Home

»

Exclusive Movie News

'కొరియన్ కనకరాజు' టీజర్ హైలైట్స్.. వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ ఇస్తాడా?

Jul 14, 2026 2:53PM

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్‌లో ఎప్పుడూ ప్రయోగాలకు కొదవ ఉండదు. 'ముకుంద' చిత్రంతో మొదలై, 'కంచె' వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, ఇప్పుడు తన లేటెస్ట్ చిత్రం 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ టీజర్ చూస్తుంటే, వరుణ్ తేజ్ ఒక రాయలసీమ కుర్రాడిగా, కానీ కొరియన్ సంస్కృతికి ఆకర్షితుడైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ రితిక నాయక్ పాత్రను, కథలోని మిస్టరీని చాలా ఆసక్తికరంగా చూపించారు. వరుణ్ తన మాటల్లో, చేతల్లో కొరియన్ కనెక్షన్‌ను ఎలా చూపిస్తున్నారు అనేది ఈ టీజర్‌లో ప్రధానాకర్షణ. ముఖ్యంగా, 'గద్దలకొండ గణేష్' తర్వాత వరుణ్ తేజ్‌కు ఒక ప్రాపర్ హిట్ అవసరం. 'గాండీవధారి అర్జున', 'మట్కా' వంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఇప్పుడు 'కొరియన్ కనకరాజు' మీద ఆయన తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

ఈ సినిమా కథాంశం చాలా భిన్నంగా ఉంది. ఒక పక్క రాయలసీమ యాసలో మాట్లాడుతూ, మరో పక్క కొరియన్ విజువల్స్‌తో కనెక్ట్ అవ్వడం అనే పాయింట్ ప్రేక్షకులలో ఒక క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో మిస్టరీని మిక్స్ చేస్తూ మెర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్‌లో విలన్ ఎవరో, అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో రివీల్ చేయకుండా కేవలం పాత్రల పరిచయానికే పరిమితం చేశారు. ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆగస్టు 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోపు రాబోయే ట్రైలర్ తో మిగతా వివరాలు తెలియనున్నాయి.

వరుణ్ తేజ్ కెరీర్‌ను గమనిస్తే, ఆయనకు గట్టి హిట్ పడి చాలా కాలమైంది. మెగా ఫ్యామిలీలోని ఇతర హీరోలు ఇప్పటికే ఫామ్‌లోకి రాగా, వరుణ్ తేజ్ మాత్రమే హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక క్లిక్ అయితే, ఖచ్చితంగా వరుణ్ తేజ్ కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుంది. రగ్గడ్ లుక్, ఇన్నోసెన్స్ కలగలిసిన వరుణ్ పాత్ర, 'గద్దలకొండ గణేష్' స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి. మేర్లపాక గాంధీ టేకింగ్ మీద కూడా ప్రేక్షకులకు నమ్మకం ఉంది. మొత్తానికి, 'కొరియన్ కనకరాజు' టీజర్ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటే, వరుణ్ తేజ్ మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లే.

 

 

Korean Kanakaraju Teaser, Varun Tej, Merlapaka Gandhi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com