ఏనుగు వైఖరి
ఏనుగు వైఖరి
ఒక చీమ తన కుటుంబసభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది.
ఆ చీమ ఏనుగు ముందు నిల్చుని పెద్దగా అరుస్తూ ఈ విషయాన్ని చెప్పింది -
" మిస్టర్ ఏనుగూ ..నా మాట విను. నేనూ, నా కుటుంబ సభ్యులం నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించు. నీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు..... ఆ అభ్యంతరాలు సరైనవేనా అని మేము చర్చించుకుంటాం...సరేనా?" అని.
చీమ మాటల్ని ఏమాత్రం పట్టించుకోనట్టుగా ఏనుగు తన లోకంలో తానుండిపోయింది. ఏ మాటా చెప్పలేదు. తన ధోరణి తనది అన్నట్టుగా ఉందా ఏనుగు.
వారం రోజులైంది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది.
ఏనుగుకి ఎలాంటి అభ్యంతరమూ లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమైంది. చీమ, చీమ భార్య, చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి.
నెల రోజులు దాటాయి.
చీమ భార్యకు ఆ చోటు అంతగా నచ్చలేదు. వెంటనే అది తన భర్తతో మరెక్కడికైనా వెళ్దాం... అని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏ మాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు.
చీమల యజమాని ఏనుగుతో ఎంతో నాజూకుగా ఇలా చెప్పింది....
"మిస్టర్ ఏనుగూ....మేము మరో చోటికి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం. ఏ ఇబ్బందీ పడలేదు. నీ చెవి పెద్దదిగా ఉండి మేము దర్జాగా ఉండటానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎద్దు కాళ్ళల్లో నివాసముంటున్న తన మిత్రులను కలవాలని నా భార్య ఆశపడుతోంది. మీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చెప్పండి వారం రోజుల్లో..." అని.
వారం రోజులైంది. ఏనుగు మళ్ళీ ఏమీ చెప్పలేదు.
దానితో ఆ చీమ కుటుంబం ఏనుగు చెవిలోనుంచి బయటకు వచ్చేసింది.
ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.... ఈ ప్రపంచంలో నువ్వు వున్నావన్న విషయం నీకు తప్ప ఎవరికీ పట్టే విషయం కాదు. అలాగే నువ్వు వున్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాలని అనుకోవడం ఎంతమాత్రం అవసరం లేని ఆశ. అందుకే నిన్ను ఎవరూ గుర్తించడం లేదని బాధపడకు, నిన్ను నువ్వు గుర్తించుకుంటే చాలు. నీ జీవితం నీది...దానిని నువ్వే జీవించాలి. జీవించు.
- యామిజాల జగదీశ్