ్వర్ లోని శివలింగానికి అభిషేకించి యిక్కడి జటగంగ లోని నీరు తీసుకు వెళ్లి వారి వూరి శివాలయం లో అభిషేకిస్తారు. దీనిని కావడి యాత్ర అంటారు. ఈ యాత్రని చాలా నియమ నిష్ఠలతో భక్తి శ్రద్దలతో చేస్తారు. ఈ " కావడి యాత్ర " హరిద్వార్ గంగ వరకు కూడా చేస్తూ వుంటారు. ఈ యాత్ర జరిగే సమయం లో డిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళే రోడ్ల పై భారీ వాహనాలని అనుమతించరు. శివ రాత్రి మూడు రోజుల పండగగా జరుపుకుంటారు. ఇక్కడ భోజన వసతి సౌకర్యాలకు కుమావు వికాష్ మండలి వాళ్ళ గెస్ట్ హౌస్ వుంది. అక్కడ రాత్రి బస చేసి, మర్నాడు ప్రొద్దున్న మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టేము.
- కర్రా నాగలక్ష్మి