
విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కాంబినేషన్ లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఒక క్రేజీ మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రేపు, అంటే జూన్ 18 ఉదయం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
చిత్ర యూనిట్ షేర్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తే, పచ్చని అరటి ఆకులు, సూర్యకాంతితో కూడిన పండుగ వాతావరణం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. దీనిని బట్టి ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్‌గారు తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఐదో చిత్రమిది (#VenkyAnil5). అలాగే దర్శకుడిగా తన తొలి సినిమా అయిన 'పటాస్' హీరో కళ్యాణ్ రామ్ తో రావిపూడికి ఇది రెండో సినిమా (#NKRAR2). దాంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్ రామ్ యాక్షన్ కలగలిసి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి కానుకగా రాబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి రేసులో నిలవబోతున్న ఈ గ్రాండ్ ఎంటర్‌టైనర్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






