అనుకున్న తేదీకే రానున్న 'కేజీఎఫ్ 2'
on May 14, 2020
యశ్ హీరోగా నటించిన 'కేజీఎఫ్: చాప్టర్ 1' ప్రేక్షకుల్ని అమితంగా రంజింపచేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రేక్షకులు 'కేజీఎఫ్: చాప్టర్ 2' కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ రెండో భాగంలోనూ రాకీ క్యారెక్టర్‌ను యశ్ పోషిస్తున్నాడు. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందనే ప్రచారంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మూవీ విడుదల 2021కి వాయిదా పడిందనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సారాంశం. అయితే ఇందులో నిజం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే 2020 అక్టోబర్ 23న 'కేజీఎఫ్ 2' విడుదలవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.
సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ మాట్లాడుతూ, "లాక్డౌన్ లేనట్లయితే ఈ పాటికి షూటింగ్ కంప్లీట్ అయివుండేది. ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. గవర్నమెంట్ అనుమతి తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నాం. జూలైలో గనుక షూటింగ్‌కు పర్మిషన్ లభిస్తే, ముందుగా అనుకున్న డేట్‌కే సినిమాని రిలీజ్ చేస్తాం" అని చెప్పాడు. 2020లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో 'కేజీఎఫ్ 2' ఒకటి. కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలవుతుండగా, 'కేజీఎఫ్ 2'ను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.
హీరోయిన్గా శ్రీనిధి శెట్టి, ఒక కీలక పాత్రలో రవీనా టాండన్ నటిస్తోన్న ఈ మూవీలో విలన్ అధీర క్యారెక్టర్‌ను బాలీవుడ్ బిగ్ యాక్టర్ సంజయ్ దత్ పోషిస్తున్నాడు. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తోన్న ఈ మూవీని తెలుగులో వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు.