కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్: యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు.!
Publish Date:Nov 17, 2026
Advertisement
కోనసీమ జిల్లాలో మరో బ్లో అవుట్ సంభవించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో సీఎన్జీ గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. మూసివేసిన వెల్ నుంచి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో బ్లో అవుట్ సంభవించింది. దీంతో సమీప ప్రాంతంలోని జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ నిపుణులు ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. అదలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బ్లోఅవుట్ పై అధికారులతో చర్చించారు. ఈ ప్రమాద తీవ్రతపై జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరం గ్రామంలోని తాడివారిమెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి నుంచి ఈ భారీ లీకేజీ చోటుచేసుకుంది. మంగళవారం (నవబర్ 17) తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ బయటకు తన్నుకువచ్చింది. ఈ లీకేజ్ కారణంగా మంటలు వ్యాపించకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. లీకవుతున్న గ్యాస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి, గ్యాస్ బావి చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలోని నివాస ప్రాంతాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని, వెల్ హెడ్ పటిష్టంగానే ఉందని ఓఎన్జీసీ అధికారులు ప్రకటించారు. భూమి ఉపరితలానికి సమీపంలో గ్యాస్ విస్తరించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా, ఆ ప్రాంతంలో ఉన్న డీజిల్ జనరేటర్లు, విద్యుత్ పరికరాలను దూరంగా తరలించారు. ఇది కూడా చదవండి: కోనసీమ కొలిమి.. బ్లో ఔట్.. మంటల నియంత్రణకు మరో వారం! ప్రస్తుతం గ్యాస్ బావి నుంచి వెలువడుతున్న లీకేజీని శాశ్వతంగా అరికట్టేందుకు ప్రత్యేక సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంటోంది. మరోవైపు, ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో తరచూ ఇటువంటి గ్యాస్ లీకేజీ ఘటనలు పునరావృతం కావడం పట్ల సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఓఎన్జీసీ ఛైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత భద్రతా చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ వాటిల్లకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మీకు నచ్చవచ్చు: ఓఎన్జీసీ రిగ్ వద్ద అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు చిన్నారి కోసం రంగంలోకి దిగిన ఓఎన్జీసీ [Konaseema, Blowout, GasLeak, CBN, Review,TeluguOne]
http://www.teluguone.com/news/content/konaseema-43-237292.html





