Home

»

Latest News

'భగవంత్ కేసరి'కి జాతీయ అవార్డు.. 'జన నాయకుడు'కి A సర్టిఫికెట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్.!

Jul 21, 2026 5:41PM

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా? మీరు ముందుగానే ఊహించారా?
ముందుగానే కొన్ని ఇబ్బందులు రావొచ్చని మేము అనుకున్నాం. విజయ్ గారు కూడా, "ఇది నా చివరి సినిమా. దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాను. అందువల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది" అని ముందే చెప్పారు. అయితే రిలీజ్ సమయంలో థియేటర్స్ విషయంలో కొన్ని అడ్డంకులు రావచ్చని మాత్రమే భావించాం. కానీ మేము ఊహించని కొన్ని పరిస్థితులు వచ్చాయి. జీవితం ఎప్పుడూ ఊహించని మలుపులు తీసుకుంటుంది. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు జులై 23కి వచ్చింది. మొత్తంగా చూస్తే రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు.. ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అసలు ఊహించలేదు. కాకపొతే ఇందులో మంచిని కూడా చూడాలంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వస్తోంది. అది అభిమానులకు మరింత ఉత్సాహం ఇస్తుంది. 

మీరు బిజినెస్‌లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు.సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. అకాడమిక్ పుస్తకాల్లో దొరకని ఎన్నో గొప్ప విషయాలు సినిమాల్లో ఉంటాయి. పాటలు, లిరిక్స్, కథలు... ఇవన్నీ మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో "ఒకేలాగే బతికేయడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు?" అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. ఇలాంటి గొప్ప ఆలోచనలను సమాజానికి సినిమాల ద్వారానే బలంగా చెప్పొచ్చు. బిజినెస్‌లో ఎన్నో బాధ్యతలు నిర్వహించిన తర్వాత కూడా నా బకెట్ లిస్ట్‌లో సినిమా రంగంలోకి రావడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను.  నాకు స్ఫూర్తిని ఇచ్చన అందరితో పని చేయాలని ఈ ప్రయాణం చేస్తున్నాను, 

విజయ్ గారితో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఇది నా తొలి తమిళ సినిమా. విజయ్ గారి మేనేజర్‌తో నాకు ముందే పరిచయం ఉంది. 'లియో' సినిమా సమయంలో మా మధ్య చర్చలు జరిగాయి. గోట్ తర్వాత విజయ్ గారు మరో సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన మేనేజర్‌కు నా ఆసక్తిని చెప్పాను. ఒక్క మీటింగ్‌లోనే ఈ సినిమా ఓకే అయింది. అలా విజయ్ గారితో నా ప్రయాణం ప్రారంభమైంది.

'భగవంత్ కేసరి' సినిమాను 'జన నాయకుడు'కు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?
'భగవంత్ కేసరి' సినిమా విజయ్ గారికి చాలా నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం. అందులోని రెండు సన్నివేశాలను మాత్రమే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందించాం. ఈ విషయంపై అనిల్ గారితో కూడా మాట్లాడాం. పూర్తిగా కొత్త సబ్జెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేశాం. ట్రైలర్‌ను కూడా చాలా నిజాయితీగా కట్ చేశాం. 'భగవంత్ కేసరి'లోని రెండు సన్నివేశాల ప్రభావం ఉందనే విషయాన్ని దాచలేదు. అయితే ట్రైలర్ చూసి ఒక అభిప్రాయం ఏర్పడొచ్చు. కానీ సినిమా చూస్తే పూర్తిగా కొత్త ప్రపంచం, కొత్త కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. అమ్మాయిని ఆర్మీలో జాయిన్ చేయాలనే థ్రెడ్ తప్పితే మిగతాదంతా పూర్తిగా కొత్త కథ. ఓపెన్ మైండ్‌తో చూస్తే సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అవుతుంది.

సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి కదా? బాధపడ్డారా?
ఇందులో గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్, సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశం ఉంది. భగవంత్ కేసరికి  జాతీయ అవార్డు కూడా అందుకుంది. అలాంటి స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమాకు మొదట మా సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత A సర్టిఫికెట్ ఇవ్వడం కొంచెం బాధ కలిగించింది. ఎందుకంటే ఈ సినిమా యువతను ప్రేరేపించేలా, ఆలోచింపజేసేలా ఉంటుంది. ఎక్కువ మంది కుటుంబాలతో కలిసి చూస్తే ఆ సందేశం మరింత మందికి చేరేది. అయితే సెన్సార్ బోర్డు తమ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంది.

ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది కదా? నిర్మాతగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
 -ఇంత పెద్ద సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే నిర్మాతగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవన్నీ సహజంగా వస్తాయి. నిర్మాత ఒక్కరిపైనే కాదు... మొత్తం సినిమా ఎకోసిస్టమ్‌పై దీని ప్రభావం పడుతుంది.

-మన గమ్యం గొప్పగా ఉన్నప్పుడు, ఆ ప్రయాణం కూడా కొన్నిసార్లు కఠినంగానే ఉంటుంది. గొప్ప విజయాలు ఎప్పుడూ సులభంగా రావు. దేవుడు యుధం తర్వాతే కిరీటం ఇస్తాడు. పోరాటాలను దాటిన తర్వాతే విజయం దక్కుతుంది. 
 
ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ గారి నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. అంచనాలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారా?
ఖచ్చితంగా. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ గారి సినిమా థియేటర్లలో విడుదల కావడం ప్రేక్షకులకు, అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ తరం ప్రేక్షకులకు ఒక ముఖ్యమంత్రి నటించిన సినిమాను థియేటర్‌లో చూసే అవకాశం రావడం చాలా అరుదు. కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికీ మెమొరబుల్ మూమెంట్ అవుతుంది.

విజయ్ గారితో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతం విజయ్ గారి దృష్టంతా ప్రజా సేవపైనే ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆయన పూర్తిస్థాయిలో కష్టపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఆయనతో మరో సినిమా చేయాలని ఉంటుంది.

చిరంజీవి గారితో చేస్తున్న సినిమా గురించి? 
నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు, ఆయన ప్రయాణం నాకు స్ఫూర్తి. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పాటలు, సందేశాలు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎంతో ప్రేరణ ఇచ్చాయి. అందుకే నేను తెలుగులో సినిమా చేస్తే మొదట చిరంజీవి గారితోనే చేయాలని ముందే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది.

 

 

Producer KVN, Interview, Jana Nayagan, Jana Nayakudu, Vijay, Balakrishna

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com