Read more!

దుర్గాదేవి - ఏడవరోజు (Durgadevi - 7)

 

దుర్గాదేవి - ఏడవరోజు

(Durgadevi - 7)


విద్యుద్దామ సమప్రభాం

మృగపతి స్కందస్థితాం భీషణా౦

కన్యాభి: కరవాలఖే

విలద్దస్తా భిరాసేవితాం!

హసైశ్చక్రగదాసిఖేట

విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం

దుర్గం త్రినేత్రం భజే

 

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.

 

నైవేద్యం - చక్రపొంగలి

కావలసిన పదార్ధాలు

పెసర పప్పు - కప్పుడు

బియ్య౦ - కప్పుడు

నెయ్యి - కప్పుడు

నీళ్ళు - 5 కప్పులు

కు౦కుమపువ్వు - చిటెకడు

జీడిపప్పులు - 15

యాలకులు - 6

ప౦చదార - 2 కప్పులు

తయారు చేసే పద్ధతి

చిన్న కుక్కరు స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు వేయి౦చి పెట్టుకోవాలి. నేతిలో పెసర పప్పు, బియ్య౦ వేసి దోరగా వేయి౦చి నీళ్ళుపోసి కలపాలి. ఉడుకు రాగానే అ౦దులో యాలకుల పొడి, పాలల్లో నానబెట్టిన కు౦కుమపువ్వు, మిగిలిన నెయ్యి వేసి, చివర్లో పంచదార వేసి కలిపి కుక్కరు మూత పెట్టి మూడు విజిల్సు రానివ్వాలి. మూత తీసిన తర్వాత జీడిపప్పులు వేయాలి.