ఆరోజు కోసం శ్రమిద్దాం

 

 

ఆరోజు కోసం శ్రమిద్దాం


భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. భగవంతుడిని సేవించేవారి మనసులోనే ఆయన ఉంటాడని ఎంతోమంది మహానుభావులు సెలవిచ్చారు. ఎవరు సత్యధర్మాలను ఆశ్రయిస్తారో... ఎవరు నిజమైన భక్తి శ్రద్ధలను కలిగి వుంటారో .. ఎవరు తమ అహంభావానికి దూరమై ఎదుటివారి ఆత్మాభిమానానికి విలువను ఇస్తారో అలాంటి వారందరి మనసులోనూ భగవంతుడు ఉంటాడు. కొందరు, భగవంతుడు తమలోనే ఉన్నాడని తెల్సుకోలేక ఆయనకై జపతపాదులు ఆచరిస్తుంటారు. అడవులకు వెళ్తారు, కొండలేక్కుతారు. ఎన్నో కష్టాలు పడతారు. అది వ్యర్ధం!భగవంతుడనే వాడు ఉన్నాడో లేడో ఉంటే ఎక్కడ ఉన్నాడు అంటూ సందేహాలను పెంచుకొని తన జీవితంలో కాంతిని రావడానికి వీలులేకుండా చేసుకొంటున్నారు మరి కొందరు. ఇటువంటివి చేసిన వారికి జీవితపు విలువ ఏం తెలుస్తుంది. " నేను ఒక్కడే బాగుండాలి " అన్న పదాన్ని వదిలి నలుగురు మంచికోసం పాటుపడాలి. వెనువెంటనే ఆ భగవంతుడి యొక్క వెలుగు కిరణాలు మన మీద ప్రసరిస్తాయి . దానితో అరణ్యం అనే మన మనస్సు కాస్తా ఆనంద నందనవనం అవుతుంది. భగవంతుడు చిరునామ కోసం వెదకకుండా ఎదుటి మనిషిలో పరమాత్మనుచూసే దృష్టిని పెంచుకొంటే ప్రతి అంగుళంలో భగవంతుడు కనిపిస్తాడు. కనుక ప్రతిఒక్కరూ ఆరోజు కోసం శ్రమిద్దాం.

- అనిల్