
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా రాజమౌళి ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘వారణాసి’ని ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందిస్తున్నట్టుగా అనిపిస్తోందని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘వారణాసి’ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అన్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో కేవలం సైన్స్ ఫిక్షన్ అంశాలకే పరిమితం కాకుండా.. పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీని కూడా జక్కన్న మేళవిస్తున్నారట. అంతేకాదు, కథలో భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధంతో పాటు.. ఓ యువతీయువకుడి మధ్య సాగే అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందని రాజమౌళి తెలిపారు. అంటే భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ మాత్రమే కాకుండా.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే కథ కూడా ‘వారణాసి’లో కీలకంగా ఉండబోతోందన్నమాట.

ఇక ‘వారణాసి’ చూస్తుంటే ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించిన అనుభూతి కలుగుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. విభిన్నమైన అంశాలు, భిన్నమైన ప్రపంచాలు, రకరకాల భావోద్వేగాలను ఒకే కథలో భాగంగా చూపించడం తనకు అతిపెద్ద సవాలుగా అనిపించిందని వెల్లడించారు.
సాధారణంగా ఒక కథలోని ప్రధాన అంశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడమే దర్శకుడికి కీలకం. అలాంటిది టైమ్ ట్రావెల్, పౌరాణిక ఫాంటసీ, తండ్రీకొడుకుల అనుబంధం, ప్రేమకథ.. ఇలా విభిన్నమైన అంశాలను ఒకే కథలో కలిపి, వాటి మధ్య సమతుల్యతను కాపాడటం అంత సులభం కాదు. అందుకే రాజమౌళి ఈ సినిమాను తనకు సవాలుగా అభివర్ణించినట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: షాకింగ్ రెమ్యునరేషన్.. అనిరుధ్‌ను మించిపోతున్న సాయి అభ్యంకర్.!
[Varanasi Movie Story, SS Rajamouli Varanasi, Mahesh Babu Varanasi, Varanasi Movie Update, Rajamouli Interview, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]






