Home

»

Latest News

వివాదంలో ప్రభాస్ ఫౌజీ: క్షమాపణ చెప్పాలంటూ నేతాజీ కుటుంబం డిమాండ్.!

Oct 26, 2026 11:19AM

ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ చుట్టూ వివాదం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను చూపించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా నేతాజీ కుటుంబానికి చెందిన చంద్ర కుమార్ బోస్ రంగంలోకి దిగి, చిత్ర దర్శకుడు హను రాఘవపూడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న విడుదలైన ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బెర్లిన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కనిపించాయి. 1942 మే 29న నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కలిసిన సందర్భాన్ని కూడా ఇందులో చూపించారు. అయితే ఆ సన్నివేశంలో నేతాజీ.. ప్రభాస్ పోషిస్తున్న కల్పిత పాత్రను ప్రశంసిస్తున్నట్టుగా కనిపించడం కొందరికి అభ్యంతరకరంగా అనిపించింది. దేశమంతా ప్రేమించే బోస్ లాంటి గొప్ప వ్యక్తి చేత ఓ కల్పిత పాత్రకు ఎలివేషన్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్ర కుమార్ బోస్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. స్వాతంత్ర్య పోరాటం, దేశ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు తీసే స్వేచ్ఛ దర్శకులకు ఉందని.. అయితే ఆ స్వేచ్ఛ పేరుతో చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

జాతీయ నాయకుల విషయంలో వాస్తవాలను వక్రీకరించి, కల్పిత అంశాలను జోడించడం నేరంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. నేతాజీ హోదాను తగ్గించేలా సన్నివేశాలను రూపొందించారని ఆరోపించారు. ఈ విషయంలో దర్శకుడు దేశ ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నేతాజీ హిట్లర్‌ను కలవడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా చంద్ర కుమార్ బోస్ వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో అంతర్జాతీయ మద్దతు పొందాలనే ఉద్దేశంతోనే నేతాజీ జర్మనీ నాయకుడు హిట్లర్‌ను, జపాన్ నాయకుడు హిడేకి టోజోను సంప్రదించారని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు.. నేతాజీ ఫాసిజాన్ని వ్యతిరేకించారని, ప్రజాస్వామ్య హక్కులను విశ్వసించారని గుర్తుచేశారు. హిట్లర్‌తో నేతాజీ ఒక అధీన వ్యక్తిగా కాకుండా, సమాన స్థాయిలో వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక సందర్భాన్ని సరిగ్గా చూపించకుండా, వివాదం సృష్టించేలా సన్నివేశాలను రూపొందించారని చంద్ర కుమార్ బోస్ విమర్శించారు.

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే కల్పిత గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 19న థియేటర్లలోకి రానుంది.

అయితే, గ్లింప్స్‌లోని సన్నివేశాలపై వస్తున్న విమర్శలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇది కూడా చదవండి: ‘ఫౌజీ’లో ప్రభాస్ విధ్వంసం.. ఆ 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి థియేటర్లు షేక్.!

 

 

 

[Prabhas Fauzi Controversy, Fauzi Netaji Controversy, Prabhas Fauzi Glimpse, Netaji Grandnephew, Chandra Kumar Bose, Bose Hitler Meeting, Prabhas, Fauzi Movie, Hanu Raghavapudi, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com