
శర్వానంద్ నుంచి ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, ఎమోషనల్ డ్రామాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ టీజర్ తాజాగా విడుదలైంది.
టీజర్ మొదలవ్వగానే ఓ రా అండ్ రస్టిక్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. తెలంగాణ జానపద గీతం బ్యాక్‌డ్రాప్‌లో ఊరు, అక్కడి పరిస్థితులు, దొరల ఆధిపత్యం.. ఆ వ్యవస్థకు ఎదురుతిరిగే గంగ పాత్రను చూపించారు.
ఈ సినిమాలో శర్వానంద్ పేరు గంగ. ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా కఠినమైన, వయలెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఒక ఊరిని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న దొరలపై తిరగబడే వ్యక్తిగా గంగ పాత్రను డిజైన్ చేసినట్టు టీజర్‌తో క్లారిటీ వచ్చింది.
“ఆ తొమ్మిది మెట్లను నా కత్తితో కడిగి మీ నెత్తుటితో అలకకపోతే.. నేను కమ్మరోళ్ల గంగనే కాదురా” అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే పాత్ర ఎంత మొండిగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించారు.
శర్వానంద్ లుక్ ఈ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడ్డం, రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్.. అన్నీ కలిపి ఓ పీరియడ్ వారియర్‌ను తలపిస్తున్నాయి. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీస్‌లో ఎక్కువగా కనిపించిన శర్వాను ఇలా ఊర మాస్ అవతార్‌లో చూడటం కొత్తగా అనిపిస్తోంది.
ఇక ఈ కథ 1960ల కాలం నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంగా తీసుకుని అప్పటి సామాజిక పరిస్థితులు, దొరల ఆధిపత్యం, సామాన్యులపై జరిగే అణచివేత వంటి అంశాలను కథలో చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
కేకే రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో చాలా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె పాత్ర పేరు కందుల సులోచన రాణి. టీజర్‌లో ఆమె లుక్, క్యారెక్టర్ కూడా ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక ‘భోగి’ విడుదల తేదీపై కూడా టీజర్‌తో క్లారిటీ వచ్చింది. నవంబర్ 12, 2026న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘నిన్నే పెళ్లాడతా’.. ఇప్పటికీ ఇంత స్పెషల్‌గా ఉండటానికి కారణం ఇదే.!
[Bhogi Movie Teaser, Sharwanand Bhogi Teaser, Bhogi Official Teaser, Sharwanand, Sampath Nandi, Anupama Parameswaran, Dimple Hayathi, Bhogi Teaser, Telugu Film News]






