
టాలీవుడ్ లో తనదైన నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్. థియేటర్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ పదేళ్ల సినీ ప్రయాణం వెనుక ఎంతో కష్టం, కన్నీళ్లు, అవమానాలు దాగున్నాయి. తన లేటెస్ట్ మూవీ 'ఓ సుకుమారి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరువీర్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, ఇండస్ట్రీలో తనపై ఉన్న కొన్ని అపోహలను చాలా ఓపెన్‌గా పంచుకున్నాడు.
సాధారణంగా తిరువీర్ ఆఫ్ స్క్రీన్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. దీనివల్ల ఇండస్ట్రీలో చాలామంది అతనికి చాలా పొగరు అనుకునేవారట. పక్కనే ఉన్నా కనీసం విష్ చేయలేదని నెగిటివ్‌గా అనుకునేవారట. కానీ అసలు విషయం ఏమిటంటే, అతనికి ఒక ఇంట్రోవర్ట్ ప్రాబ్లం ఉంది. కొత్తవాళ్లతో తొందరగా మాట కలపలేడు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటే ఎవరికైనా లవ్ ఫీలింగ్స్ లాగా ఆకలి వేయదు, నిద్రపట్టదు. తిరువీర్‌కు కూడా సినిమా విడుదల సమయంలో సరిగ్గా అదే ఎమోషన్ ఉంటుంది. తన పదేళ్ల కెరీర్‌కు ముందు కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ చుట్టూ తిరిగిన రోజులను తిరువీర్ గుర్తుచేసుకున్నాడు. కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్‌తో కలిసి బండి మీద తిరుగుతూ ఆఫీసుల చుట్టూ ఫొటోలు ఇచ్చిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. అప్పట్లో రోజుకు కేవలం రూ. 250 ఇస్తేనే ఎంతో గొప్పగా ఫీలయ్యే పరిస్థితి ఉండేది. ఉద్యోగం చేయకూడదు, నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనే బలమైన మోటివేషన్ మాత్రమే అతన్ని ముందుకు నడిపించింది.
ఈ ప్రయాణంలో తిరువీర్ ఎదుర్కొన్న అతిపెద్ద బాధ తన తల్లిదండ్రుల గురించినది. తిరువీర్ పడ్డ స్ట్రగుల్‌ను మాత్రమే అతని తల్లిదండ్రులు చూశారు కానీ, అతని సక్సెస్‌ను చూడలేకపోయారు. నాటకాలు వేసే రోజుల్లో డబ్బులు రావడం చాలా కష్టంగా ఉండేది. నాటకం మొత్తం పూర్తయ్యాక చేతిలో కేవలం రూ. 100 లేదా రూ. 200 మాత్రమే మిగిలేవి. అంతకంటే ఎక్కువ అంటే రూ. 1000 లేదా రూ. 2000 వచ్చే పరిస్థితులు అస్సలు లేవు. అలాంటి కఠిన పరిస్థితుల నుండి వచ్చిన తిరువీర్ కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్ నేచురల్ స్టార్ నాని నుండి అందుకున్నాడు. 'టక్ జగదీష్' సినిమాలో తిరువీర్ నటన చూసి నాని స్వయంగా స్టేజ్ మీద అభినందించారు. "ఈ కొత్త కుర్రాడు నన్నే భయపెట్టాడు, చాలా బాగా చేశాడు" అంటూ నాని ఇచ్చిన కాంప్లిమెంట్ తిరువీర్ లైఫ్‌లోనే బెస్ట్ మెమరీగా నిలిచిపోయింది.
కో-స్టార్స్‌తో బాండింగ్ గురించి చెప్తూ, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, కావ్య కళ్యాణ్‌రామ్‌లతో మాత్రమే తాను షూటింగ్ సెట్స్‌లో జోకులు వేయగలనని, మిగతా వారితో చాలా డిసిప్లిన్‌గా ఉంటానని తిరువీర్ నవ్వుతూ చెప్పాడు. ముఖ్యంగా ఫరియాతో సీరియస్ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక జోక్ వేసి నవ్వించేవాడినని, ఆమె తనను డిస్టర్బ్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చేదని గుర్తుచేసుకున్నాడు. రూట్స్ ఉన్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ హార్డ్ హిటింగ్ సబ్జెక్టులను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను క్రియేట్ చేసుకుంటున్న తిరువీర్ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
Thiruveer, Interview, Oh Sukumari, TeluguOne






