విశ్వకర్మచే మలచబడ్డ ఆదితిరువరంగం

 

 

 

విశ్వకర్మచే మలచబడ్డ ఆదితిరువరంగం

 

                                                                                

ఈ వారం శ్రీ మహావిష్ణు మొదటగా కొలువు తీరినట్లు చెప్పబడే ఆది శ్రీరంగనాధుని ఆలయం దర్శిద్దాము.  విశాలమైన ఈ ఆలయం తమిళనాడులో విల్లుపురం జిల్లాలోని ఆది తిరువరంగంలో వున్నది.  స్వామి మొదట ఇక్కడ అర్చా రూపంలో విలసిల్లాడని ఆ పేరు వచ్చింది.

 

మనకెన్నో పురాతన ఆలయాలు .. చరిత్రకందనంత పురాతన ఆలయాలున్నాయి.  ఈ పురాతన ఆలయాల నిర్మాణశైలిబట్టి అవి ఏ శతాబ్దంలోవో, ఏ రాజుల కాలంలో నిర్మింపబడ్డాయో నిర్ధారణ చెయ్యబడుతోంది.  అలాగే పురాణ కాలంలో మయుడి చేత నిర్మింపబడ్డ ఆలయాలుగా తమిళనాట కొన్ని ఆలయాలు ప్రసిధ్ధి చెందాయి.  వాటిలో అతి పురాతనమైన ఆలయాలలో ఒకటిగా చెప్పబడే ఈ ఆలయంలో శ్రీరంగనాధస్వామి విగ్రహాన్ని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఆజ్ఞమేరకు దేవశిల్పి విశ్వకర్మ రూపొందించాడు.  అదెలా జరిగిందంటే….

 

 

అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అనేక అవతారాలను ధరించి ధర్మాన్నీ, ప్రజలనూ కాపాడాడని అనేక పురాణగాధలద్వారా తెలుసుకున్నాముకదా!  పూర్వం కృతయుగంలో సోమకుడనే రాక్షసుడు వేదాలను తస్కరించి సముద్రం అడుగున దాక్కున్నాడు. దేవతలంతా బ్రహ్మదేవుడు దగ్గరకు వెళ్ళి వేదాలను రక్షించమని కోరగా, బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువుని శరణుజొచ్చాడు. జగత్తును సంరక్షించే శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ఎత్తి సోమకుడిని సంహరించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవునికి ప్రసాదించాడు. ఈ కధ దాదాపు అందరికీ తెలిసినదే.  ఆ తర్వాత కధ కూడా తెలుసుకోండిమరి.   సోమాసురుడి వధానంతరం కొంతతడవు విశ్రాంతి తీసుకోవటానికి శ్రీ మహావిష్ణువు శయనించిన స్ధలమే ఇది.  అందుకనే ఆది తిరువరంగం అని పిలువబడుతోంది.

 

అవతారం పూర్తికాగానే దేవతల ఆహ్వానంమీద స్వామి వైకుంఠం పయనమవటంతో అక్కడవున్నవారంతా స్వామిని భక్తులను బ్రోచేందుకు అక్కడ కొలువుతీరవలసినదిగా ప్రార్ధించారు.  వారిపై కరుణతో స్వామి దేవ శిల్పి అయిన విశ్వకర్మను రప్పించి పాలకడలిలో శేషశయనుడైన తన రూపంతో అర్చామూర్తిని తయారు చెయ్యవలసినదిగా ఆదేశించాడు.  స్వామి విశ్వకర్మ తయారుచేసిన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి వైకుంఠానికి వెళ్ళిపోయారు.

 

 

మునులు, జనుల ప్రార్ధనతో స్వామి ఇక్కడ వెలిశాడు కనుక ఇది ప్రార్ధనా స్ధలంగా భావింపబడుతోంది. ఆలయంలో తూర్పు ముఖంగా పవళించిన స్వామి విగ్రహం పొడవు 15 అడుగులుంటుంది.  అపురూపమైన అందంతో, కరుణ తొణికిసలాడే కన్నులతో  పవళించి వున్న స్వామిని చూసి మైమరచిపోతాము.  ఎంత అందంగా వున్నాడు స్వామి!!  శేషనాగుమీద పవళించిన స్వామి ఎడమ భుజం దగ్గర శ్రీదేవి, పాదాల దగ్గర భూదేవి.  కుడి చెయ్యి తలకింద పెట్టుకుని, ఎడమ చెయ్యి పైకి ఎత్తి, నాభినుంచి ఉద్భవించిన బ్రహ్మకి నాలుగు వేదాలు ఉపదేశిస్తున్నట్లుంటుంది.  కుడిచేతికింద గరుడాళ్వార్ సేవిస్తూండగా,   మణియన్, మణికర్ణన్ అనే ద్వారపాలకులు సదా స్వామి సేవలో నిమగ్నమయి వుంటారు.
దేవేరి పేరు శ్రీరంగనాయకి.. విడిగా సన్నిధి వున్నది.  విమానం వేద స్వరూపం.  వేదాలను ఎనిమిది దిక్కులకీ వినిపించేలా ఉపదేశించారు కనుక సాందోమయ విమానమనికూడా అంటారు.

