Home

»

Latest News

భయం గుప్పిట్లో బాలీవుడ్!: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రెక్కీలతో వణికిపోతున్నసెలబ్రిటీలు! 

Oct 22, 2026 11:00AM

 


బాలీవుడ్.. కోనసీమలో సినిమా షూటింగ్ జరిగితే ఎంత ప్రశాంత వాతావరణం ఉంటుందో, అంతే వాతావరణంలో షూటింగ్స్ ని జరుపుకుంటూ విజయాల్ని అందుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తూ ఉంది. కానీ ఇప్పుడు  అండర్ వరల్డ్  మాఫియా వార్నింగ్, రివాల్వర్  దాడులతో బెంబేలేత్తిపోతుంది. దీంతో 1980 , 90వ దశకాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రూపంలో బాలీవుడ్‌కి సరికొత్త , అత్యంత భయంకరమైన గన్ షాడో ముప్పు చుట్టుముట్టింది. కేవలం ఎక్స్‌టార్షన్ లేదా డబ్బు డిమాండ్ చేయడమే కాకుండా, సెలబ్రిటీల ప్రాణాలని తీసే వరకు వెళ్తున్న ఈ పరిణామాలు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన ఈ కలకలాన్ని తారస్థాయికి చేర్చింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడినప్పటికీ,  డ్రైవర్, మరో వ్యక్తి గాయపడటంతో బాలీవుడ్ ప్రముఖుల్లో భయం మరింత పెరిగింది. ఈ మొత్తం హింసాత్మక పరంపర వెనుక అసలు మూలం సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి. 

1998 నాటి కృష్ణజంకల (బ్లాక్‌బక్) హత్యాకాండ కేసుకు సంబంధించిన పాత కక్షల కారణంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిత్యం సల్మాన్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది. దీనికి కొనసాగింపుగా 2024 ఏప్రిల్‌లో సల్మాన్ బాంద్రా నివాసం బయట బైక్‌లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత 2024 అక్టోబర్ 12న సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీని ముంబైలోనే దారుణంగా కాల్చి చంపడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సల్మాన్‌తో ఎవరికైనా స్నేహం ఉంటే లేదా ఎవరైనా ఆయనతో కలిసి పనిచేస్తే వారు తమ గ్యాంగ్‌కు శత్రువులేనని బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగానే హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్‌ను టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేసినప్పటికీ, ఆయన నివాసం వద్ద ఉన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా దుండగులు తమ వ్యూహాన్ని మార్చుకుని, టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియా అప్‌డేట్స్ మరియు లొకేషన్‌ను నిరంతరం పర్యవేక్షించి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.  

 

 సల్మాన్ సర్కిల్ మాత్రమే కాకుండా, ఈ హింసాత్మక జాబితా రోజురోజుకూ విస్తరిస్తోంది. 2026 ఫిబ్రవరిలో ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్‌ని 10 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు వాయిస్ మెసేజ్ రావడం, అదే సమయంలో ఆయన స్టాఫ్‌కు కూడా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం కలకలం రేపింది. సరిగ్గా అదే కాలంలో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మకు సైతం క్రిప్టోకరెన్సీ రూపంలో భారీ రన్సమ్ ఇవ్వాలని ఈమెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. కొద్ది నెలల ముందు కూడా ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరగడం గమనించదగ్గ విషయం. ఇక 2026 జూలైలో బాలీవుడ్ బాద్‌షా ఆమిర్ ఖాన్‌ను కూడా ఈ బెదిరింపులు తాకాయి. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ సోషల్ మీడియా మరియు ఆడియో మెసేజ్‌ల ద్వారా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.   ఒకప్పుడు కేవలం వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వనరుల కోసమే అండర్ వరల్డ్ దాడులు జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తగినంత భద్రత, కోట్లాది రూపాయల వనరులు స్టార్ డమ్ ఉన్న బాలీవుడ్ ప్రముఖులే ఇలా వరుసగా గ్యాంగ్‌స్టర్ల దాడులని  ఎదుర్కొవాల్సి రావడం కేవలం సినీ రంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇదొక పెద్ద లా అండ్ ఆర్డర్ సవాల్‌గా మారింది. ఏది ఏమైనా బాలీవుడ్ సెలబ్రిటీస్ లో భయం మాత్రం నెలకొని ఉందనేది వాస్తవం. 

 

[underworld returns to bollywood the lawrence bishnoi threat, Lawrence Bishnoi, Bollywood underworld, Tiger Shroff shooting, Bollywood, telugu cinema news, TeluguCinema, Tollywood, Tollywood news]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com