.webp)
కొన్ని సార్లు రావడం లేటు అవ్వచ్చేమో గాని, రావడం మాత్రం పక్కా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్టు , ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ కేసులో మద్రాస్ (చెన్నై)హైకోర్టు ఇచ్చే తీర్పు కూడా అదే విధంగా పాజిటివ్ గా వచ్చేలా ఉంది.
జోసెఫ్ విజయ్ ఎన్నికల అఫిడవిట్ కేసులో మద్రాస్ హైకోర్టు కీలకమైన మరియు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గత ఎన్నికల్లో పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50,000 కంటే ఎక్కువ ఓట్ల భారీ మెజార్టీతో విజయపరంపర సాధించిన సీఎం విజయ్ ఎన్నిక చెల్లదంటూ, పెరంబూర్ నియోజకవర్గానికి చెందిన ఓటరు ఎస్. దినేష్ మద్రాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు .30 కోట్ల విలువైన స్థిరాస్తుల వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని, ఆస్తుల వివరాలను సమగ్రంగా వెల్లడించకపోవడం ఎన్నికల నిబంధనల యొక్క తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్రంగా వాదించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం అత్యంత కీలకమైన ప్రశ్నలను సంధించింది. అసలు అభ్యర్థి ఇప్పటికే సుమారు 600 కోట్ల విలువైన అపార ఆస్తులను అఫిడవిట్‌లో స్పష్టంగా ప్రకటించినప్పుడు, అందులో కేవలం 30 కోట్ల ఆస్తుల వివరాలు నమోదు కాకపోతే దానిని ఉద్దేశపూర్వక అవినీతి చర్యగా భావించవచ్చా అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: మా లాయర్లతో సినిమా తీయండి: ప్రముఖ నటుడ్ని కోరిన సుప్రీంకోర్టు జడ్జి

సాధారణంగా ప్రముఖ నాయకులు లేదా అభ్యర్థులు స్వయంగా కూర్చుని తమ ఆస్తుల జాబితాను తయారు చేసుకోరని, వారు పూర్తిగా తమ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరిజ్ఞానంపైనే ఆధారపడతారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో తాను కూడా తన ఆస్తుల జాబితా కోసం సిఏపైనే ఆధారపడ్డానని గుర్తుచేశారు. అటువంటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ పొరపాటున లేదా సాంకేతిక లోపం వల్ల కొన్ని ఆస్తుల వివరాలు నమోదు చేయకపోతే, దానికి అభ్యర్థి ఎన్నికనే రద్దు చేయడం ఏమాత్రం సమంజసమవుతుందని కోర్టు నిలదీసింది. అంతేకాకుండా, విజయ్ రూ.30 కోట్ల ఆస్తుల వివరాలను వెల్లడించకపోవడం వల్ల పెరంబూర్ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఏమైనా ప్రభావితమైందా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. 50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ప్రభావాన్ని చిన్న చిన్న వ్యత్యాసాల ఆధారంగా రద్దు చేయలేమని విజయ్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. అయితే పోరూరు మరియు ఇతర ప్రాంతాల్లోని ఆస్తుల కొనుగోలు విలువలు, విస్తీర్ణంపై కూడా స్పష్టత లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేయడంతో, తమిళనాడు రాజకీయంలో 30 కోట్ల ఆస్తుల వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
[Cm Vijay election affidavit case madras hc, CM Vijay Election Affidavit Case, TVK Vijay Assets Dispute, Madras High Court Hearing, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]






