
- ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్
- అసలు ఎవరీ భరత్ భూషణ్?
- ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
- సినీ రంగంతో ఉన్న అనుబంధం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియమితులైన విషయం తెలిసిందే. సినీ రంగానికి తెలిసిన వారికి ఆయన ప్రస్థానం గురించి తెలుసు కానీ, సామాన్యులకు ఆయన గురించి పెద్దగా తెలియదు. గత రెండు దశాబ్దాలుగా సినీ రంగంతో భరత్ భూషణ్ కు అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అందుకే భరత్ భూషణ్ ను ఈ పదవి వరించింది.
సినిమాలపై ఉన్న మక్కువతో దాదాపు 20 సంవత్సరాల క్రితం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన భరత్ భూషణ్, డిస్ట్రిబ్యూటర్ గా తనదైన ముద్ర వేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి, పంపిణీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, కళాత్మక విలువలున్న సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.
భరత్ భూషణ్ కేవలం డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా, పరిశ్రమలోని వివిధ విభాగాల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ.. అటు ప్రభుత్వానికి ఇటు పరిశ్రమకు మధ్య వారధిలా నిలిచారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు.. ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయపరంగా అండగా నిలబడి అందరికీ మంచి చేస్తూ వచ్చారు. అలాగే, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
సినీ రంగంతో పాటు పారిశ్రామికవేత్తగా కూడా భరత్ భూషణ్ రాణిస్తున్నారు. 'భరత్ ఇన్ఫ్రా' అనే సంస్థను స్థాపించి.. వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు.
రాష్ట్రంలో చలన చిత్ర, టీవీ, నాటక రంగాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల భరత్ భూషణ్ కి చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. "నాటక కళకు పూర్వ వైభవం తీసుకురావడం", "చిన్న తరహా టీవీ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు అండగా నిలవడం", "ఏపీలోని సుందర ప్రాంతాల్లో సినిమా షూటింగ్స్ పెంచేలా రాయితీలు, సౌకర్యాలు కల్పించడం"పై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
భరత్ భూషణ్ వంటి అనుభవజ్ఞుడైన వ్యక్తి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ కళారంగాలకు శుభసూచకం. సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన, అందరినీ కలుపుకొని పోయే గుణం ఉన్న ఆయన నాయకత్వంలో.. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.






