RELATED EVENTS
EVENTS
Sri Gazal Srinivas Music concert in Minnasota

మిన్నెసోట లో గజల్ శ్రీనివాస్ కి 'గజల్ గాన కళానిధి' బిరుదు ప్రధానం అమెరికాలో అతిపెద్ద నది మిస్సిసిపి జన్మస్థానం అయిన మిన్నెసోట రాష్ట్రము శనివారం సాయంత్రం గజల్ శ్రీనివాస్ గారి గానామృతంతో పులకరించి పోయింది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే అచ్చ తెలుగు నానుడికి "చూస్తే గజల్ శ్రీనివాస్ గారి గజల్సే చూడాలి" జత చేసినట్లైంది. గుండె మూలల్లో దాక్కొని ఉన్న మమతానురాగాలను, అతి సున్నితంగా తట్టి లేపి, మనసును బాల్యం వైపు పరుగులెట్టించిన వైనం, కార్యక్రమం ఆసాంతం, కనుమరుగవుతున్న ఆత్మీయత బంధాలను, మానవ జాతి విలువలను, ముక్ష్యంగా ఎంతో పురాతనమైన, ఇప్పటికి దేదీప్యమానంగా విరాజిల్లు తోన్న మన తెలుగు జాతి శోభను, కమ్మని గజల్స్ రూపంలో ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల కళ్ళు చెమర్చేల చేసింది. ఆనందలోక విహారానుభూతిని మిగిల్చింది. వివరాలోకి వెళితే

 

తెలుగు అసోసియేషన్ అఫ్ మిన్నెసోట (TEAM) ఈ శనివారం తేది మే 12 2012 న, మూడు ప్రపంచ రికార్డులు సాధించిన మనందరి ఆత్మీయుడు, నిగర్వి, మానవతావాది, డాక్టర్ శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని సాదరంగా మిన్నెసోట, మిన్నేయపోలిస్ నగరానికి TEAM ఆహ్వానించింది. శాస్త్రీయ నృత్యం అనంతరం TEAM ఉపాధ్యక్షులు శ్రీ సూర్య దుగ్గిరాల గారు, గజల్ శ్రీనివాస్ గారి సేవ కార్యక్రమాలను, ఆయన విజయాలను సభికులకు వివరించారు. తదుపరి, గజల్ శ్రీనివాస్ గారు కార్యక్రమం ప్రారంభిస్తూ మదర్స్ డే సందర్భంగా, తల్లి గొప్పదనాన్ని వర్ణిస్తూ అద్భుతమైన గజల్ పాడారు. ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చిన పాట అది. గజల్ అంటే హార్మోనియం, తబలా, సుధీర్గ రాగాలు ఉంటాయేమో అని కొంతమంది అనుమానం, కాని, ఆయన వెంట మందీ మార్బలం లేదు, హార్మోనియం, తబలా, ఇతర ఏ వాద్యకారులు లేరు, చేతిలో కంజెరతో, కమ్మని గాత్రంతో, ఒక్కడే ఒకసైన్యంలాగ, నవయుగ వైతాళికుడిలా, మరచిపోతున్నమధురానుభూతులకు దారిచూపే దీపస్తంభంలా నిలిచిన ఆయనను చూసిన, ఆ గాత్రాన్ని విన్న ఆహుతులు కళ్ళు చెమర్చాయి.

 

 

తరువాతి పాటలో "ఒక్కసారి ఊరుపోయిరా..." అంటూ, అందరికి తమ బాల్యాన్ని గుర్తు చేసారు. పచ్చని పొలాలు, సన్నని పంటకాలువల వెంట మనసంత పరుగులు తీయగా, ఆనందపు వర్షంలో అందరు చిన్నపిల్లలై ఆటలాడారు. శ్రీనివాస్ గారు, తన చిన్నారి ముద్దుల కుమార్తె చిరంజీవి సంస్కృతి చేత కూడా ఒక పాట, గజల్ పాడించారు. కోయిల పిల్లకు సంగీతం నేర్పాలా ? ఆ చిన్నారి కూడా, తండ్రికి తగ్గ తనయ అనిపించుకొంది. మనం ఎంతో మంది తల్లికోసం పాటలు పాడడం విన్నాం, మరి తండ్రి సంగతి ఏమిటీ? ఆయన ATM మెషిన్ కాదు, అసలు తండ్రి మనసును చెబుతా వినండి అని ఆయన పాడిన గజల్ వింటే, కళ్ళు చెమర్చని వాళ్ళు లేరు. అందరు తమ కుర్చిలలోనుండి లేచి శ్రీనివాస్ గారికి తమ అభినందనలు తెలియచేసారు. ప్రతి ఒక్క లైనుకు, గట్టిగ చప్పట్లు, విజిల్లు, అరుపులు, ఇలా ఒక స్థాయిలో జరిగిన కార్యక్రమం ఇది. ముక్ష్యంగా శ్రీనివాస్ గారు చెప్పిన జోక్స్ అందరిని ఎంతో ఆకట్టు కొన్నాయి. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, గజల్ పాడుతూ, కొంతమంది ప్రేక్షకుల పేర్లు తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, వారిని స్టేజి మీదనుండి, పేరుపెట్టి పిలిచి చెప్పండి మీరేమంటారు అని అడుగుతారు, ఏ ప్రయోగం ఎంతో మందికి నచ్చింది. కార్యక్రమంలో భాగంగా భార్య భర్తల అనుభందం గురించి చెప్పి, ఎందఱో భార్య భర్తల మనస్సులో నవ్వులు పూయించారు.

 

కార్యక్రమం చివరలో, TEAM గౌరవ బోర్డు అఫ్ డైరెక్టర్ శ్రీ వెంకట్ కొత్తూరు గారు, శ్రీనివాస్ గారి మీద కవిత రాసి TEAM తరుపున ఆయనకు "గజల్ గాన కళా నిధి" బిరుదును ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలోకి TEAM కమిటీ సభ్యులను TEAM అధ్యక్షులు సుధీర్ నందమూరు గారు, ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు తన "దేవాలయం" cd ని TEAM కు అందచేసి, ప్రతి ఒక్కరికి వీలైనన్ని కాపీలు అందచేయమని అభ్యర్ధించారు. చక్కటి విందు భోజనంతో ఈ కార్యక్రమం పూర్తి అయ్యింది. శ్రీ శ్రీనివాస్ గారు తదుపరి కార్యక్రమ నిమిత్తం "IOWA" రాష్ట్రానికి ఆదివారం ప్రయాణం అయ్యారు. ఇంతటి ఘన విజయం సాధించినందుకు మిన్నెసోట తెలుగు పెద్దలందరూ TEAM ను, ముక్ష్యంగా ఈ కార్యక్రమానికి సమస్త సహకారాలు అందించి, శ్రీనివాస్ గారి కుటుంబానికి సగౌరవ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ హరి పల్లెంపాటి గారి దంపతులను అభినందించారు. TEAM అధ్యక్షులు శ్రీ సుధీర్ నందమూరు గారు, ప్రతి ఒక్క కార్యకర్తలను పేరు పేరున అభినందించారు.

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;