
ఏఐ టెక్నాలజీ వచ్చాక సినిమాలకు ఎన్ని ప్రయోజనాలు వచ్చాయో.. అదే స్థాయిలో కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఒకరి ముఖాన్ని మరో వీడియోకు మార్ఫింగ్ చేయడం.. అసభ్యకరమైన కంటెంట్‌ను క్రియేట్ చేయడం.. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేయడం కామన్‌గా మారిపోయింది.
ఇటీవల నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై స్పందించారు.
డీప్‌ఫేక్ కంటెంట్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అకౌంట్ల వివరాలను ‘మా’ సేకరిస్తోందని మంచు విష్ణు తెలిపారు. ముఖ్యంగా నటీనటుల ఫొటోలను దుర్వినియోగం చేయడం, అసభ్యకరమైన కంటెంట్ తయారు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెట్టే అకౌంట్లపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు.
కేవలం ఓ వీడియోను డిలీట్ చేయించడం లేదా ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదని విష్ణు అభిప్రాయపడ్డారు. దీనిపై ఇండస్ట్రీ మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తదితర సంస్థలు కలిసి డీప్‌ఫేక్‌లను ఎదుర్కొనేందుకు ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా రాసేయొచ్చనే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇక సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న చర్చ కూడా ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. నటుడు రామ్ పోతినేని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి ప్రతిపాదనపై సీరియస్‌గా చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందేనని.. అయితే అదే స్వేచ్ఛను ఇతరులపై వేధింపులకు, గుర్తింపును దుర్వినియోగం చేయడానికి ఉపయోగించకూడదని అన్నారు.
ఇదిలా ఉంటే.. డీప్‌ఫేక్‌లతో పాటు సినిమాలపై ముందుగానే నెగెటివ్ ప్రచారం చేయడంపైనా మంచు విష్ణు స్పందించారు. సినిమా థియేటర్లలోకి రాకముందే కావాలనే నెగెటివ్ క్యాంపెయిన్లు చేయడం సరికాదని అన్నారు. విమర్శలు, రివ్యూలు, ట్రోలింగ్ అనేవి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో భాగమే అయినా.. ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం కూడా రాకముందే దాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం మాత్రం అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఈ నెగెటివ్ క్యాంపెయిన్ల వెనుక కొందరు ఇండస్ట్రీకి చెందిన వారే ఉండటం మరింత బాధ కలిగిస్తోందని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: రకుల్ సంచలనం.. ఇల్లీగల్ ప్రాపర్టీ, కాస్ట్లీ గిఫ్ట్‌లపై ఓపెన్ అయిన హీరోయిన్.!
[Manchu Vishnu Reaction On Deepfake Videos, Manchu Vishnu On AI Morphed Videos, Janhvi Kapoor AI Video, Chuttamalle AI Video, Manchu Vishnu Twitter, Janhvi Kapoor, Vishnu Manchu, Telugu Film News]





