
అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni) తన కెరీర్‌లో సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాపై అఖిల్ మాత్రమే కాకుండా, అక్కినేని అభిమానులు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాను పక్కాగా మలచాలని తండ్రి నాగార్జున (Nagarjuna) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, 'లెనిన్' అవుట్‌పుట్ చూసిన నాగార్జున కొన్ని కీలక మార్పులు సూచించారట. సినిమా గమనాన్ని దెబ్బతీసే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఆయన దర్శకుడి మురళీ కిషోర్ అబ్బూరుకి సలహా ఇచ్చినట్లు సమాచారం. నాగార్జునకు జడ్జిమెంట్ విషయంలో మంచి పట్టు ఉండటంతో, ఆయన సూచనల మేరకు టీమ్ ఇప్పుడు ప్యాచ్ వర్క్ పనుల్లో బిజీగా ఉంది.

ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ భాగం విషయంలో మేకర్స్ రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండేలా కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని, థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండాలని నాగార్జున భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ క్లైమాక్స్ రీషూట్‌కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని అఖిల్ కసిగా ఉన్నాడు. నాగార్జున పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ మూవీ అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.






