
సినిమా సెలబ్రిటీలపై ఏదైనా వార్త వస్తే.. నిజానిజాలు పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కొందరు ఆన్‌లైన్ రిపోర్టర్లు, మీడియా సంస్థలు సంచలనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి వార్తలపై తీవ్రంగా స్పందించింది.
తనకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న కొన్ని వార్తల్లో వాస్తవం లేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. అసలు తనకు సంబంధం లేని విషయాన్ని తనకు ఆపాదిస్తూ కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయని ఆమె మండిపడింది.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సంచలనాత్మకంగా మార్చడం బాధాకరంగా ఉందని పేర్కొంది. తన గురించి తప్పుడు, దురుద్దేశపూరితమైన, ఊహాజనిత కథనాలు ప్రచురించిన వాళ్లు వాటిని ఉపసంహరించుకుని వాస్తవాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది.
తన కుటుంబ నేపథ్యం గురించి కూడా రకుల్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. తాను ఆర్మ్‌డ్ ఫోర్సెస్ నేపథ్యం నుంచి వచ్చానని.. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరని చెప్పింది. కేవలం తన కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానని పేర్కొంది. బాధ్యత కలిగిన చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా 20 ఏళ్ల వయసు నుంచే తన పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని తెలిపింది.
అంతేకాదు.. తన వ్యక్తిగత సామర్థ్యంలో గానీ, ఏదైనా ప్రొడక్షన్ హౌస్ తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ నగదు బదిలీల్లో తాను పాల్గొనలేదని రకుల్ స్పష్టం చేసింది.
ఇక్కడితో ఆగకుండా.. తన పేరుతో దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎలాంటి బినామీ ఆస్తులు లేవని కూడా తేల్చిచెప్పింది. తనకు ఎవరూ ఎప్పుడూ ఖరీదైన ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదని.. తాను కూడా ఇలాంటి ఖరీదైన బహుమతులను స్వీకరించడాన్ని అంగీకరించనని చెప్పింది.
మీడియా సంస్థలకు కూడా రకుల్ ఒక సూచన చేసింది. ప్రతి మీడియా సంస్థకు, ముఖ్యంగా పెద్ద సంస్థలకు కూడా వాణిజ్యపరమైన ఒత్తిళ్లు ఉంటాయని తాను అర్థం చేసుకోగలనని చెప్పింది. కానీ ఆ ఒత్తిడి వాస్తవాల ఖర్చుతో ఉండకూడదని పేర్కొంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠ, జీవనోపాధి దెబ్బతినేలా వార్తలు ఉండకూడదని స్పష్టం చేసింది.
కొన్నేళ్లుగా రకుల్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రైడ్స్ సమయంలో.. విదేశీ నగదు బదిలీ స్కాంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆమెకు ఖరీదైన ఆస్తులను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు కూడా గతంలో వార్తలు షికార్లు చేశాయి. వీటన్నింటికీ ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేసింది రకుల్.
ఇది కూడా చదవండి: 'బ్లడీ రోమియో' హీరోయిన్ విషయంలో ట్విస్ట్.. మీనాక్షి స్థానంలో ప్రీతీ ముకుందన్.!
[Rakul Preet Singh On IT Raids, Rakul Preet Singh Reaction On Expensive Gifts, Rakul Preet Singh Insta Post, Rakul Preet Singh Instagram, Rakul Preet Singh IT Raids, Rakul Preet Singh, Telugu Film News]






