
కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. కొన్ని సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి.. మరికొన్ని మాత్రం కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో అలాగే ఉండిపోతాయి. ‘నిన్నే పెళ్లాడతా’ ఈ మూడో కోవకు చెందిన సినిమా. నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి.
1996 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్లో ఓ సంచలనం. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి కృష్ణవంశీ చెప్పిన విధానం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. మరీ ముఖ్యంగా కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే ప్రేమకథను చాలా సహజంగా చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.
‘నిన్నే పెళ్లాడతా’కు ముందు కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమా ‘గులాబి’. ఆ సినిమా సమయంలోనే నాగార్జున.. కృష్ణవంశీ టేకింగ్‌కు ఇంప్రెస్ అయ్యారు. తన బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.
మొదట కృష్ణవంశీ ఓ యాక్షన్ ఓరియెంటెడ్ కథను నాగార్జునతో చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. అప్పట్లో ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలు దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుండటంతో.. వాటి తరహాలో తెలుగు నేటివిటీకి తగ్గ కథను చేయాలని నిర్ణయించుకున్నారు.
నాగార్జున–టబు కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఈ జంటను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారంటే.. సినిమాలో వారి మధ్య ఉన్న ప్రేమకథ ఎంత సహజంగా వర్కౌట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
సందీప్ చౌతా ఈ సినిమాతోనే తెలుగు సినిమాకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో కొత్త వ్యక్తికి ఇంత పెద్ద సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం రావడం కూడా ఆసక్తికరమైన విషయమే. కానీ ఆయన ఇచ్చిన పాటలు సినిమా విజయానికి మరో ప్రధాన కారణంగా మారాయి.
‘నిన్నే పెళ్లాడతా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ విజయాన్ని అందుకుంది. 1996లో విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. 1996 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును ఈ సినిమా అందుకుంది.
కథ పెద్దగా కాంప్లికేటెడ్ కాదు. విలన్ లేడు. భారీ యాక్షన్ లేదు. కానీ పాత్రలు, కుటుంబ బంధాలు, ప్రేమ, సరదా, పాటలు.. ఇవన్నీ కలిపి కృష్ణవంశీ ఓ నేచురల్ ఫీల్ ఇచ్చారు. అందుకే టీవీలో ఎన్నిసార్లు వచ్చినా ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడే సినిమాల్లో ‘నిన్నే పెళ్లాడతా’ కూడా ఒకటిగా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: రజాకార్లపై ప్రభాస్ ఒక్కడే: ‘ఫౌజీ’లో వన్ మ్యాన్ ఆర్మీ ఫైట్ మామూలుగా ఉండదు.!
[30 Years For Ninne Pelladatha, 30 Years Of Ninne Pelladatha, Ninne Pelladatha 30 Years, Ninne Pelladatha Movie, Nagarjuna, Tabu, Krishna Vamsi, Telugu Film News]






