political-news-img

ఎయిర్ ఇండియాలో ఉచిత ప్రయాణాల పేరిట భారీ అక్రమాలు!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో అంతర్గతంగా జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ ఉద్యోగులకు కల్పించే 'ఎంప్లాయీ లీజర్ ట్రావెల్' (ELT) పాలసీని వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు యాజమాన్యం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుమారు 4,000 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని టాటా గ్రూప్ యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ జరిపిన అంతర్గత విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా ఎయిర్ ఇండియా తన సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు (భార్య/భర్త, తల్లిదండ్రులు) ఏడాదికి నిర్దిష్ట సంఖ్యలో ఉచిత లేదా రాయితీతో కూడిన విమాన టికెట్లను కేటాయిస్తుంది. అయితే, చాలామంది ఉద్యోగులు తమకు సంబంధం లేని వ్యక్తులను కుటుంబ సభ్యులుగా చూపి ఈ ప్రయోజనాలను పొందినట్లు ఆడిట్‌లో తేలింది. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, కొందరు సిబ్బంది తమకు లభించిన ఉచిత టికెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నుంచి ఈ అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉదంతం సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా, నైతిక విలువలపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిలో మెజారిటీ ఉద్యోగులు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ (టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత) తర్వాత చేరిన వారే కావడం గమనార్హం. దీనిపై స్పందించిన యాజమాన్యం, నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఆయా ప్రయాణాల ఖర్చును రికవరీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురికి భారీ జరిమానాలు విధించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు (ఆధార్, బర్త్ సర్టిఫికేట్ మొదలైనవి) సమర్పించడం తప్పనిసరి. సరైన ఆధారాలు ఉంటేనే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ఇటువంటి అక్రమాలపై 'జీరో టోలరెన్స్' విధానాన్ని అనుసరిస్తామని సంస్థ సంకేతాలిచ్చింది.

Publish Date: Mar 19, 2026 6:43PM

political-news-img

పిల్లి చేసిన పనికి ఓ యువతి ఆత్మహత్య

నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దూరమవుతూ, భావోద్వేగ పరమైన బలహీనతలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ బంధాలు, స్నేహాలు తగ్గిపోతున్న సమయంలో పెంపుడు జంతువులపై అధిక మమకారం పెరగడం కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీ స్తోందనే ఆందోళన వ్యక్తమ వుతోంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌ పేట్ ప్రాంతానికి చెందిన హిమబిందు (20) అనే యువతి బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చింది. ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి, కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం ఏర్పడింది. అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడం హిమబిందును తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను తట్టుకోలేక ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలిం చినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.“పిల్లిని ఇంటికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరకు పిల్లి చనిపోవడంతో మా కుమార్తె కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది” అంటూ తల్లిదండ్రులు విలపించడం హృదయ విదారకంగా మారింది. ఈ ఘటనతో మరోసారి సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం, భావోద్వేగ అస్థిరతపై చర్చ మొదలైంది. పెంపుడు జంతువులపై ప్రేమ సహజమే అయిన ప్పటికీ, అది మానసికంగా అతిగా ఆధారపడే స్థాయికి చేరితే ఇలాంటి దుర్ఘటనలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఎటువంటి ఘటనలు రెండు జరిగాయని నిపుణులు పేర్కొన్నారు... కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుని, భావోద్వేగ పరమైన మద్దతు అందించాల్సిన అవసరం మరింతగా పెరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు.

Publish Date: Mar 19, 2026 6:28PM

political-news-img

వైఎస్ కుటుంబంలో 11 ఏళ్ల‌కు ఒక మ‌ర‌ణం...దీని వెన‌క దాగిన ర‌హ‌స్య‌మేంటి?

