TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

అమీర్‌పేట వీధుల్లో ‘బిచ్చగాడు’ సందడి.. మిర్చి బజ్జీలు వేసి, బన్ మస్కా తిన్న హీరో.!

Nov 24, 2026 1:41PM

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ హైదరాబాద్‌లో సందడి చేశారు. తన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ ప్రమోషన్ల కోసం నగరానికి వచ్చిన ఆయన.. అమీర్‌పేట వీధుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చిత్ర బృందంతో కలిసి సాధారణ వ్యక్తిలా వీధుల్లో తిరిగారు.

ఈ సందర్భంగా చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన విజయ్ ఆంటోనీ, ఓ మిర్చి బజ్జీల బండి వద్ద ఆగారు. అక్కడ స్వయంగా మిర్చి బజ్జీలు వేయడం మొదలుపెట్టారు. తన అభిమాన హీరో ఇలా రోడ్డుపై బజ్జీలు తయారు చేయడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆయన బజ్జీలు వేస్తున్న దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అక్కడితో ఆగకుండా విజయ్ ఆంటోనీ తన చేతులతో తయారు చేసిన మిర్చి బజ్జీలను అభిమానులకు, స్థానికులకు పంచిపెట్టారు. సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ప్రమోషన్ల కోసం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం ఇలా నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారితో సరదాగా గడపడం విశేషం.

ఆ తర్వాత ఏషియన్ సత్యం మాల్ సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లిన విజయ్ ఆంటోనీ.. అక్కడ చాయ్ తాగుతూ బన్ మస్కా రుచి చూశారు. హోటల్‌లో ఉన్నవారితోనూ సరదాగా ముచ్చటించారు. ఆయనను చూసిన అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం ఆసక్తి చూపించారు. సుమారు అరగంటపాటు సాగిన ఈ పర్యటనతో అమీర్‌పేట పరిసరాల్లో సందడి నెలకొంది.

ఇది కూడా చదవండి: ఇరాన్‌ గాయని, ఆమె బృందానికి 74 కొరడా దెబ్బల శిక్ష.. అసలేం జరిగింది.!

ఇటీవలే చెన్నై నుంచి కోయంబత్తూరుకు జనరల్ బోగీలో ప్రయాణించి వార్తల్లో నిలిచిన విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇలా సాధారణ వ్యక్తిలా కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సినిమాల ప్రచారంలోనూ విభిన్నమైన పద్ధతులను అనుసరిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. ఆయన సింప్లిసిటీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.

విజయ్ ఆంటోనీ, ప్రీతి ఆస్రానీ నటించిన ‘నాన్న కుట్టి’ సినిమా నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ప్రమోషన్లలో భాగంగా స్టార్ హోటళ్లకు పరిమితం కాకుండా అమీర్‌పేట వీధుల్లో మిర్చి బజ్జీలు వేయడం, బన్ మస్కా తినడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది.

మీకు నచ్చవచ్చు: 

ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో భార‌త్‌కు నిరాశ‌.. విజేత‌లు ఎవ‌రంటే.?

డింపుల్ హయతి పెళ్లి: పెళ్లి కొడుకు ఇతనే.. ఇప్పుడు క్లియర్‌గా అందరికీ అర్థమైంది.!

 

[VijayAntony, VijayAntonyAmeerpet, Bichagadu, NannaKutti, PreethiAsrani]

google-ad-img