 

ఇక్కడ పుష్కరిణి చంద్రపుష్కరిణి.  ఈ పుష్కరిణికి చంద్రుడిపేరు రావటానికి ఒక కధ చెబుతారు.  దక్షప్రజాపతి తన 27గురు కూతుళ్ళను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు.  కానీ చంద్రుడు వారిలో ఒకరిమీద మాత్రమే అత్యంత ప్రేమ చూపించి మిగతావారిని నిర్లక్ష్యం చేశాడు.  దానితో చంద్రుడు శాపగ్రస్తుడై భయంకర క్షయవ్యాధికి గురయ్యాడు.  ఆ శాప నివారణకోసం ఇక్కడికివచ్చి ఈ పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని సేవించి స్వస్ధుడయినాడు.  అప్పటినుంచీ దీనికి చంద్రపుష్కరిణి అనే పేరువచ్చింది.

 

 

ఈ క్షేత్రానికి సంబంధించిన ఇంకొక కధ … కృతయుగంలో శృతకీర్తి అనే రాజు సకలైశ్వర్యాలతో తులతూగుతున్నా సంతానం లేమితో బాధపడుతూ నారదుడి సలహామీద ఈ స్వామిని సేవించి నలుగురు సంతానాన్ని పొందాడు.
పైన చెప్పిన వివరాల ప్రకారం ఈ క్షేత్రం ముఖ్యంగా భక్తులు కోరే మూడు కోర్కెలను నెరవేర్చే క్షేత్రంగా ప్రసిధ్ధి చెందింది.  అవి ఈ ప్రకారంగా వున్నాయి..

1.  మునులు, జనుల కోరికమీద శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా దర్శనమిచ్చి వారి పూజలందుకుంటున్నాడు గనుక ప్రార్ధనా స్ధలంగా భావింపబడుతోంది.  అంతేకాదు..బ్రహ్మదేవుడికి వేదాలని బోధించిన స్ధలంగనుక విద్యా బుధ్ధులను ప్రసాదించే దైవంగా పేరొందాడు.

2. చంద్రుడికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ప్రదేశంగనుక ఈ క్షేత్రం ఆరోగ్య ప్రదాయినిగాకూడా పేరుపొందింది.  అనారోగ్య బాధితులు ఇక్కడికొచ్చి ఈ స్వామిని సేవిస్తే స్వస్ధత చిక్కుతుందని భక్తుల నమ్మకం.

3. రాజు శృతకీర్తికి సంతానం ప్రసాదించిన దైవం కనుక సంతానం లేనివారు వచ్చి ఈ స్వామిని సేవించి సంతానం పొందుతారని ప్రతీతి.

4. అంతేకాదు భక్తుల కోరికమీద స్వామి తనంతతాను అర్చామూర్తిని ప్రతిష్టించిన ప్రదేశంగనుక ఈ స్వామిని సేవిస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

 

ఇంక ఈ ఆలయం గురించి మిగతా విశేషాలు కూడా చూద్దామా?

 

ఈ క్షేత్రంగురించి స్కాంద పురాణం ఉత్తరకాండలో ఉమా మహేశ్వర సంవాదంలో 301 అధ్యాయంనుంచి 306 వ అధ్యాయం వరకు ఉత్తరరంగ మహాత్యంలో వున్నది. స్వామి సన్నిధికి వెళ్ళేముందు చిన్న రంగనాధుడు కస్తూరి రంగన్ పేరుతో వున్నారు.  విదేశీ దండయాత్రలనుంచి ఆలయాన్ని రక్షించటానికి ఈ విగ్రహాన్నిపెట్టారు .. వారు అదే అసలు విగ్రహం అని అనుకోవటానికి.  దీనినే ఛోటా రంగనాధన్ అనికూడా అంటారు. స్వామి సన్నిధికి వెళ్ళేముందు ఉపాలయంలో లక్ష్మణ, సీతాసమేత శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవచ్చు.

 

పూర్వం రాజులు కప్పం వసూలు చేసేటప్పుడు ఆలయానికి కొంత ధాన్యం ఇచ్చేవారుట.  ఆ ధాన్యాన్ని నిలవచేసే ధాన్యాగారం .. నెల్ కొళంజి .. ఆలయం వెలుపల దర్శనమిస్తుంది.  ప్రస్తుతం దీని ఉపయోగం లేకపోవటంతో శిధిలమవుతోంది. పరమ భక్తురాలు అవ్వయ్యార్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు ఒక శిలాశాసనంవల్ల తెలుస్తున్నది. ఇక్కడి పూజలన్నీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. స్ధల వృక్షం పున్నాగ. అన్ని వైష్ణవ పండగలతోబాటు చైత్రమాసంలో వసంతోత్సవం పది రోజులు వైభవంగా జరుగుతుంది.

 

తెన్ పెణ్ణై నది ఒడ్డునవున్న ఈ ఆలయం తిరువణ్ణామలైనుంచి 40 కి.మీ.ల దూరంలో వున్నది.  తిరువణ్ణామలైనుంచి, మన్నలూరునుంచి బస్సులున్నాయి.  మన్నలూరునుంచి ఆటోలు, వేన్ లు, మినీ బస్సులుకూడా వున్నాయి.

 

సందర్శన సమయాలు ఉదయం 6 గం.లనుంచి రాత్రి 8 గం.లదాకా.  మధ్యలో గుడి మూయరు.

సంప్రదించండి

Sri Raja Bhattayar    Cell No.  9442983479

Address

Adi Rangam

Via Kadambur

Sankarapuram Taluk

Villupuram district – 605 802   

Tamil Nadu

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)