దేవ‌త‌ల‌కంటూ మ‌ర‌ణం లేదు. ఉన్న‌ద‌ల్లా రాక్ష‌స మ‌ర‌ణాలు, మానవ‌ మ‌ర‌ణాలు. ఈ మ‌ర‌ణాల్లో.. మాన‌వ మ‌ర‌ణాలు.. పుట్టుక ఎంత‌ స‌హ‌జ‌మో, మ‌ర‌ణ‌మూ అంతే స‌హ‌జంగా ఉంటాయి. వీటి విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలుండ‌వు. అదే రాక్ష‌స మ‌ర‌ణాలు ఎలాంటివో చూస్తే.. ఇవి రావ‌ణ కాష్టంలా ఎంత‌కీ చ‌ల్లార‌వు. ఇప్ప‌టికీ అవి అంతులేని ర‌హ‌స్యంగా మిగిలిపోతాయి. అలాంటి మ‌ర‌ణాల్లో వైయ‌స్ కుటుంబ మ‌ర‌ణాలు అత్యంత ఘోర‌మైన‌వి, దారుణ‌మైన‌వి. రాజారెడ్డి కావ‌చ్చు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి కావ‌చ్చు, వివేకానంద‌రెడ్డివి కావ‌చ్చు. వీరి మ‌ర‌ణాలు కూడా అంతే మిస్ట‌రీని త‌ల‌పిస్తున్నాయి.ఇప్ప‌టికీ వైయ‌స్ మ‌ర‌ణం విష‌యంలో ఒక మిస్ట‌రీ దాగి ఉంది. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించారు. దీనిపై అప్పట్లో అనేక కథనాలు వినిపించాయి. వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్లే.. హెలికాప్టర్ కూలిపోయిందని అధికారికంగా ఇటు CBI, అటు DGCA అధికారులు తేల్చారు. అయితే, అత్యంత సురక్షితమైన బెల్- 430 హెలికాప్టర్ అంత సులభంగా ఎలా కూలిపోతుందనేది ఇప్పటికీ కొందరిలో ఉన్న అనుమానం. అప్పట్లో రిలయన్స్ వంటి బడా సంస్థలకు.. వైఎస్సార్ ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాల వ‌ల్లే.. ఈ ప్రమాదం జ‌రిగింద‌నే మాట వినిపించింది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి.హెలికాప్టర్ గల్లంతైన తర్వాత.. కొన్ని గంటల వరకు దాని జాడ తెలియకపోవడం, లోకేటర్ సిగ్నల్స్ పని చేయకపోవడంపై.. సాంకేతికపరమైన సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. ఇక రెండోది వైఎస్ వివేకానంద రెడ్డి మరణం. ఇందులోని మిస్టరీ కూడా ఇప్ప‌టికీ అంతుచిక్క‌కుండా ఉంది. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్య కేసు ఇప్ప‌టికీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇందులో ప్రధానంగా దాగి ఉన్న మిస్టరీలేంటో గ‌మ‌నిస్తే.. మొదటి వెర్షన్- గుండెపోటు. వివేకా చనిపోయినప్పుడు మొదట అది గుండెపోటుగా ప్రచారం జరిగింది. రక్తపు మడుగులో ప‌డి ఉన్న మృతదేహాన్ని చూసి కూడా గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సాక్ష్యాలను తుడిచివేయడానికి ఎవరు ప్రయత్నించారు? అనేది అత్యంత‌ ప్రధానమైన‌ మిస్టరీ. మిస్ట‌రీ నెంబ‌ర్ టూకి వ‌స్తే.. లెట‌ర్, మొబైల్. వివేకా రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ, ఆయన మొబైల్ ఫోన్ దాచిపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆ లేఖలో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉండటంపై కూడా ఆరా తీస్తోంది సిబిఐ.