TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా? ఇవిగో ప్రూఫ్స్!

Nov 24, 2026 3:27PM


కొన్ని సినిమా న్యూస్ అంతే ఒక పట్టాన అర్ధం కావు.  కానీ న్యూస్ మొత్తం చదివి మెదడు, మైండ్ స్థిమితం అయ్యాక మనం చదివిన న్యూస్ నిజమే కదా అని వాస్తవ అవగాహనకి వచ్చి పది మందికి ఆ న్యూస్ గొప్పతనం చెప్పి మురిసిపోతుంటాం. అలాంటి ఒక న్యూస్ మ్యూజిక్ సంచలనం అనిరుద్.


తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అంటేనే మాస్ బీట్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తుకొస్తాయి. ఆయన మ్యూజిక్‌కు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'జైలర్', 'విక్రమ్', 'జవాన్' వంటి సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. దీంతో మన టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు సైతం అనిరుధ్‌తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తెలుగు సినిమాల విషయానికి వస్తే మాత్రం ఆయన మ్యూజిక్ ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతోందా? తాజాగా నాని 'ది ప్యారడైజ్' సినిమాతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.


అనిరుధ్ కెరీర్‌ను పరిశీలిస్తే తమిళంలో ఆయనకు తిరుగులేని క్రేజ్ ఉంది. 'వై దిస్ కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత వరుస విజయవంతమైన ఆల్బమ్స్‌తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. తెలుగులో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' తో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్', విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్', ఎన్టీఆర్ 'దేవర' వంటి సినిమాలకు సంగీతం అందించారు. అయితే ఈ సినిమాల్లో కొన్ని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ.. అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలని అందుకోలేదు.

దీంతో అనిరుధ్‌కు తమిళంలో ఉన్నంత స్థాయిలో తెలుగులో సక్సెస్ రేట్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'ది ప్యారడైజ్'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విడుదలైన గ్లింప్స్‌లో అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమా విడుదలయ్యే సమయానికి మ్యూజిక్‌పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.

ఇది కూడా చదవండి: మరోసారి ధనుష్ 'ఓం'కి తమిళనాట నిరాశేనా: కలెక్షన్లలోభారీ తేడా!
 

అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం పరిస్థితి మరోలా మారింది. కొన్ని కీలక సన్నివేశాల్లో అనిరుధ్ తన మార్క్ చూపించినప్పటికీ, ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆశించిన స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదనే విమర్శలు వినిపించాయి. సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలని , యాక్షన్ ఎపిసోడ్స్‌ని  తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లడంలో అనిరుధ్ పూర్తిగా సక్సెస్ కాలేదనే అభిప్రాయాలు వచ్చాయి.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 'ది ప్యారడైజ్' సినిమాలోని పాటలకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా 'ఆయా షేర్', 'యేష నాగుల' వంటి పాటలు ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యాయి. విడుదలైన తర్వాత కూడా ఈ పాటలు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి.

 కానీ సినిమాలోని సన్నివేశాలకు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంలో మాత్రం కొన్ని చోట్ల నిరాశపరిచారనే చర్చ జరుగుతోంది. పాటలు విడిగా వినడానికి బాగుండటం వేరు.. సినిమాలో వాటి ప్రభావం ప్రేక్షకుడిపై పడటం వేరు. ఈ రెండింటి మధ్య తేడా 'ది ప్యారడైజ్' విషయంలో స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ అయిందో తెలిసిందే. చాలా సన్నివేశాలు ఆయన సంగీతం వల్ల మరింత ఎలివేట్ అయ్యాయి. అలాగే 'విక్రమ్', 'దేవర' వంటి చిత్రాల్లోనూ తనదైన మ్యూజిక్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అలాంటిది 'ది ప్యారడైజ్' విషయంలో మాత్రం అదే స్థాయి ప్రభావం ఎందుకు కనిపించలేదు? దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా సంగీతం అందించలేకపోయారా? లేక సినిమాకు సంబంధించిన ఎడిటింగ్, సన్నివేశాల కూర్పు వల్ల బీజీఎం ప్రభావం తగ్గిందా? అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.


మొత్తానికి అనిరుధ్ టాలెంట్‌పై ఎలాంటి సందేహం లేదు. కానీ తెలుగు సినిమాల్లో ఆయన అందిస్తున్న సంగీతం ప్రతిసారి అంచనాలను అందుకుంటోందా? అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి మన తెలుగు దర్శకులు ఇకపై కూడా అనిరుధ్‌కే ప్రాధాన్యత ఇస్తారా? లేక మన సంగీత దర్శకులకు పెద్దపీట వేస్తారా? చూడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం మొత్తం సోషల్ మీడియా వేదికగా తెలుగు సినిమా అభిమానులు, నెటిజన్స్ వినిపిస్తున్న మాటలే..  

 

మీకు నచ్చవచ్చు: మీ కోసం కాకా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చేస్తున్నాడు: ఫ్యాన్స్ గెట్ రెడీ! 

                              ధనుష్ ఓం అసలు కలెక్షన్స్ బయటకొచ్చాయి! 

 

[Anirudh Ravichander, The paradise, jailer, Nani, Tollywood]

google-ad-img