తగ్గుముఖం పట్టిన బహుదా వరద: నాగావళిలో పెరిగిన ప్రవాహం.. వరద ముంపులోనే సిక్కోలు.!
Publish Date:Oct 30, 2026
Advertisement
భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహించిన బహుదా నది కొద్దిగా నెమ్మదించింది. వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గురువారం (అక్టోబర్ 29)తో పొలిస్తే.. బహుదాలో వరద ప్రవాహం ఒకింత తగ్గగా, నాగావళిలో కొద్దిగా పెరిగింది. గురువారం నాగావళిలో 40 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, శుక్రవారం ఉదయం అది 47,900 క్యూసెక్కులకు, శ్రీకాకుళం పాత వంతెన వద్ద 48 వేల 500 క్యూసెక్కులకు పెరిగింది. అయితే ఈ పెరుగుదల ఆందోళనకరం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే ఈ ప్రవాహం తక్కువేనని అంటున్నారు. ఇక పోతే వంశధారలో గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 77 వేల 457 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు కుడి, ఎడమ కాలువలు మూసివేసి.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో గురువారం (అక్టోబర్ 29) నుంచి అమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక శుక్రవారం (అక్టోబర్ 30) కూడా కొనసాగుతోంది. మరోవైపు ఇచ్ఛాపురం వద్ద బహుదా నది వరద ఉధృతి తగ్గడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గురువారం (అక్టోబర్ 29)న బహుదాలో 79వేల 820 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా శుక్రవారం (అక్టోబర్ 30) న ప్రవాహం 60 వేల 297 క్యూసెక్కులకు పడిపోయింది. వర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. [Srikakulam Flood Situation, Bahuda, Nagavali, Water Flow, Water Levels, Telugu One]
http://www.teluguone.com/news/content/srikakulam-flood-situation-43-235829.html