గొడ్డలి పోటు. పోస్ట్‌మార్టం తర్వాత ఇది గుండెపోటు కాదు, గొడ్డలితో తల వెనుక మోది.. చేసిన‌ హత్యగా తేలింది. ఇంతటి దారుణమైన హత్యకు గల అసలు కారణం ఏమిటి? ఒక నేరం వెన‌క మోటివ్ తెలిస్తే.. మిగిలినదంతా తెలిసిపోతుందని అంటారు. అలాంటి మోటివ్స్ ఏంటో చూస్తే.. మొద‌టి మోటివ్.. ఆస్తి వివాదాలు. కుటుంబంలో ఉన్న ఆస్తుల పంపిణీ గొడవలు. ఇక పోతే రెండో పెళ్లి. వివేకా చేసుకున్న రెండో వివాహం కుటుంబ సభ్యులకు నచ్చలేదా? అన్న‌దొక ప్ర‌శ్న‌. మూడోది రాజకీయ కారణం. ఎంపీ సీటు విషయంలో లేదా కడప రాజకీయాల్లో ఆధిపత్యం కోసమా? అన్న అంశాలిక్క‌డ ఎంత‌కీ ముడి వీడ‌టం లేదు. ప్రస్తుతం సీబీఐ.. ఈ కేసును విచారిస్తోంది. తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ సునీత మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చుతోంది. అవినాష్ రెడ్డి వాదన ఎలాంటిదో చూస్తే.. వివేకా రెండో వివాహం వల్ల వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని, తనను ఇరికించడానికి రాజకీయ కుట్ర జరుగుతోందని అంటున్నారు అవినాష్. ఇక సునీత రెడ్డి పోరాటం ఏంట‌ని ప‌రిశీలిస్తే.. తన తండ్రిని చంపిన వారు ఎవరో అందరికీ తెలుసని, అధికారంలో ఉన్నవారు నిందితులను కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు ఇన్నాళ్లు. ఇప్పుడు ఆమె అనుమానం వ్య‌క్తం చేసిన వ్య‌క్తుల‌కు అధికారం లేక పోయినా.. కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ బ‌లంగా ఉంద‌ని భావిస్తున్నారామె. ఇక వైయ‌స్ తండ్రి రాజారెడ్డి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ కూడా అలాగే ఉందా? అని చూస్తే.. వై.ఎస్. రాజారెడ్డి 1998 మే 23న హతమయ్యారు. వేముల మండలం, కల్వర్టు ద‌గ్గ‌ర‌ బాంబు దాడితో పాటు, వేటకోడవళ్లతో జరిగిన ఈ దాడిలో ఆయన మరణించారు. ఇందులో ఎలాంటి మిస్ట‌రీ లేద‌ని అంటారు. ఇది స్పష్టంగా పాత కక్షలు, ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో జరిగిన హత్యగా తేలింది. దీనిపై సిబిఐ దర్యాప్తు జరిగి, కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో ఈ హత్య వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందన్న‌ ఆరోపణలు విన‌ వచ్చాయి. అయితే, ఇది పక్కా ఫ్యాక్షన్ గొడవగా రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా నిందితుల శిక్షను ఖరారు చేసింది.ఇంత‌టి భ‌యంక‌రంగా ఉంటాయి వైయ‌స్ కుటుంబ మ‌ర‌ణాలు. ఒక్కో స‌మ‌యంలో ఒక్కో మ‌ర‌ణం అంతులేని మిస్ట‌రీగా మారి ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను తొలిచేస్తుంటాయి. 1998లో రాజారెడ్డి మ‌ర‌ణం జ‌నాన్ని తీవ్రంగా ప‌ట్టి పీడించ‌గా.. మ‌రో 11 ఏళ్ల‌కు ఆయ‌న కొడుకు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం కూడా అలాగే జ‌నం నోళ్ల‌లో నాని సంచ‌ల‌నం సృష్టించింది. సుమారు ఇంకో ప‌ద‌కొండేళ్ల‌కు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు వివేకానంద రెడ్డి మ‌ర‌ణం కూడా స‌రిగ్గా అలాంటి సంచ‌ల‌నంగానే మారి.. ఇప్ప‌టికీ అంతు చిక్క‌కుండా ఉంది. ప్ర‌తి ప‌ది, ప‌ద‌కొండేళ్ల మ‌ధ్య కాలంలో సంభ‌వించే ఈ మ‌ర‌ణాలు ఏం చెబుతున్నాయి? ఇవి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను ఎందుకు తొలిచేస్తున్నాయ‌న్న‌ది అంతుచిక్క‌ని మిస్ట‌రీగా మారింది.

