Home

»

Latest News

ఎన్టీఆర్ ఐకానిక్ సాంగ్ 'జనని జన్మభూమిశ్చ' మళ్లీ రావడం సాధ్యమేనా?

Jul 21, 2026 5:36PM

 

ఎన్టీఆర్(Ntr)అనే మూడు అక్షరాల పేరుకి ఉన్న పవర్ ని చాటి చెప్పిన చిత్రం బొబ్బిలి పులి(Bobbili Puli). బొబ్బిలి పులి లాంటి సినిమా రావడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయపార్టీని స్థాపించడానికి  ప్రధాన కారణంగా నిలిచిన మూవీ కూడా. అభిమానులు అయితే బొబ్బిలిపులిని తలచుకొని రోజు ఉండదు. అంతలా బాబ్బిలి పులి తెలుగు చిత్ర సీమలో, అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. 

రీసెంట్ గా సినీ సర్కిల్స్ తో పాటు ఎన్టీఆర్ అభిమానుల్లో బొబ్బిలిపులి సినిమా యొక్క గొప్పతనాన్ని, దేశ భక్తిని చాటి చెప్పిన 'జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి" అనే సాంగ్ మళ్ళీ తెలుగు చిత్ర సీమలో వస్తుందా అనే చర్చ జరుగుతుంది. మిలటరీలో పని చేసే మేజర్ చక్రధర్ కి తన తల్లి చనిపోయిందని తెలిసినా,ఆ బాధని దిగమింగుకొని తోటి జవాన్లలో దైర్యం నింపుతూ 'జనని జన్మభూమిశ్చ'  పాట పాడుతాడు. మేజర్ చక్రధర్ గా ఎన్టీఆర్ భావోద్వేగంతో పాడుతుంటే ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. కళ్లు చెమరుస్తాయి. కానీ నేటి ఆధునిక సినీ ప్రపంచంలో అసలు అలాంటి భావోద్వేగపూరితమైన మ్యూజికల్ మాస్టర్‌పీస్ మళ్లీ రావడం సాధ్యమేనా అనే ప్రశ్న కోట్లాది మంది సంగీతాభిమానుల గుండెల్లో మెదులుతోంది. ఈ పాట సాధించిన అపూర్వ విజయానికి ప్రధాన కారణం అందులోని త్రివేణీ సంగమం. జె.వి. రాఘవులు స్వరపరచిన స్వరాల అమరిక, దర్శకుడు దాసరి నారాయణరావు స్వయంగా అందించిన హృదయవిదారకమైన సాహిత్యం,  గానగాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గొంతులోంచి వచ్చిన ఆర్ద్రత జనని జన్మభూమిశ్చని  అమరత్వానికి చేర్చాయి. చరణాల్లో వచ్చే 'నీ తల్లి మోసేది నవమాసాలేరా.. ఈ తల్లి మోయాలి కడవరకురా" , ఆ రుణం తలకొరివితో తీరేనురా.. ఈ రుణం ఏ రూపాన తీరేదిరా.. ఆ రూపమే ఈ జవానురా అంటూ సాగే ప్రతీ అక్షరం కన్నతల్లి ప్రేమని , మాతృభూమి రుణాన్నీ ఒకే సందర్భంలో చెప్పుతాయి. మొత్తం 4 నిమిషాల 55 సెకన్ల నిడివి ఉన్న సాంగ్ లో ప్రతి అక్షరం ఒక నిప్పుకణిక. సినిమా పాటగా మాత్రమే కాకుండా దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించే ప్రతీ జవాను త్యాగానికి చిహ్నంగా నిలిచింది.


Also read: క్రేజీ దర్శకుడితో విశ్వక్ సేన్ మూవీ.. మొన్న నేషనల్ అవార్డు కూడా వచ్చింది 


నేటి ట్రెండ్‌ను పరిశీలిస్తే, మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదికలైన యూట్యూబ్, జియోసావన్, స్పాటిఫైలలో ఈ పాట ఇప్పటికీ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది. కేవలం ఒక్క యూట్యూబ్ వేదికపైనే రకరకాల వర్షన్లలో 10 మిలియన్లకు పైగా డిజిటల్ స్ట్రీమ్స్ సాధించడం ఈ సాంగ్ కి ఉన్న నిరంతర ఆదరణకి  సాక్ష్యం. కానీ ప్రస్తుత కాలంలో ఫాస్ట్ బీట్స్, డిజిటల్ లూప్స్, ఆటో-ట్యూన్‌లతో కూడిన శబ్దాల హడావుడి ఎక్కువైంది. ఈ 2026 డిజిటల్ యుగంలో పాటల ఆయుష్షు కొన్ని వారాలకే పరిమితమవుతున్న తరుణంలో, "జనని జన్మభూమిశ్చ" లాంటి మరణం లేని సాంగ్ వస్తుందేమో చూడాలి. 1982లో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి పులిలో శ్రీదేవి హీరోయిన్ కాగా రావు గోపాలరావు, జగ్గయ్య, అల్లు రామలింగయ్య. మురళి మోహన్ ,కీ రోల్స్ , వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ నిర్మించాడు. దాదాపు ₹4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ప్రతి తెలుగువాడి గుండెల్లో ఆత్మీయ బంధువుగా నేటికీ కొలువుతీరి ఉంది. 

ntr, bobbili puli, dasari narayanarao, sridevi

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com