
టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. ఒకప్పుడు అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తే.. ఇప్పుడు సాయి అభ్యంకర్ కూడా అదే స్థాయిలో చర్చకు వస్తున్నారు. తక్కువ సమయంలోనే వరుస చార్ట్‌బస్టర్ పాటలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యువ సంగీత దర్శకుడు.. ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది.
ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ (OM) సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన సుమారు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సాయి అభ్యంకర్ రెమ్యునరేషన్ కంటే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఆడియో హక్కుల బిజినెస్. ‘ఓం’ సినిమా ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకు వచ్చిన మొత్తం.. సాయి అభ్యంకర్ పారితోషికాన్ని పూర్తిగా కవర్ చేయడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, విడుదలైన కొన్ని పాటలతోనే మ్యూజిక్ లేబుల్ తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత పాటలు ఎంత హిట్ అయ్యాయనే దానిపై సంగీత దర్శకుడి మార్కెట్ ఆధారపడేది. ఇప్పుడు మాత్రం పాటలపై ముందుగానే ఏర్పడుతున్న క్రేజ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ఆదరణ, ఆడియో హక్కులకు లభించే ధరలు కూడా సంగీత దర్శకుడి డిమాండ్‌ను నిర్ణయిస్తున్నాయి. సాయి అభ్యంకర్ విషయంలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

సాయి అభ్యంకర్ పేరు ఇంత వేగంగా పాపులర్ కావడానికి ఆయన ఇండిపెండెంట్ ఆల్బమ్‌లే ప్రధాన కారణం. ‘కచ్చి సెరా’, ‘ఆస కూడ’ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు దక్షిణాది భాషల్లో అవకాశాలు పెరిగాయి.
ఆ తర్వాత ‘డ్యూడ్’, ‘బల్టీ’, ‘కరుప్పు’ వంటి సినిమాలతో తన సంగీత ప్రతిభను చాటుకున్న సాయి.. ఇప్పుడు ధనుష్, సూర్య, అల్లు అర్జున్ వంటి ప్రముఖ నటుల సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావడం కూడా ఆయన కెరీర్లో కీలకమైన అవకాశంగా చెప్పుకోవచ్చు.
సౌత్ లో అనిరుధ్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు, చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు, భారీ ఆడియో బిజినెస్‌తో ఆయన అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే తరహాలో చిన్న వయసులోనే భారీ ప్రాజెక్టులను అందుకుంటున్న సాయి అభ్యంకర్.. భవిష్యత్తులో ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలరా? అనే చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: స్పిరిట్ డేట్‌కు ఎల్లమ్మ.. పాన్ ఇండియా షేక్ అవుతుందా.?
[Sai Abhyankkar Remuneration, Dhanush OM Movie, Sai Abhyankkar Songs, Sai Abhyankkar, Allu Arjun, Raaka Movie, Anirudh Ravichander, Telugu Film News]






