Home

»

Latest News

రాజమౌళి మరో అద్భుతం: ‘వారణాసి’ కోసం కొత్త భాష.. ‘బాహుబలి’ని మించేలా ఉంటుంది.!

Oct 8, 2026 3:02PM

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా అంటేనే కథతో పాటు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం. ‘బాహుబలి’లో మహిష్మతి రాజ్యం, కాలకేయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కిలికి’ భాషతో రాజమౌళి అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నారట.

‘వారణాసి’ కోసం పూర్తిగా కొత్త భాషను క్రియేట్ చేస్తున్నట్లు తాజాగా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఇందుకోసం ఓ లింగ్విస్టిక్ ఎక్స్‌పర్ట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తోంది. కేవలం కొత్త భాషను తయారు చేయడం మాత్రమే కాకుండా, దానికి ప్రత్యేకమైన పురాతన లిపిని కూడా రూపొందిస్తున్నారట.

ఈ కొత్త భాష కథలోనే కీలకమైన భాగంగా మారబోతుందని టాక్. ‘వారణాసి’ కథలో టైమ్ ట్రావెల్‌కు చాలా ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. సినిమా వేర్వేరు కాలాలు, ప్రాంతాల మధ్య ప్రయాణించేలా ఉండబోతోంది. వార‌ణాసి నుంచి అంటార్కిటికా, ఆఫ్రికా మీదుగా పురాతన రోమ్ వరకు కథ ప్రయాణిస్తుందని రాజమౌళి గతంలో వెల్లడించారు. 

ఈ టైమ్ ట్రావెల్ జర్నీలో భాగంగా ఓ మిస్టీరియస్ గుహలోకి ప్రధాన పాత్రలు వెళ్లే సీక్వెన్స్ ఉంటుందట. ఆ గుహ గోడలపై ఎవరికీ అర్థం కాని ఓ పురాతన లిపిలో రాతలు కనిపిస్తాయని సమాచారం. ఆ రాతల్లో దాగి ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలంటే ఆ భాషను డీకోడ్ చేయాల్సి ఉంటుందట. కథలోని ఓ కీలక మిస్టరీని ఛేదించడానికి ఈ భాష, లిపి ఉపయోగపడతాయని తెలుస్తోంది.

అంటే ‘కిలికి’ తరహాలో కేవలం కొన్ని డైలాగ్స్ కోసం ఓ కొత్త భాషను వాడటం కాదన్నమాట. ‘వారణాసి’లో ఈ ఫిక్షనల్ లాంగ్వేజ్‌కు మరింత పెద్ద పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఓ కొత్త భాష.. దానికి ఓ పురాతన లిపి.. ఆ లిపిలో ఉన్న రహస్యాలు.. వాటిని ఛేదించాల్సిన అవసరం.. ఇవన్నీ కథలో భాగం కావడం ఆసక్తిని మరింత పెంచుతోంది.

‘వారణాసి’ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘కిలికి’ తర్వాత రాజమౌళి క్రియేట్ చేయబోయే ఈ కొత్త భాష ఎలా ఉంటుంది? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇది కూడా చదవండి: సెన్సార్ వాళ్లకి ఆ అధికారం లేదు.. కోనా వెంకట్ షాకింగ్ కామెంట్స్.!

 

 

 

[New Language for Varanasi, Varanasi Fictional Language, Varanasi New Language, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Baahubali Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com