Home

»

Tv News

బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్‌కి రెడీ అయిన రోజా!

Apr 16, 2026

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి, రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి మళ్ళీ తన సొంత గూటికి చేరుకున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ బుల్లితెరకు దూరమైన రోజా, ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. జీ తెలుగు వేదికగా 'ది ఫ్యామిలీ అసెంబ్లీ' అనే వినూత్న రియాలిటీ షోతో ఆమె మళ్లీ మెరవనున్నారు. ఈ షోకి సంబంధించిన అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో, బుల్లితెరపై జడ్జిగా రోజా అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘జబర్దస్త్’ వంటి షోల ద్వారా ఆమె వేసే పంచ్‌లు, ఆమె నవ్వు ప్రేక్షకులకు బాగా అలవాటయ్యాయి. ఇప్పుడు 'ది ఫ్యామిలీ అసెంబ్లీ' ప్రోమో చూస్తుంటే, రోజా తన పాత మేనరిజమ్స్‌తో పాటు మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఈ షోలో ఆమె ఒక సింహాసనంపై కూర్చుని ఉండటం, అసెంబ్లీ తరహా సెటప్ ఉండటంతో షో పేరుకు తగ్గట్టుగానే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అనిపిస్తోంది.

“Unlimited Fun, Unfiltered Roja” అనే ట్యాగ్‌లైన్ ఈ షో ప్రత్యేకతను చాటిచెబుతోంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా, ఈ షోలో మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ, కడుపుబ్బ నవ్వించే ప్లాన్ చేశారు. అసెంబ్లీలో వినిపించే ‘అధ్యక్షా..’ అనే పదాన్ని ఇక్కడ వినోదం కోసం ఎలా వాడుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాయి. రోజా తన మార్క్ డైలాగులతో మళ్లీ బుల్లితెర రారాణిగా నిలవడం ఖాయమని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రేజీ రియాలిటీ షో ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో 'ది ఫ్యామిలీ అసెంబ్లీ' గ్రాండ్ లాంచ్ కాబోతోంది. టీవీలో మాత్రమే కాకుండా, జీ5 (ZEE5) ఓటీటీ యాప్‌లో కూడా ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం పూట కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునే విధంగా ఈ షోని డిజైన్ చేశారు.

రాజకీయ రణక్షేత్రం నుండి మళ్ళీ వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజా, ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. బుల్లితెర ప్రేక్షకులు ఆమె ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి 'ది ఫ్యామిలీ అసెంబ్లీ' ఎంతటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com