
ఇవ్వడమే తప్ప తిరిగి మీ దగ్గర్నుంచి ఆశించేది ఏది లేదు అంటూ ఓటిటి చిత్రాలు ప్రేక్షకులకి కావాల్సినంత సినీ వినోదాన్ని అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఆ సినీ వినోదం అన్ స్టాబబుల్ గా ఉండనుంది. ఆ విషయంలో తగ్గదేలే అనే రీతిలో స్ట్రీమింగ్ దిగ్గజం 'జీ5' ఊహించని మెగా సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఇప్పటివరకు కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా 7 విభిన్న భారతీయ భాషల్లో 60కి పైగా కొత్త సినిమాలు, ఆరిజినల్ వెబ్ సిరీస్‌లు, ప్రత్యక్ష క్రీడలు మరియు గ్రాండ్ షోలతో అతిపెద్ద కంటెంట్ లైనప్‌ని అధికారికంగా ప్రకటించడం సంచలనం అని చెప్పవచ్చు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషలని కలుపుకుని రూపొందించిన ఈ వినోద పండుగ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త రికార్డులని సృష్టించబోతోంది.
ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌లో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన ఆకర్షణలు సిద్ధం చేశారు. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల మోస్ట్ అవేటెడ్ సినిమాల డిజిటల్ హక్కులని జీ5 సొంతం చేసుకోవడం గమనార్హం. విక్టరీ వెంకటేష్, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'వెంకీ అనిల్ 5' (Venky Anil 5), నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న భారీ చిత్రం 'ఎన్‌బీకే 111' (NBK111) మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వృషభకర్మ' (Vrushakarma) వంటి క్రేజీ చిత్రాలు జీ5 ద్వారా ఓటీటీలోకి రాబోతున్నాయి. కేవలం సినిమాలే కాకుండా నాణ్యమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌లపై కూడా జీ5 ప్రత్యేక దృష్టి సారించింది. ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శ్రీమతి' అనే డిజిటల్ వెబ్ సిరీస్‌తో ఆమె మళ్లీ ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్న కోర్ట్‌రూమ్ డ్రామా 'అబ్జెక్షన్ మైలార్డ్' కూడా జీ5 ఒరిజినల్‌గా ప్రేక్షకు ముందుకు రానుంది. దీనితో పాటు ఎంతో ప్రజాదరణ పొందిన టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా' కొత్త సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్మాణాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వంటి టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థలతో జీ5 చేతులు కలిపింది.
హిందీ విభాగంలో కూడా జీ5 సుమారు డజనుకి పైగా భారీ ప్రాజెక్టులను ప్రకటించి అంచనాలను ఆకాశానికెత్తింది. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న బైయోపిక్ 'కాంబ్లీ' (Kambli) తో పాటు 'ది స్కామ్: లీక్డ్', 'కాఫీ కింగ్' మరియు నటుడు ఆర్. మాధవన్ హోస్ట్ చేస్తున్న 'జీనా ఇసీ కా నామ్ హై 2.0' వంటి సరికొత్త షోలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. అంతేకాకుండా, 90ల నాటి ఐకానిక్ హారర్ షో 'జీ హారర్ షో' మళ్లీ కొత్త రూపంలో తిరిగి రాబోతుండటం విశేషం. బాలీవుడ్ చిత్రాలైన వరుణ్ ధావన్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', బాబీ డియోల్ 'బందర్', కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత', మరియు మృణాల్ ఠాకూర్ 'పూజా మేరీ జాన్' వంటి భారీ సినిమాలు జీ5 లైనప్‌లో నిలిచాయి. అదనంగా 'రంగ్ బాజ్ 4', 'జానావార్ 2' వంటి పాపులర్ ఫ్రాంచైజ్ సిరీస్‌లు రానున్నాయి.
Also read: పరశురామ్ దర్శకత్వంలో నందమూరి హీరో.. హిట్ ఖాయమేనా!
తమిళంలో 'కూసే మునిసామి వీరప్పన్', 'తడయం', 'అనంథకాలమ్' మరియు నయనతార నటిస్తున్న 'హాయ్!' సినిమాలు వినోదాన్ని పంచనున్నాయి. కన్నడలో 'బిట్‌కాయిన్ స్కామ్', మలయాళంలో 'బాలన్ ది బై', మరాఠీలో 'భూతమ్ భయమ్', బెంగాలీలో 'లాల్‌బజార్' సిరీస్‌లతో పాటు దాదాపు 100 శాతానికి పైగా రీజినల్ కంటెంట్‌ను బలపరిచారు. వినోదంతో పాటు ప్రపంచవ్యాప్త లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అయిన ఫిఫా (FIFA), బుండెస్లిగా, ఐఎల్టీ సీజన్ 5, మరియు తమిళనాడు కబడ్డీ మ్యాచ్‌లను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపొందించిన ఫాంటసీ, యానిమేషన్, మరియు పిల్లల కంటెంట్ డిజిటల్ వీక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. మొత్తానికి ఏకంగా 60కి పైగా ప్రొడక్షన్లతో జీ5 డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించబోతోంది.
zee5, ott movies, tollywood