Publish Date: Mar 19, 2026 6:12PM

political-news-img

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు... భారీ నష్టాలు

పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు, అమెరికా జోక్యం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు ఇన్వెస్టర్ల కొంపముంచాయి. గురువారం (మార్చి 19) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు మార్కెట్‌ను మరింత భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 110 డాలర్ల మార్కును దాటింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతుంది. దాంతో ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుంది. యుద్ధం కారణంగా రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది దిగుమతులను మరింత ప్రియం చేస్తూ ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశాన్ని చూపుతోంది. మరోవైపు, అమెరికా స్టాక్ మార్కెట్ డౌ జోన్స్, జపాన్‌కు చెందిన నిక్కీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో భారతీయ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని గంటల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్స్యూమర్ సెక్టార్ షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేవలం డిఫెన్స్, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ షేర్లు మాత్రమే స్వల్పంగా నిలదొక్కుకున్నాయి.

Publish Date: Mar 19, 2026 5:44PM

political-news-img

ఆటతో పాటు చదువు ముఖ్యమే...పీవీ సింధు కీలక వ్యాఖ్యలు

క్రీడల్లో రాణించాలనుకునే యువత కేవలం ఆటలకే పరిమితం కాకుండా చదువుపై కూడా దృష్టి సారించాలని భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు హితవు పలికారు. జీవితాంతం క్రీడల్లో కొనసాగడం సాధ్యం కాదు కాబట్టి, విద్య అనేది ప్రతి ఒక్కరికీ ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సింధు, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. క్రీడా రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమ, క్రమశిక్షణ అవసరమని, అదే సమయంలో విద్యావంతులుగా ఎదగడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆటల్లో గాయాలు లేదా ఇతర కారణాల వల్ల కెరీర్ మధ్యలోనే ఆగిపోయినా, విద్య మనల్ని నిలబెడుతుందని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా చాలామంది క్రీడాకారులు ప్రాక్టీస్ కోసం చదువును పక్కన పెడుతుంటారని, కానీ తాను మాత్రం బ్యాడ్మింటన్ ఆడుతూనే ఎంబీఏ వరకు పూర్తి చేశానని సింధు గుర్తు చేశారు. చదువు మనిషికి విజ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే పరిపక్వతను కలిగిస్తుందని ఆమె వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో క్రీడలను వృత్తిగా ఎంచుకునే వారికి ప్రభుత్వం, విద్యా సంస్థలు పూర్తి సహకారం అందిస్తున్నాయని సింధు తెలిపారు. కాబట్టి విద్యార్థులు సమయాన్ని సరైన విధంగా కేటాయించుకుని అటు చదువులో, ఇటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కేవలం మార్కుల కోసమే కాకుండా, వారి అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్తులో ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపాలంటే విద్యే ఆయుధమని ఆమె స్పష్టం చేశారు. సింధు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, వర్ధమాన క్రీడాకారుల్లో కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. క్రీడల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సింధు మాటలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: Mar 19, 2026 5:28PM

political-news-img

పైలట్‌గా మారిన కివీస్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్

న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో అద్భుతమైన ఫీల్డర్ గా, పవర్ ఫుల్ హిట్టర్ గా పేరుతెచ్చుకున్న గ్లెన్ ఫిలిప్స్, ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మైదానంలో గాలిలో తేలుతూ అసాధ్యమైన క్యాచ్‌లను పట్టే ఈ 'సూపర్‌మ్యాన్', ఇప్పుడు నిజంగానే ఆకాశంలో విమానం నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆక్లాండ్ నగర గగనతలంలో ఆయన విమానాన్ని నడుపుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. పైలట్‌గా మారిన వైనం తాజాగా గ్లెన్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆయన సెన్నా 172 (Cessna 172) రకానికి చెందిన చిన్న విమానాన్ని అత్యంత నైపుణ్యంతో నడుపుతూ, ఆక్లాండ్‌లోని ఆర్డ్‌మోర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడం కనిపించింది. కేవలం సరదా కోసం కాకుండా, ఒక వృత్తిపరమైన పైలట్‌ తరహాలో ఆయన కాక్‌పిట్ నియంత్రణలను హ్యాండిల్ చేయడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. నిజానికి ఫిలిప్స్‌కు విమానాలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆర్థిక కారణాల వల్ల గతంలో పైలట్ శిక్షణ తీసుకోలేకపోయినప్పటికీ, క్రికెట్‌లో స్థిరపడ్డాక తన కలను నిజం చేసుకున్నారు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో గాయపడినప్పుడు, ఆ విరామ సమయాన్ని వృథా చేయకుండా పైలట్ లైసెన్స్ కోసం కష్టపడ్డారు. రోజుకు దాదాపు 12 గంటల పాటు థియరీ పరీక్షల కోసం చదివి, చివరకు 2025 సెప్టెంబర్‌లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌ను (PPL) సాధించారు. క్రికెట్ వదిలితే పైలట్‌గానే.. విమానయానం పట్ల తనకున్న మక్కువను ఫిలిప్స్ గతంలోనే వెల్లడించారు. "ఒకవేళ నేను క్రికెటర్ కాకపోయి ఉంటే కచ్చితంగా పైలట్ అయ్యేవాడిని. గాలిలో విమానం నడపడం నాకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కమర్షియల్ పైలట్‌గా స్థిరపడాలనేది తన లక్ష్యమని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయన ప్రస్తుతం కమర్షియల్ పైలట్ లైసెన్స్ దిశగా గంటల కొద్దీ ఫ్లైట్ సిమ్యులేటర్లపై ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం కివీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఫిలిప్స్, త్వరలో భారత్‌లో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆయన బరిలోకి దిగనున్నారు. మైదానంలో బ్యాట్ తో మెరుపులు మెరిపించే ఈ 'ఫ్లయింగ్ ఫిలిప్స్', ఐపీఎల్ లో కూడా అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Publish Date: Mar 19, 2026 4:51PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img