పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం, మంత్రాలయం
పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం, మంత్రాలయం
పంచముఖి అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు. భారత దేశంలో కొన్ని చోట్ల మాత్రమె ఈ ఆలయాలు వున్నాయి. పూర్వనామం గాణదాల అనే పేరు గల పంచముఖి గ్రామం కర్నాటక లోని రాయచూరు జిల్లా లో తుంగభద్రా నదికి ఇటువేపు మంత్రాలయం ఆంద్రప్రదేశ్ కి చెందింది. అటువేపు గాణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందింది. చుట్టూ కొండలు. అందమైన ప్రకృతి. దగ్గరలో తుంగభద్రా నది. ప్రశాంత మైన వాతావరణం. ఇది పవిత్రమైన ప్రదేశం కూడా! ఇక్కడ హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనమి చ్చాడు. అందుకే ఇది పంచముఖి గా ప్రసిద్ది చెందింది. మంత్రలయానికి 21 కి. మీ . దూరం లో పంచముఖి వూరు ఉంది. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది.
పంచముఖి ప్రాశస్త్యం : పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్సనమిస్తుంది. పంచముఖి ఆంజనేయస్వామిగా కొలిచే ఆ అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు వున్నారు. హనుమంతుడు మై రావణుని సంహార సమయంలో ఈ పంచ ముఖి అవతారాన్ని ఎత్తాడు. కంభరామాయణంలో హనుమంతుని గురించి చాల చక్కగా వివరించారు. పంచ భూతాలకి ప్రతి రూపం కూడా ఈ ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు వీటిని తనలో ఇముడ్చు కున్నవాడు.
పవన తనయుడు, ఆకాశ మర్గాన . నీరు సముద్రాన్నిదాటి అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసు కుని అగ్నితో లంకా దహనం కావించాడు. సుందరా కాండలో కుడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండం లో చాలా చక్కగా తెలిపారు. అలాగే పంచ ముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే అంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అబీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామీ ధన ప్రాప్తిని, ఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి.
ఇదు రకాలైన భక్తీ భావాలూ వున్నాయి . నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. హనుమంతుడు శ్రీ రాముని 5 విధములుగా పూజిస్తాడు. ఎప్పుడు శ్రీ రామ నామం స్మరిస్తూ, కీర్తిస్తూ, రాముని కరుణ, ప్రేమకై తపిస్తూ (యాచిస్తూ ) తనని తానూ అర్పించుకున్నాడు. శక్తి వంతం, మహిమాన్వితం, అయిన శ్రీ పంచముఖి ఆలయం చూడవలసిన ప్రదేశం.
శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్దాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర రాయరు తుంగభద్రా నదీ తీరాన వున్న మంచాలలో వున్నపుడు తుంగభద్రా నదికి ఆవల వున్న గాణదాళ, బిక్షాలయ అనే గ్రామాలను దర్శించే వారు. గాణదాళలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరములు తపస్సు చేసారు. స్వయంభూగా రాతిపై వెలసిన అంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది. కొండ గుహలో రాముని, ఆంజనేయుని పూజించిన అనంతరం గురు రాఘవెంద్రులు శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీ మహా లక్ష్మి విగ్రహాలను చేక్కినట్లుగా చెబుతారు. ఇక్కడి గుహలో పంచముఖి ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లుగా కనిపిస్తాడు. అన్ని చోట్లా కనిపించినట్లు విగ్రహ రూపంలో కనిపించడు.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి పంచముఖి ఆంజనేయ స్వామి, కొల్హాపుర మహాలక్ష్మి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, కూర్మావతారంలో విష్ణుమూర్తి ప్రత్యక్ష మయినట్లు గా ఇక్కడి చరిత్ర చెబుతోంది. శ్రీ రాఘవేంద్రస్వామి అనంతరం మంత్రాలయం వెళ్లి అక్కడ సజీవ సమాధి అయ్యారు.
చిన్న రాతిపై పెద్ద రాయి
తాబేలు ఆకారంలో
ఇక్కడ సహజం గా రాళ్ళతో ఏర్పడిన ఆకృతులు నిజంగా ఆశ్చర్య పరుస్తాయి. మంచం తలగడ, విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్సనమిస్తాయి. పంచముఖి ఆలయంలో ప్రతి రోజు పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు, గణపతి, నాగ దేవుని విగ్రహాలు ప్రతిస్టించారు.
ఇక్కడికి చేరుకోవాలంటే మంత్రాలయం నుంచి ఆటోలు, టాక్సీలు వెడుతుంటాయి. రోడ్డు మార్గం సరిగా లేదు. బస్సు సర్వీసులు లెవు. ఇదివరకు మేము 1975లో పంచముఖి చేరుకోవాలంటే నది దాటి 5 కి.మి దూరం లో ఆలయం చేరుకున్నాం. ఇప్పుడు నదిలో నీళ్ళు లెవు. పడవలు లెవు. కొత్తగా నదిపై బ్రిడ్జి నిర్మించారు. రవాణా సౌకర్యం మెరుగుపడింది.
- Manikopalle